breaking news
tomahawk missiles
-
యుద్ధం ఆపకుంటే ఉక్రెయిన్‌కు తొమహాక్లు ఇస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపకుంటే తాము ఉక్రెయిన్‌కు అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులైన తొమహాక్లు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్‌కు వెళ్తూ తన విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘ఈ యుద్ధానికి ముగింపు పలకకుంటే నేను వారికి (ఉక్రెయిన్) తొమహాక్లు అందజేస్తాను. తొమహాక్లు చాలా ప్రత్యేకమైనవి, శక్తిమంతమైనవి, ప్రభావవంతమైనవి. నిజంగా చెప్తున్నా ఉక్రెయిన్ చేతికి ఇలాంటి ఆయుధాలు అందటం రష్యాకు అస్సలు మంచిది కాదు. ఉక్రెయిన్‌కు తొమహాక్లు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, యుద్ధాన్ని ముగించేందుకు అదే సరైన పని. ఇలాంటి పరిస్థితి రావాలని రష్యా కోరుకోదనే అనుకుంటున్నా. ఈ అంశంపై నేను రష్యాతోనూ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందజేసేందుకు సిద్ధమని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై కీలకమైన ఆయుధాలు వాడకుండా రష్యాపై కూడా తాను ఒత్తిడి తీసుకురాగలనని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్‌కు తొమహాక్ క్షిపణులు అందిస్తే రష్యా– అమెరికా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని పుతిన్ ఇటీవలే హెచ్చరించారు. ఏమిటి తొమహాక్ల ప్రత్యేకత? తొమహాక్ క్షిపణుల పూర్తిపేరు బీజీఎం–109 తొమహాక్ లాండ్ అటాక్ మిసైల్స్ (టీఎల్ఏఎం). ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా లక్ష్యాన్ని అత్యంత కచి్చతత్వంతో ధ్వంసం చేయగలవు. జెట్ ఇంజన్ శక్తిగత ఈ సబ్‌సోనిక్ క్యూయిజ్ క్షిపణులను ప్రస్తుతం అమెరికా నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలు వాడుతున్నాయి. వీటిని యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగిస్తారు. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీలోని అప్లయిడ్ ఫిజిక్స్ లే»ొరేటరీ వీటిని అభివృద్ధి చేసింది. 1970 దశకంలో వీటిని జనరల్ డైనమిక్స్ మొదట ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత కాలానుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వీటితో బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు. యుద్ధనౌకలతోపాటు భూమిపై ఉండే లక్ష్యాలను కూడా ధ్వంసం చేయవచ్చు. ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు రూ.18 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో వివిధ రకాలున్నాయి. టీఎల్ఏఎం బ్లాక్ 2 క్షిపణి రేంజ్ 2,500 కిలోమీటర్లు. బ్లాక్ 3 రేంజ్ 1,300 కిలోమీటర్లు. సబ్‌మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణుల రేంజ్ వేరుగా ఉంటుంది. ఇవి శత్రు రాడార్లను ఏమార్చి దాడులు చేయగలవు. -
సిరియాపై అమెరికా క్షిపణి దాడి
59 క్షిపణులతో షాయ్‌రత్ ఎయిర్‌బేస్ విధ్వంసం ► నలుగురు చిన్నారులు సహా 9 మంది మృతి ► ‘రసాయనిక దాడి’కి ప్రతీకారంగానే డమాస్కస్: మధ్య సిరియాలోని షాయ్‌రత్ వైమానిక స్థావరం చుట్టుపక్కల శుక్రవారం అమెరికా క్షిపణులతో దాడి చేసింది. ఇటీవల సిరియాలోని ఖాన్ షేఖున్ లో జరిగిన రసాయనిక దాడికి ఈ ఎయిర్‌బేస్ నుంచే కార్యాచరణ జరిగిందనే సమాచారంతో 59 తొమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో మెరుపు దాడి చేసింది. ఈ దాడుల్లో 9 మంది సిరియన్ పౌరులు మృతిచెందారు. ఇందులో నలుగురు చిన్నారులున్నారని సిరియా వార్తా సంస్థ సనా వెల్లడించింది. ‘అమెరికా షాయ్‌రత్ ఎయిర్‌బేస్ చుట్టుపక్కన ఉన్న అల్–హమ్రత్, అల్–మంజుల్ గ్రామాలపై క్షిపణులతో విరుచుకుపడింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై ఆరేళ్లుగా అమెరికా, రష్యా వేర్వేరు సంకీర్ణాలుగా పోరాటం చేస్తున్నాయి. మంగళవారం ఐసిస్ ఆధీనంలోని ఓ పట్టణంపై జరిగిన రసాయనిక దాడిలో వంద మందికి పైగా మరణించటం.. వందల సంఖ్యలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘రసాయనిక దాడి అనాగరికం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రెండ్రోజుల్లోనే క్షిపణి దాడి జరిగింది. దాడి అనాలోచితం, బాధ్యతారాహిత్యం తమ ఎయిర్‌బేస్‌పై అమెరికా క్షిపణి దాడి అనాలోచితం, బాధ్యతారాహిత్యమని సిరి యా అధ్యక్షుడు అసద్ తీవ్రంగా విమర్శిం చారు. ‘అమెరికా నేడు చేపట్టిన ఈ దాడులు అర్థరహితం. ఇది అమెరికా హ్రస్వదృష్టికి, గుడ్డి రాజకీయ, మిలటరీ విధానాలకు నిదర్శనం. సిరియా సార్వభౌమత్వం లక్ష్యంగా జరిగిన దురదృష్టకర ఘటనగా భావిస్తున్నాం’ అని అల్–అసద్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సిరియన్ మిలటరీ వద్ద ఎలాంటి రసాయనిక ఆయుధాల్లేవని స్పష్టం చేసింది. స్వాగతించిన ప్రపంచ దేశాలు సిరియా ఎయిర్‌బేస్‌పై అమెరికా దాడిని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. వంద మందిని పొట్టన పెట్టుకున్న రసాయనిక దాడికి ప్రతీకారంగానే క్షిపణి దాడి జరిగిందని, దీనికి తమ సంపూర్ణ మద్దతుంటుందని యూకే, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర దేశాలు ప్రకటించాయి. సిరియాలో శాంతి నెలకొనేందుకు అన్ని దేశాలూ సహకరించాలని.. సిరియా ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలను ఆపేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటెరస్ కోరారు. దీనిపై భద్రతామండలి అత్యవసరంగా సమావేశమైంది. తొమాహాక్ మిసైల్ అంటే! సిరియాపై దాడిలో 59 తొమాహాక్ క్రూయిజ్ క్షిపణులు వినియోగించింది. 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయటంలో వీటిని అమెరికా వాడింది. వెయ్యి పౌండ్ల బరువైన వార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. 20 అడుగుల పొడుగుండే తొమాహాక్ గంటలకు 880 కిలోమీటర్ల వేగంతో దూసుపోతుంది. అయితే శుక్రవారం నాటి దాడుల్లో తొలిసారిగా నేవీ నౌకలనుంచి ఎయిర్‌బేస్‌పైకి దీన్ని వినియోగించారు. రష్యా, ఇరాన్ ఖండన ఇది ఏకపక్ష నిర్ణయమని ఇరాన్, రష్యా విమర్శించాయి. ఈ దాడులు ‘సిరియా సార్వభౌమత్వానికి వ్యతిరేకం. అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని పేర్కొన్నాయి. భవిష్యత్తులో అమెరికా–రష్యా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని వెల్లడించింది. అమెరికా క్షిపణి దాడులపై చర్చించేందుకు అత్యవసరంగా భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది. అమెరికన్ క్షిపణి దాడుల్లో షాయ్‌రత్ ఎయిర్‌బేస్‌లోని 9 సిరియన్ విమానాలతోపాటుగా.. సమీపంలోని ఆయుధాగారం, ఇంధన డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయని రష్యా టీవీ చానెల్ వెల్లడించింది. -
తోమహాక్ క్షిపణులే ఎందుకు?
అమెరికా నౌకాదళం సిరియా మీద దాడులకు ఉపయోగించుకున్న ప్రధానాస్త్రం.. తోమహాక్ క్షిపణులు. చాలా దూరం నుంచి ప్రయోగించినా కూడా కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం వీటికి ఉంటుంది. 1991 ప్రాంతంలో జరిగిన గల్ఫ్ యుద్ధంలో కూడా అమెరికా వీటిని విస్తృతంగా ఉపయపోగించింది. వీటికి సాధారణంగా 455 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. చిట్టచివరిసారిగా వీటిని ఎర్ర సముద్రం నుంచి యెమెన్‌లోని కోస్టల్ రాడార్ సైట్ల మీద పెంటగాన్ ప్రయోగించింది. అమెరికా నౌకల మీద హౌతీ రెబెల్స్ క్షిపణిదాడులు చేయడంతో వారిని అడ్డుకునేందుకు వీటిని వేసింది. ఇక తాజాగా సిరియా వైమానిక స్థావరం మీద చేసిన దాడుల కోసం.. మధ్యధరా సముద్రంలో ఉన్న యుద్ధనౌకల మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు. తోమహాక్ క్షిపణులను ప్రయోగించాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుంచి వీటిని నౌకాదళం ప్రయోగించగలదు. అంత దూరంలో ఉన్న నౌకల మీదకు శత్రువులు తమ వాయుసేనతో వచ్చేందుకు కూడా వెంటనే అవకాశం ఉండదు. తోమహాక్ క్షిపణుల కంటే కూడా అమెరికా సైనిక విమానాలు ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలవు. కానీ, వాటిని తప్పనిసరిగా మనుషులే నడపాల్సి ఉంటుంది. శత్రుసేనలు వాటిమీద సులభంగా దాడి చేయగలవు. తోమహాక్ క్షిపణుల్లో కొన్ని క్లస్టర్ బాంబులను కూడా తీసుకెళ్లి, వాటిని టార్గెట్ మీద విరజిమ్మగలవు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా ధ్వంసం అవుతాయి. అయితే యుద్ధ విమానాల నుంచి వదిలే బాంబులు మరింత ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. ఒకవేళ యుద్ధవిమానాలు వాడాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంటే, అప్పుడు తప్పనిసరిగా నౌకాదళ విమానాలే వాడాల్సి ఉంటుంది. అంటే హారియర్ జెట్లు అన్నమాట. సిరియా సైన్యం ఎక్కువగా ఎస్-200 తరహా భూమ్మీద నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులను వాడుతుంది. అయితే, వాళ్లకు అండగా ఉన్న రష్యన్ సైన్యం మాత్రం ఎస్-300, ఎస్-400 తరహా క్షిపణులు వాడగలదు. ఇవి మామూలు వాటి కంటే చాలా వేగంగా వెళ్తాయి. వాటికి రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది. అమెరికా సైన్యం మాత్రం కొంతవరకు ఈఏ-18జి గ్రౌలర్ జెట్, ఇతర సాధనాలతో రష్యాన్ రాడార్లను జామ్ చేయగలదు. ఆ జామర్లను కూడా అధిగమించే సామర్థ్యం రష్యా దగ్గరున్న ఎస్-400 తరహా క్షిపణులకు ఉంటుంది. -
ఇది మాపై దురాక్రమణే: సిరియా
తమ సైనిక స్థావరంపై అమెరికా తోమహాక్ క్షిపణులతో దాడి చేయడాన్ని సిరియా తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా దురాక్రమణే అని సిరియా అధికారిక టీవీ చానల్ ప్రకటించింది. సిరియా రసాయన దాడులలో 70 మంది వరకు మరణించిన విషయాన్ని తీవ్రంగా ఖండించిన ఒక్క రోజు తర్వాతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై సిరియా అధ్యక్షుడు అసద్ అల్ బషర్ నేరుగా ఇంతవరకు స్పందించలేదు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా దీనిపై ఇంకా ఎలాంటి స్పందనలు రాలేదు. కానీ, తాము ముందుగానే సిరియాలో ఉన్న రష్యా దళాలకు తమ దాడుల గురించి సమాచారం అందించామని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడ వైమానిక స్థావరంలో ఉన్న రష్యన్, సిరియన్ బలగాలకు ముప్పు వీలైనంత తక్కువగా ఉండేందుకు గాను అమెరికా సైనిక వ్యూహకర్తలు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఆ ప్రకటనలో వివరించింది.