తమ సైనిక స్థావరంపై అమెరికా తోమహాక్ క్షిపణులతో దాడి చేయడాన్ని సిరియా తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా దురాక్రమణే అని సిరియా అధికారిక టీవీ చానల్ ప్రకటించింది.
తమ సైనిక స్థావరంపై అమెరికా తోమహాక్ క్షిపణులతో దాడి చేయడాన్ని సిరియా తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా దురాక్రమణే అని సిరియా అధికారిక టీవీ చానల్ ప్రకటించింది. సిరియా రసాయన దాడులలో 70 మంది వరకు మరణించిన విషయాన్ని తీవ్రంగా ఖండించిన ఒక్క రోజు తర్వాతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై సిరియా అధ్యక్షుడు అసద్ అల్ బషర్ నేరుగా ఇంతవరకు స్పందించలేదు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా దీనిపై ఇంకా ఎలాంటి స్పందనలు రాలేదు.
కానీ, తాము ముందుగానే సిరియాలో ఉన్న రష్యా దళాలకు తమ దాడుల గురించి సమాచారం అందించామని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడ వైమానిక స్థావరంలో ఉన్న రష్యన్, సిరియన్ బలగాలకు ముప్పు వీలైనంత తక్కువగా ఉండేందుకు గాను అమెరికా సైనిక వ్యూహకర్తలు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఆ ప్రకటనలో వివరించింది.