
భారత ప్రభుత్వం స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తి తయారీ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ విభాగంలో ఉత్పాదకత పెంచేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని పునరుద్ధరించేందుకు సన్నద్ధమవుతోంది. నిబంధనలను సడలించడం, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈమేరకు చర్యలు చేపడుతోంది.
పీఎల్ఐ 1.2 లేదా పీఎల్‌ఐ 2.0గా పిలువబడే రాబోయే పథకంలో గణనీయమైన సడలింపులు ఉండనున్నాయి. వీటిలో పనితీరు, మెట్రిక్స్ కోసం బేస్ ఇయర్‌ను 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి మార్చాలని చూస్తున్నారు. ఉక్కు ఉత్పత్తిదారులకు మూలధన పెట్టుబడుల నిబంధనలను సడలించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం సంబంధిత మంత్రిత్వశాఖదేనని గుర్తించాలి. బ్రౌన్ ఫీల్డ్ సామర్థ్య విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, కనీసం 25 అదనపు హైఎండ్, స్పెషాలిటీ స్టీల్ ఉత్పాదకతను పెంచేందుకు పీఎల్‌ఐ కవరేజీని విస్తరించాలని భావిస్తున్నట్లు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు.
ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్‌లో కొంచెం కఠిన నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించడంతో పరిశ్రమ వాటాదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని వాటిని సవరించనున్నట్లు మంత్రి చెప్పారు. పీఎల్‌ఐ పథకాన్ని మరిన్ని ఎంఎస్ఎంఈ సంస్థలకు చేరువ చేయాలని, ఈ విభాగంలో స్వావలంబన సాధించడానికి అన్ని పరిశ్రమ సూచనలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పీఎల్ఐ 1.0, పీఎల్ఐ 1.1 కలిపి రూ.44,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అయితే, కొన్ని అర్హత నిబంధనలను సడలించడం ద్వారా మరిన్ని సంస్థలను ఈ పరిశ్రమలోకి తీసుకురావడానికి, మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్ దండగా?
పీఎల్ఐ 1.2లో రాబోయే కీలక మార్పులు(అంచనా)
స్టీల్‌కు సంబంధించి బ్రౌన్ ఫీల్డ్ సామర్థ్య విస్తరణను సులభతరం చేయనున్నారు. తప్పనిసరి గ్రీన్ ఫీల్డ్ సామర్థ్య జోడింపు సడలించే అవకాశం ఉంది.
ఇంతకు ముందు ప్రోత్సాహక అర్హతతో ముడిపడి ఉన్న వార్షిక ఇంక్రిమెంటల్ ఉత్పత్తి లక్ష్యాలు ఇకపై తప్పనిసరి కాకపోవచ్చు.
అంతర్జాతీయ, దేశీయ ఉక్కు మార్కెట్ల ఒడిదుడుకులను అంగీకరిస్తూ, ఎంఓయూ లక్ష్యాల కంటే ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కంపెనీలు ప్రోత్సాహకాలు పొందడానికి అనుమతించవచ్చు.