
బతికి ఉన్నప్పుడు చూడలేని డబ్బు మనకెందుకని చాలా మంది అనుకుంటారు. దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపించరు. తీసుకున్నవారిలో కొందరేమో ‘ఛా.. ప్రీమియం అంతా వేస్ట్ అవుతుందే’ అని అనుకుంటూంటారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందిలో ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అపోహ-1
‘టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల డబ్బు దండగ. టర్మ్ ఇన్సూరెన్స్ కడితే బతికుంటే డబ్బు రాదు.. చనిపోతే వస్తుంది. అప్పుడు ఆ డబ్బు అనుభవించలేరు. అలాంటప్పుడు నాకేంటి లాభం..’ అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇన్సూరెన్స్ ఉపయోగించుకోకుండా చివరిదాకా జీవించి ఉన్నారంటే ఎంత ఆరోగ్యవంతులో, ఎంతో అదృష్టవంతులో ఆలోచించాలి. దురదృష్టవశాత్తు మీకేమైనా జరిగితే వచ్చే ఇన్సూరెన్స్ వల్ల పిల్లల చదువులు గానీ, పెళ్లిళ్లు గానీ ఆగిపోవు. ఈఎంఐలు నిలిచిపోవు. స్థూలంగా మీ కుటుంబం లైఫ్‌స్టైల్ అలాగే ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లాభం కోసం కాదు.. భరోసా కోసం తీసుకోవాలి.
అపోహ-2
‘టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అందరికీ అర్థం కాని విషయం’ అని కొందరు భావిస్తుంటారు. ఇన్సూరెన్స్ పాలసీల్లో సింపుల్‌గా అర్థమయ్యే పాలసీ టర్మ్‌ఇన్సూరెన్స్ అని గుర్తించాలి. మీ బైక్ కోసం లేదా కారు కోసం ప్రతి సంవత్సరం ప్రీమియం కడతారు కదా. ఈ క్రమంలో ఒకవేళ మీ వాహనానికి యాక్సిడెంట్ జరిగితే డబ్బు వస్తుంది. లేదంటే ఉచితంగా రిపేర్ చేస్తారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్‌లోనూ ఇదే విధానం అమలవుతుంది. మీకు ఏదైనా జరిగితే డబ్బు రావాలంటే, దాంతో కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
అపోహ-3
‘నేను ఇంకా యువకుడినే. ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు’ అని కొందరు భావిస్తారు. కొత్త కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ లేనిదే షోరూమ్ నుంచి బయటికి ఇవ్వరు. పాత వాహనం యక్సిడెంట్ అయి షెడ్‌లో ఉంటే దానికి ఎవరూ ఇన్సూరెన్స్ ఇవ్వరనే విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా జబ్బు చేస్తే అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారా.. ఇవ్వరా.. అనేది మీ మెడికల్ రిపోర్ట్‌ను బట్టి ఉంటుంది. అదే చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీగా ఇస్తారు. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రీమియం అనేది ప్రతి సంవత్సరం మారదు. మీరు మొదటి సంవత్సరం ఉదాహరణకు రూ.10,000 కడితే 20 సంవత్సరాల తర్వాత కూడా అదే రూ.10,000 కట్టాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణంతో సంబంధం ఉండదు. తర్వాత మీ ఆరోగ్యం క్షీణించినా పాలసీపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ వయసు పెరిగిన తర్వాత తీసుకుంటే ప్రీమియం ఎక్కువ అవుతుంది. మెడికల్ చెకప్ కూడా అవసరం ఉండొచ్చు.
అపోహ-4
‘అన్ని టర్మ్ పాలసీలు ఒకేలా ఉంటాయి. చనిపోతే డబ్బులు వస్తాయి. పాలసీలు ఒకటే కంపెనీలే మారుతాయి’ అని అనుకుంటారు. ఒక్కో పాలసీకి ఒక్కో క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో(క్లెయిమ్ ఎంత త్వరగా, ఎంత మందికి చేస్తున్నారో తెలిపే సూచిక) ఉంటుంది. ఒక్కో పాలసీకి రైడర్స్, బెనిఫిట్స్, ప్రీమియం, సర్వీసెస్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అవి పాలసీని అనుసరించి మారుతాయి. అందులో మీకేది అవసరమో మంచి అడ్వైజర్‌ను సంప్రదించి తెలుసుకోవడం ముఖ్యం.
ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలు
అపోహ-5
‘నాకు కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. పర్సనల్‌గా ఇంకొకటి అవసరం లేదు’ అని చెబుతారు. చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే గుంపులో గోవింద. ప్రత్యేకంగా మీ అవసరాలకు, బాధ్యతలకు తగ్గట్టుగా ఆ పాలసీ ఉండకపోవచ్చు. కంపెనీ పాలసీ ప్రకారం మాత్రమే వాటిని ఇష్యూ చేస్తారు. భవిష్యత్తులో కంపెనీ మారితే, ఉద్యోగం మానిస్తే ఇన్సూరెన్స్ ఉండదు. అక్కడితో ఆగిపోతుంది. అందుకే కంపెనీ ఇచ్చిన ఇన్సూరెన్స్ ఉన్నా పర్సనల్‌గా ఒక టర్మ్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి.