కబ్జాసురుల పాపం పండేలా.. | some practical legal tips to safeguard your property | Sakshi
Sakshi News home page

కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలు

Aug 16 2025 11:54 AM | Updated on Aug 16 2025 11:57 AM

some practical legal tips to safeguard your property

కుమార్‌ తన ఫ్యామిలీతో కలిసి వరంగల్‌లో ఉండేవాడు. తన తండ్రి ఓ చిన్న సంస్థలో పని చేస్తుండేవాడు. తల్లి హౌస్ వైఫ్. వారి కుటుంబ సంపాదన చాలా తక్కువగా ఉన్నా కుమార్‌ భవిష్యత్తు బాగుండాలని పేరెంట్స్ ఇద్దరు కొన్నిసార్లు పస్తులున్నా కుమార్‌ను బాగా చదివించారు. కుమార్‌ కూడా పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకొని బాగా చదివి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తాను జాబ్‌లో చేరిన తర్వాత స్కిల్ సెట్ బావుండడంతో కెరియర్‌లో ఎదిగాడు. కుమార్‌కు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది.. తన బాల్యం మొత్తం కేవలం రెండు గదుల ఇంటిలోనే ఉన్నాడు. ఇ‍ప్పటికీ తన పేరెంట్స్‌ అందులోనే ఉంటున్నారు. దాంతో వారిని వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టి అందులోకి తీసుకురావాలని అనుకున్నాడు. తన నెలసరి సంపాదనలో ఖర్చులు పోగా పేరెంట్స్‌కు కొంత డబ్బు పంపించి మిగులు జీతాన్ని క్రమశిక్షణతో పొదుపు చేస్తూ వచ్చాడు. ఆరేళ్లపాటు చాలా మంచి కార్పస్‌ను సృష్టించాడు.

ఈలోపు కుమార్‌ పని చేస్తున్న కంపెనీ తన కష్టాన్ని గుర్తించి ఆన్‌సైట్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఈ ఆఫర్ వల్ల తన సంపాదన మరింత పెరుగుతుంది. ఒకరోజు ప్లాట్స్‌ సేల్‌ అనే యాడ్‌ చూశాడు. వెంటనే వెళ్లి తన దగ్గర ఉన్న సేవింగ్స్‌తో ప్లాట్ కొనేద్దాం అనుకున్నాడు. ఆన్‌సైట్‌కి వెళ్లి బాగా డబ్బు సంపాదించి తిరిగి వచ్చాక ఆ సైట్‌లో ఇల్లు కట్టి తన పేరెంట్స్‌ను హైదరాబాద్‌ తీసుకొద్దాం అనుకున్నాడు. దాంతో ఒకరోజు ఆ ల్యాండ్ చూడడానికి వెళ్లాడు. తనకి అది నచ్చి దాన్ని కొనుగోలు చేశాడు. కుమార్‌ ఆన్‌సైట్‌ వెళ్లేముందు వరంగల్‌లోని తన పేరెంట్స్ వద్దకు వెళ్లి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వారి చేతిలో పెడుతూ ‘నాన్న ఇప్పటివరకు సేవ్ చేసిన డబ్బుతో మంచి ప్లాట్ ఒకటి కొన్నాను. నేను యూఎస్‌ నుంచి తిరిగి రాగానే అందులో కన్‌స్ట్రక్షన్‌ పనులు మొదలు పెడదాం. త్వరలోనే మన సొంత ఇంటి కల నెరవేరబోతుంది నాన్న’ అన్నాడు.

యూఎస్‌ వెళ్లిన కుమార్‌ వృథా ఖర్చులకు పోకుండా, డబ్బు బాగా సంపాదించి క్రమశిక్షణతో సేవ్‌ చేశాడు. తాను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత గతంలో తీసుకున్న ల్యాండ్‌లో కన్‌స్ట్రక్షన్‌ మొదలు పెట్టాలనుకుని కుమార్‌, తన తండ్రి హైదరాబాద్‌లోని ప్లాట్ వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి ప్లాట్‌లో ఇప్పటికే ఎవరో కన్‌స్ట్రక్షన్‌ ప్రారంభించారు. ఆ నిర్మాణం చేస్తున్న వారిని నిలదీయడంతో అది తమ ప్లాట్ అని, అందుకే కన్‌స్ట్రక్షన్‌ మొదలు పెట్టినట్లు చెప్పారు. కుమార్‌కు తన ప్లాట్ కబ్జాకు గురైందని అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇది సివిల్ కేసు.. కోర్టులో కేసు ఫైల్ చేయాలని చెప్పడంతో తగిన డాక్యుమెంట్స్‌తో కోర్టుకు వెళ్లాడు. ఆ అక్రమ కన్‌స్ట్రక్షన్‌ ఆపాలని, న్యాయబద్ధంగా తన ప్లాట్ పొజిషన్ తనకి ఇప్పించాలని వేడుకున్నాడు. ఆ కన్‌స్ట్రక్షన్‌ ఆపేందుకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది. కుమార్‌ ఆ నిర్మాణాన్ని అయితే ఆపగలిగాడు కానీ, తన పొజిషన్ పొందాలంటే అది వెంటనే అయ్యే పనికాదు. సివిల్ కోర్టులో ఇలాంటి కేసులు కొన్ని సంవత్సరాల పాటు నడుస్తాయని అందిరికీ తెలిసిన విషయమే.

ఆ కుటుంబం సొంత ఇంటికలా చెల్లాచెదురైంది. కుమార్‌కు జరిగిన మోసం కొంతమందికే జరుగుతుందని అనుకుంటున్నారేమో.. రీసెంట్ టైమ్‌లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ప్రాపర్టీ ధరలు అధికమవుతుంటే ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ప్లాట్లని, ఖాళీ స్థలాలను మాత్రమే కబ్జా చేస్తారని కొందరు భావిస్తుంటారు. కన్‌స్ట్రక్షన్‌ పూర్తయి ఖాళీగా ఉన్న ఇల్లుని కూడా కొట్టేయడానికి కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. అంతవరకు ఎందుకు మనం సరైన నిబంధనలు పాటించకుండా ఇల్లు అద్దెకి ఇస్తే కొందరు టెనెంట్లు ఆ ప్రాపర్టీని కొట్టేయడానికి యత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. మొత్తంగా కోటి పది లక్షల సివిల్ కేసులు రిజిస్టర్ అయితే సంవత్సరంపైగా పెండింగ్‌లో ఉన్న కేసులు 73% పైనే.  తెలుగు రాష్ట్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో 4,23,000కు పైగా సివిల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో 3,49,000కు పైగా సివిల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అన్ని ప్రాపర్టీ రిలేటెడ్ కేసులు అవ్వకపోయినా అధిక భాగం అవే  ఉన్నాయి.

ప్లాట్‌ కొన్న తర్వాత ఏం చేయాలంటే..

  • ఓపెన్ ప్లాట్ కొన్నప్పుడు అందులో రాళ్లు పాతిపెట్టి ఉండడం గమనిస్తాం. సాధారణంగా ఆ స్థలాన్ని అలాగే వదిలేస్తాం. అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కబ్జాదారులకి, ఎంక్రోచ్‌మెంట్‌కు మనమే అవకాశం ఇచ్చినవారమవుతాం. దీన్ని కట్టడి చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • ఎవరైతే తరచూ తమ ల్యాండ్‌ను గమనిస్తుంటారో వారు ఓపెన్‌ప్లాట్లు తీసుకోవచ్చు. కొన్న తర్వాత రెగ్యులర్‌గా దాన్ని చెక్ చేస్తుండాలి.

  • నిత్యం ల్యాండ్‌ను పరిశీలించాలంటే కొందరికి కుదరకపోవచ్చు. అలాంటివారు మాత్రం ఓపెన్ ప్లాట్ కొనే దానికన్నా గేటెడ్ కమ్యూనిటీలోని ప్లాట్స్ తీసుకుంటే కొంతవరకు మేలు.

  • ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేసినా దాన్ని కాపాడుకునేందుకు కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లాట్ చుట్టూ సరిహద్దులను ప్రాపర్‌గా చెక్ చేసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్‌ వేయాలి.

  • ఇంకొంచెం ఇన్వెస్ట్‌ చేయగలిగితే కాంపౌండ్ గోడ కట్టి చిన్న గేట్ పెట్టుకోవచ్చు. ఇది కబ్జాల నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది.

  • భూకబ్జాలో ఎంక్రోచ్‌మెంట్‌ మరో రకమైన విధానం. అంటే పక్కవారు మీ ల్యాండ్‌ను కొంచెంకొంచెంగా ఆక్యుపై చేసేస్తుంటారు. అలాంటి వారి నుంచి కంపౌండ్‌ గోడ ప్రొటెక్ట్ చేస్తుంది.

  • ఫెన్స్ వేసి గేట్‌ పెట్టిన తర్వాత సైన్ బోర్డ్స్ పెడితే మరింత బెటర్‌. చాలా ప్రాపర్టీస్‌ ముందు ‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దిస్‌ పర్సన్. ట్రెస్‌పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్’ అని కాంటాక్ట్‌ నంబర్‌ ఉండేలా సైన్ బోర్డ్స్ చూస్తూనే ఉంటాం. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి విధానం చాలా ముఖ్యం.

  • ఇలాంటి సైన్‌బోర్డ్‌ పెడితే 100 శాతం మన ల్యాండ్‌ను ఎవరూ కబ్జా చేయరా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఇది అవతలి వారి ప్రాపర్టీని బలవంతంగా కొట్టేద్దామని ప్రయత్నించేవారికి హెచ్చరికలా మాత్రం పని చేస్తుంది.

చివరగా మనం ఆస్తులు సంపాదించడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించుకోవడం అంతే ముఖ్యమని గమనించాలి. బయట ఎక్కడో యాడ్‌ చూసి ప్రాపర్టీ కొనేముందు.. డేట్‌ కనిపించేలా ఆ యాడ్‌ వివరాలు రికార్డు చేసి పెట్టుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా ఇష్యూ వస్తే ఆ తేదీ వరకు సదరు ల్యాండ్‌ కబ్జా కాలేదని నిరూపించేందుకు ఒక ప్రూఫ్‌లా ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement