
బ్రిటిష్ రాచరిక పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన మన దేశం 79 ఏళ్ల పాటు ఎన్నో విధాలుగా శ్రమించి ఎకానమీలో ప్రపంచంలోని టాప్ దేశాల సరసన నిలిచింది. దేశ రక్షణకు, సార్వభౌమత్వానికి పెద్దపీట వేస్తున్న భారత్ ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో శత్రుదేశాల్లో వణుకు పుట్టిస్తోంది. పక్కలో బళ్లెంలాగా పాకిస్థాన్ కవ్వింపు చర్యలు, గతంలో గల్వాన్‌లోయాలోకి చైనా సైనికులు దూసుకురావడం వంటి చర్యలను చాకచక్యంగా, సమర్థంగా తిప్పికొట్టింది. అందుకు టెక్నాలజీని వాడుకుంటూ ముందుకుసాగింది. ఈ క్రమంలో భారత్ ఎప్పటినుంచో రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలతోపాటు స్టార్టప్‌లకు తోడ్పాడు అందిస్తోంది.
స్వావలంబన దిశగా అడుగులు..
ఏవియానిక్స్, ప్రొపల్షన్ మాడ్యూల్స్, రాడార్, టార్గెటింగ్ టెక్నాలజీ వంటి కీలకమైన రక్షణ వ్యవస్థల కోసం ఒకప్పుడు విదేశీ సంస్థలపై ఎక్కువగా ఆధారపడిన భారత్‌లో ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్వావలంబన దిశగా నిర్ణయాత్మక పురోగతితో రక్షణ రంగంలో దిగుమతిదారు నుంచి అధిక విలువైన సైనిక సాంకేతిక పరిజ్ఞానాల ఉత్పత్తిదారుగా, వాటి ఎగుమతిదారుగా ఎదుగుతోంది. ఈ పరివర్తన కేవలం విధాన పరమైంది మాత్రమే కాదు.. స్వదేశీ యాజమాన్యంలోని డిఫెన్స్ టెక్ స్టార్టప్ల ద్వారా చేకూరుతోంది.
ప్రభుత్వం తోడ్పాటు..
భారత్ గతంలో విదేశాల నుంచి సేకరించిన దాదాపు 4,500కి పైగా భాగాలను దేశంలోనే తయారు చేసుకునేలా పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్(పీఐఎల్)ను సిద్ధం చేసింది. ఈ జాబితాలోని నిర్దిష్ట రక్షణ రంగానికి సంబంధించిన వస్తువుల దిగుమతులను నియంత్రిస్తుంది. వీటి లోటును భర్తీ చేసేలా దేశీయ స్టార్టప్‌లు, తయారీదారులకు తోడ్పాటును అందిస్తున్నారు. దీనికితోడు ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) కార్యక్రమం డీఆర్డీవో, డీపీఎస్‌యూల సహకారంతో 200కు పైగా స్టార్టప్‌లకు నిధులు సమకూరుస్తోంది. ఇందులో ప్రధానంగా దృష్టి సారిస్తున్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి.
స్వయంప్రతిపత్తి కలిగిన హై-ఆల్టిట్యూడ్ డ్రోన్లు
మానవరహిత అండర్‌వాటర్ వెసెల్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు
దిగుమతి చేసుకున్న జెట్ ఇంజిన్లు, మెరైన్ టర్బైన్ల స్థానంలో స్వదేశీ ప్రొపల్షన్ యూనిట్ల ఏర్పాటు
ప్రభుత్వ ప్రధాన పెట్టుబడులు
రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది.
అధునాతన మేల్-క్లాస్ యూఏవీల కోసం రూ.20,000 కోట్లు
మానవ రహిత నావల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం రూ.2,500 కోట్లు
రూ.2 వేల కోట్లు డ్రోన్ సబ్ సిస్టమ్స్, డిఫెన్స్ సాఫ్ట్‌వేర్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా అందిస్తున్నారు.
అధిక సంక్లిష్ట విభాగాలపై దృష్టి
డీప్‌టెక్ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్‌లను లక్ష్యంగా చేసుకుంటూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా తక్కువ వాల్యూమ్స్, అధిక సంక్లిష్టత కలిగిన విభాగాలపై దృష్టి సారిస్తుంది. అందులో..
కాంపోజిట్ ఏరోస్పేస్ నిర్మాణాలు
మిస్సైల్-గ్రేడ్ ప్రిసిషన్ కాంపోనెంట్స్
హార్డెంన్డ్ ఎలక్ట్రానిక్స్
స్పెషాలిటీ మిలిటరీ టెక్స్‌టైల్స్
అంతర్జాతీయ ఒప్పందాలు
భారత్, అమెరికాల మధ్య అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ (ఏషియా) వంటి వ్యూహాత్మక అంతర్జాతీయ ఒప్పందాలు సంయుక్త మేథోసంపత్తి అభివృద్ధి, కో-ప్రొడక్షన్‌ను వేగవంతం చేస్తున్నాయి. ఈ సహకారాలు భారత తయారీ సంస్థలకు ఎగుమతులను పెంచుతున్నాయి. ముఖ్యంగా కింది విభాగాల్లో ఈ ధోరణి ఊపందుకుంది.
కౌంటర్-యూఏవీ వ్యవస్థలు
స్వయంప్రతిపత్తి కలిగిన మెరిటైమ్ డ్రోన్లు
కృత్రిమ మేధ ఆధారిత మిషన్-క్రిటికల్ వ్యవస్థలు
భారతదేశ డిఫెన్స్-టెక్‌లో కొన్ని స్టార్టప్‌లు
రాఫె ఎంఫిబ్ర్ (నోయిడా)
స్థాపన: 2016
ఫోకస్: స్వదేశీ యూఏవీలు, కార్బన్ కాంపోజిట్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, మిలిటరీ గ్రేడ్ ఐసీ ఇంజిన్లు
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోపైలట్, యూఏవీ స్పెసిఫిక్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది.
కీలక ఉత్పత్తులు: ఎంఆర్ 10 డ్రోన్‌స్మార్మ్, ఎంఆర్ 20 లాజిస్టిక్స్ డ్రోన్, భారత్ మ్యాన్ పోర్టబుల్ యూఏవీ, ఎక్స్8 మారిటైమ్ పెట్రోలింగ్ డ్రోన్.
భాగస్వాములు: డసాల్ట్ సిస్టెమ్స్, సాఫ్రాన్, హెన్సోల్ట్.
పూర్తి స్థాయి ఏరోస్పేస్ తయారీకి 100 మిలియన్ డాలర్ల సిరీస్ బీ నిధులను (జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలో) సమీకరించింది.
ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ (బెంగళూరు)
స్థాపన: 2017
ఫోకస్: చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, టిక్టికల్ ఆప్టిక్స్.
వైపర్ (.308), సాబెర్ (.338 లాపువా మాగ్నమ్) వంటి స్నైపర్ రైఫిళ్లను అభివృద్ధి చేశారు.
2024లో 50 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసింది.
దేశీయ ఆర్డర్లు: భారత సైన్యం ఏకె -47 అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్, మనోహర్ ఎం 72 కార్బైన్లు
అధునాతన మందుగుండు సామగ్రి అభివృద్ధి కోసం సీబీసీ బ్రెజిల్‌తో భాగస్వామ్యం
సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (ముంబై)
స్థాపన: 2015
ఫోకస్: సముద్ర, వైమానిక మానవరహిత వ్యవస్థలు
భారతదేశపు మొట్టమొదటి సముద్ర స్పాటర్ డ్రోన్, స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధ పడవలను అభివృద్ధి చేసింది.
వరుణ అనే వ్యక్తిగత వైమానిక వాహనంపై కూడా పనిచేస్తుంది.
అటానమస్ డ్రోన్ ల్యాండింగ్ వ్యవస్థలకు జపాన్ పేటెంట్ లభించింది.
ఐడెక్స్ డిస్క్ 7 కింద భారత నౌకాదళంతో కలిసి ప్రాజెక్టుల్లో నిమగ్నమైంది.
బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ (చెన్నై)
స్థాపన: 2018
ఫోకస్: ఏఐ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, నానోటెక్, హైబ్రిడ్ ఆర్మర్
ఆవిష్కరణల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు, రాడార్ క్లాక్, హైబ్రిడ్ సిరామిక్ బాడీ ఆర్మర్, ఏఐ-ఆధారిత బాటిల్ ఫీల్డ్ ఇంటర్ ఫేస్‌లు ఉన్నాయి.
మూడు భారత రక్షణ దళాలకు 2025లో ఎగుమతులు ప్రారంభించింది.
యూకే, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాలోని సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
ఐరోవ్ (కొచ్చి)
స్థాపన: 2016
ఫోకస్: అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ (ఏయూవీ), ఆర్వోవీలు.
భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ అండర్ వాటర్ డ్రోన్ ఐరోవ్ ట్యూనాను అభివృద్ధి చేసింది.
డీఆర్డీవో, ముంబై పోర్ట్ ట్రస్ట్, బీపీసీఎల్‌కు సర్వీసులు అందిస్తుంది.
ఏఐ ఆధారిత 3D మ్యాపింగ్, విశ్లేషణతో 300 మీటర్ల లోతున సముద్ర కార్యకలాపాలను చేయగల ఉత్పత్తులు తయారు చేస్తుంది.
ఐడియాఫోర్జ్ (ముంబై)
స్థాపన: 2007
ఫోకస్: రక్షణ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, మౌలిక సదుపాయాల కోసం డ్రోన్లు తయారీ.
వీటీవోఎల్ యూఏవీలను తయారు చేసిన తొలి కంపెనీ.
7,25,000 కంటే ఎక్కువ మిషన్ గంటలు, 80+ పేటెంట్లు దక్కించుకుంది.
టాప్ గ్లోబల్ డ్యూయల్ యూజ్ డ్రోన్ తయారీదారుగా నిలుస్తుంది.
స్కైరూట్ ఏరోస్పేస్ (హైదరాబాద్)
స్థాపన: 2018
ఫోకస్: చిన్న ఉపగ్రహాల కోసం ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలు.
విక్రమ్-ఎస్‌ను లాంచ్ చేసింది. అంతరిక్ష రంగంలో సర్వీసులు అందించే భారతదేశపు మొదటి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది.
విక్రమ్ సిరీస్‌లో చౌకైన, పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధి చేస్తోంది.
వాణిజ్య అంతరిక్ష అవకాశాన్ని వేగవంతం చేయడానికి 95 మిలియన్ డాలర్లను సమీకరించింది.
ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం