
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపటితో 79 ఏళ్లు పూర్తవుతాయి. బ్రిటిష్ రాచరిక పాలన అంతమైన 1947 సమయంలో ఇండియన్ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. క్రమంగా అది మారుతూ ప్రస్తుతం రూ.87.65కు చేరింది. ఇలా డాలర్ పెరిగి రూపాయి విలువ తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్-రూపాయి పరిణామం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.
రూపాయి విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..
వాణిజ్యం: భారత్ విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు, ఇతర ప్రాంతాలకు చేసే ఎగుమతుల సమతుల్యత వల్ల రూపాయి ప్రభావం చెందుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతుంది.
ద్రవ్యోల్బణం: దేశంలోని అధిక ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది.
వడ్డీ రేట్లు: అధిక వడ్డీ రేట్లు విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తాయి. రూపాయి విలువను పెంచుతాయి.
విదేశీ మారక నిల్వలు: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, ఈక్విటీ మార్కెట్‌లోకి వచ్చే ఫారెన్ కరెన్సీ వల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రాకపెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది.
రాజకీయ, ఆర్థిక పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందాలంటే రాజకీయ అనిశ్చితులు ఉండకూడదు. స్పష్టమైన రాజకీయ నాయకత్వ పరిస్థితులు లేకపోయినా రూపాయి పతనమయ్యే అవకాశం ఉంటుంది.
చమురు ధరలు: భారత్ గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకోసం డాలర్లు చెల్లించాల్సిందే. భారత్ వద్ద ఉన్న ఫారెన్స్ కరెన్సీ రిజర్వులు అందులో ఉపయోగపడుతాయి. అయితే చమురు ధరలు పెరగితే చెల్లింపులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దాంతో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది.
కొన్ని నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ.3.30గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విలువ క్రమంగా పడిపోయింది. 1947 నుంచి 2025 వరకు ఇండియన్ రూపాయి పరిణామక్రమం కింది విధంగా ఉంది.
