
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్, ఆటోమొబైల్స్ విభాగంలో భారత్ కంపెనీలకు అందిస్తున్న ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలకు వ్యతిరేకంగా చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఉన్న ఈ పథకాలను డబ్ల్యూటీఓ వేదికపై సమర్థించుకోవాల్సిన అవసరం భారత్‌కు ఏర్పడింది.
చైనా ఆరోపణలు
చైనా తన ఫిర్యాదులో భారతదేశం ఈవీ ప్రోత్సాహకాలు, పీఎల్ఐ పథకాలు చైనీస్ కోర్ వస్తువులపై వివక్ష పూరితంగా ఉన్నట్లు ఆరోపించింది. ఈ పథకాల కింద దేశీయ విలువ జోడింపునకు సంబంధించిన అంశాలు WTO కీలక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా పేర్కొంది. అందులో సబ్సిడీలు, కౌంటర్‌వైలింగ్ చర్యలపై ఒప్పందం (SCM అగ్రిమెంట్-రాయితీలకు వ్యతిరేకం), సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATT 1994), వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్యల ఒప్పందం (TRIM)ను భారత్ బేఖాతరు చేసినట్లు చైనా తెలిపింది.
భారతదేశం వైఖరి
ఈ పథకాలను అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా ఈ పథకాలు ఉన్నాయని భారత్ చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ ప్రోత్సాహకాలు డబ్ల్యూటీఓ చట్టంలో ‘గ్రే ఏరియా’(పారిశ్రామిక రాయితీలు, టెక్నాలజీ ప్రమోషన్ పథకాలు, పర్యావరణ, అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ చట్టంలో స్పష్టంగా నిషేధించబడని విధాన చర్యలను సూచిస్తుంది)లో ఉన్నాయి. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విధానాలు రూపొందించే హక్కు భారత్‌కు ఉంది.
డబ్ల్యూటీఓ వివాద ప్రక్రియ
డబ్ల్యూటీఓ వివాద పరిష్కార విధానంలో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనాలు ముందుగా ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంటుంది. సంప్రదింపులు విఫలమైతే చైనా తీర్పు ఇవ్వడానికి విధాన ప్యానెల్‌ను అభ్యర్థించవచ్చు. భారతదేశానికి ప్రతికూల తీర్పు వస్తే అప్పీల్ చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం