
చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను మళ్లీ నిలిపివేయడం ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈ నిర్ణయంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. చైనా చర్యల వల్ల భారత్‌లో ఎరువుల లభ్యత, ధరలపై ప్రభావం పడునుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
చైనా ఎగుమతి నిలిపివేత
అక్టోబర్ 15, 2025 నుంచి టెక్నికల్ మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ (TAMP), యాడ్ బ్లూ (యూరియా సొల్యూషన్), డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), సాంప్రదాయ యూరియా వంటి ప్రత్యేక ఎరువుల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ సస్పెన్షన్ సుమారు 5-6 నెలల పాటు ఉంటుంది. అంటే ఈ నిలిపివేత మార్చి 2026 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని అనుసరించి సరఫరా గొలుసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
భారతదేశంపై దీని ప్రభావం
భారతదేశం ఈ ప్రత్యేక ఎరువుల్లో దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇది ఏటా సుమారు 2.5 లక్షల టన్నులు, అంటే 60-65% రబీ సీజన్‌లో ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎరువుల దిగుమతులపై ఆధారపడుతుండడం వల్ల చైనా ఏకపక్ష నిర్ణయాలు భారతదేశ వ్యవసాయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
చైనా నిర్ణయం వల్ల కఠినమైన ప్రపంచ సరఫరా, అనిశ్చితి ఫలితంగా ఎరువుల ధరలు 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో అంతిమంగా రైతులపై భారం పడనుంది. దాంతో పంట ఉత్పత్తి వ్యయం పెరుగనుంది. కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్ (అక్టోబర్-మార్చి) కోసం భారతీయ వ్యాపారుల వద్ద ఇప్పటికీ నిల్వలున్నాయి. కాబట్టి తక్షణ ఎరువుల కొరత లేనప్పటికీ భవిష్యత్తులో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
గతంలో ఇలా..
చైనా గతంలో కూడా 2023 మధ్యలో, మే-జూన్ 2025లో (భారతదేశ ఖరీఫ్ సీజన్‌ను ప్రభావితం చేస్తూ) ఎగుమతులను నిలిపివేసింది. ఆగస్టు 2025లో దౌత్య చర్చల తర్వాత తాత్కాలికంగా వీటిపై నిషేధం ఎత్తివేశారు. తిరిగి అక్టోబర్ 15 నుంచి మళ్లీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 2026 తర్వాత కూడా కొనసాగితే భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ప్రత్యామ్నాయ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం, ఎరువుల వినియోగంలో సామర్థ్యాన్ని పెంచే విధానాలను అమలు చేయడం వంటి చర్యలు అత్యవసరం.
ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో కేజీ టమాటా రూ.700