స్పెషాలిటీ స్టీల్ తయారీలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)ను తీసుకొచ్చింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను తగ్గించడం ఈ పథకం ఉద్దేశ్యం. ‘పీఎల్‌ఐ 1.2’ పథకాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రారంభించారు.
ఈ పథకం కింద మొదటి రెండు విడతల్లో స్పెషాలిటీ స్టీల్ రంగంలోకి రూ.43,874 కోట్ల పెట్టుబడులకు హామీలను పొందినట్టు మంత్రి చెప్పారు. వీటి ద్వారా 14.3 మిలియన్ టన్నుల కొత్త స్పెషాలిటీ స్టీల్ తయారీ సామర్థ్యం దేశీయంగా ఏర్పాటవుతుందన్నారు. 2025 సెప్టెంబర్ నాటికి రూ.22,973 కోట్ల పెట్టుబడులు రాగా, 13,284 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్టు చెప్పారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం, ఆటోమొబైల్, ఇన్‌ఫ్రాలోకి వినియోగించే అధిక విలువ కలిగిన, ఉన్నత శ్రేణి స్టీల్ తయారీని ప్రోత్సహించేందుకు 2021 జూలైలో పీఎల్‌ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మొదటి రెండు విడతల పీఎల్‌ఐ పథకానికి మంచి స్పందన లభించినట్టు చెప్పారు. అధిక శ్రేణి స్టీల్ తయారీకి భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా మలిచేందుకు పీఎల్‌ఐ 1.2ను తీసుకొచి్చనట్టు వెల్లడించారు. సూపర్ అలాయ్స్, సీఆర్‌జీవో స్టీల్, స్టెయిన్‌లెస్ స్టీల్ లాంగ్, ఫ్లాట్ ఉత్పత్తులు, టైటానియం అలాయ్స్, కోటెడ్ స్టీల్ విభాగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పథకం సాయపడుతుందన్నారు. ప్రస్తుత కంపెనీలతోపాటు కొత్త కంపెనీలకు పీఎల్‌ఐ 1.2 అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టినట్టు మంత్రి కుమారస్వామి చెప్పారు.
ఇదీ చదవండి: గోపీచంద్ హిందూజా కన్నుమూత


