హిందూజా గ్రూప్ విస్తరణలో ముఖ్య పాత్ర
అశోక్ లేల్యాండ్ టర్న్ అరౌండ్‌లో కీలకం
వ్యాపార దిగ్గజం, బ్రిటన్‌లో అత్యంత సంపన్నుడు గోపీచంద్ పి. హిందూజా (85) కన్నుమూశారు. గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీచంద్, లండన్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. హిందూజాకు భార్య (సునీత), ఇద్దరు కుమారులు (సంజయ్, ధీరజ్), ఒక కుమార్తె (రీటా) ఉన్నారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరొందిన గోపీచంద్ 1940లో జన్మించారు. ఆటోమోటివ్, ఎనర్జీ, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో తమ గ్రూప్‌ను అగ్రగామిగా విస్తరించిన నలుగురు హిందుజా సోదరుల్లో ఆయన రెండో వారు. 2023లో అన్న శ్రీచంద్ హిందూజా మరణానంతరం 35 బిలియన్ పౌండ్ల గ్రూప్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
విజనరీ వ్యాపారవేత్త..
ముంబైలోని జైహింద్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ (1959) అనంతరం తమ కుటుంబానికి టెహ్రాన్‌లో ఉన్న ట్రేడింగ్ వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా జీపీ(గోపీచంద్ హిందూజా) తన కెరియర్ ప్రారంభించారు. ఆయన సారథ్యంలో 1984లో గల్ఫ్ ఆయిల్‌ని, ఆ తర్వాత 1987లో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశీ ఆటోమోటివ్ సంస్థ అశోక్ లేల్యాండ్‌ను గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో అశోక్ లేల్యాండ్‌లో పెట్టుబడి తొలి భారీ ఎన్నారై ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలిచింది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టర్న్ అరౌండ్ గాథగా నిలిచపోయేలా కంపెనీని తీర్చిదిద్దడంలో జీపీ కీలకంగా వ్యవహరించారు. ఇక విద్యుత్, మౌలిక రంగాల్లోకి హిందూజా గ్రూప్ ప్రవేశించడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు.
బోఫోర్స్ మరకలు..
స్వీడన్‌కి చెందిన గన్నుల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌కి భారత్‌లో కాంట్రాక్టులు ఇప్పించేందుకు రూ. 64 కోట్లు అక్రమంగా కమీషన్లు తీసుకున్నట్లు జీపీతో పాటు ఆయన ఇద్దరు సోదరులపై (శ్రీచంద్, ప్రకాశ్) ఆరోపణలు వచ్చాయి. అయితే, 2005లో ఢిల్లీ హైకోర్టు వాటిని కొట్టివేసింది. కార్పెట్లు, టీ, సుగంధ ద్రవ్యాల ట్రేడింగ్‌తో సింధూ ప్రాంతంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) పరమానంద్ 1914లో హిందూజా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇరాన్‌కి వెళ్లి, అక్కడి నుంచి వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం తాజా ది సండే టైమ్స్ రిచ్ లిస్టులో గోపీచంద్ హిందూజా కుటుంబం 35.3 బిలియన్ పౌండ్ల సంపదతో బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానంలో ఉంది.
భారతీయులకు చెందిన ఏకైక స్విస్ బ్యాంక్ ‘బ్యాంకీ ప్రైవీ’ కూడా హిందూజా సామ్రాజ్యంలో భాగమే. పెద్దన్న శ్రీచంద్ మరణానంతరం వ్యాపారాధిపత్యం కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అవి సద్దుమణిగినట్లు కుటుంబం చెబుతున్నప్పటికీ, విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: దేశంలోనే ధనిక జిల్లాగా రంగారెడ్డి


