జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు
సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా భారతీయ మార్కెట్ తీరుతెన్నులపై కీలక విశ్లేషణ చేశారు. భారతీయ వినియోగదారులు అంత సులభంగా సంతృప్తి చెందరని, వారు ఎప్పుడూ నాణ్యత, విలువల విషయంలో రాజీపడని ‘కఠినమైన ఉపాధ్యాయుల’ వంటి వారని ఆయన పేర్కొన్నారు.
దేశీయ మార్కెట్‌లో రాణిస్తే అంతర్జాతీయంగా ఎగుమతుల్లో విజయం సాధించడం సులభమని ఒక వినియోగదారుడు చేసిన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌కు శ్రీధర్ వెంబు స్పందించారు. ‘భారతీయ కొనుగోలుదారుల అంచనాలను అందుకుని మీరు మనుగడ సాగించగలిగితే ప్రపంచ మార్కెట్ మీకు చాలా సులభం అవుతుంది. మీ ఉత్పత్తి బాగుంటే ఎక్కువ ఆలోచించకుండా ప్రపంచ దేశాల్లోకి తీసుకెళ్లండి’ అని చెప్పారు.
స్కూల్ టీచర్‌తో పోలిక
ఈ సందర్భంగా తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్న వెంబు తన స్కూల్ టీచర్ పరిమళ జీతో భారతీయ కస్టమర్లను పోల్చారు. ‘నా టీచర్ పరిమళ గారు చాలా కఠినంగా ఉండేవారు. ఒకవేళ నాకు పరీక్షలో 95 శాతం మార్కులు వచ్చినా నేను తక్కువ పనితీరు కనబరుస్తున్నానని, ఇంకా కష్టపడాలని ఆమె అనేవారు. భారతీయ కస్టమర్లు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. వారు 95 శాతంతో సంతృప్తి చెందరు. అత్యుత్తమమైన దాని కోసమే చూస్తారు’ అని ఆయన వివరించారు.
కస్టమర్లు కఠినంగా ఉండటం కంపెనీలకు శాపమా అంటే.. కాదనే అంటున్నారు వెంబు. ‘మమ్మల్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నందుకు భారతీయ కస్టమర్లకు ధన్యవాదాలు. వారి కఠినమైన వైఖరి వల్లే మేము మరింత కష్టపడి, మెరుగైన ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల ఒత్తిడి కారణంగానే జోహో తన మెసేజింగ్ యాప్ ‘అరట్టయ్’(Arattai)లో గోప్యతకు పెద్దపీట వేస్తూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను వేగంగా తీసుకువచ్చినట్లు ఆయన ఉదాహరణగా చెప్పారు.
జపాన్ వర్సెస్ ఇండియా
భారత మార్కెట్ కంటే జపాన్ మార్కెట్ కఠినంగా ఉంటుందనే వాదనను ఆయన ప్రస్తావిస్తూ.. జపనీస్ కంపెనీలు తమ దేశీయ కస్టమర్లు చాలా డిమాండింగ్ అని చెప్పుకుంటాయని, అయితే భారతీయ వినియోగదారులు కూడా ఏమాత్రం తక్కువ కాదని ఆయన స్పష్టం చేశారు. నియంత్రణ అనుమతులు పొందడం లేదా వినియోగదారుల అవసరాలను తీర్చడం వంటి విషయాల్లో భారత మార్కెట్ సవాలుతో కూడుకున్నదైనా అది సంస్థలను ప్రపంచ స్థాయికి ఎదగడానికి సిద్ధం చేస్తుందని ఆయన విశ్లేషించారు.
ఇదీ చదవండి: డబ్ల్యూటీఓలో భారత్‌పై చైనా ఫిర్యాదు


