
వాషింగ్టన్: ఉక్కు కంటే దృఢంగా, ఎక్కువ మన్నిక కలిగిన కలపను తయారుచేసే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విధానంలో తయారుచేసిన కలప, సాధారణ కలప కంటే 12 రెట్లు దృఢంగా, పది రెట్లు ఎక్కువ మన్నికతో ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉక్కు, టైటానియం మిశ్రమ లోహాలు, కార్బన్ ఫైబర్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చని వెల్లడించారు. కార్లు, విమానాలు, ఇళ్ల నిర్మాణంలోనూ వాడుకోవచ్చు.
పరిశోధనలో భాగంగా తొలుత కలపను సోడియం హైడ్రాక్సైడ్, సోడియం సల్ఫైట్ కలిపిన ద్రావణంలో 7 గంటల పాటు ఉడికించారు. ఈ ప్రక్రియతో వృక్ష కణజాలంలోని సెల్యులోజ్‌పై ఎలాంటి ప్రభావం పడకపోగా, లిగ్నిన్ వంటి పాలిమర్లు వేరుపడ్డాయి. దీంతో కణజాలంలో ఖాళీస్థలం ఏర్పడిందన్నారు. అనంతరం ఈ కలపను 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఒకరోజు పాటు బలమైన ఒత్తిడితో నొక్కిపెట్టామన్నారు. దీంతో కలపలోని సెల్యులోజ్ కణజాలాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి దృఢమైన కలప తయారయిందన్నారు.