కులగణనపై మోదీ యూ–టర్న్‌తో ఎవరికి లాభం? | Caste Census: Reason behind the PM Modis desperate U-turn | Sakshi
Sakshi News home page

కులగణనపై మోదీ యూ–టర్న్‌తో ఎవరికి లాభం?

Published Mon, May 5 2025 10:27 AM | Last Updated on Mon, May 5 2025 10:41 AM

Caste Census: Reason behind the PM Modis desperate U-turn

దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కుల గణన( CastCensus) డిమాండ్లు వినిపిస్తున్నా... హిందువులంతా ఒక్కటే అని చెబుతూ వచ్చిన బీజేపీ (BJP), ఎవరూ ఊహించని విధంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. కుల గణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతి పక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనున్నదా అనే చర్చ మొదలైంది. 

మన దేశంలో మతం కన్నా కులమే బలమైనది. ఏ రాష్ట్రంలో చూసినా కులం చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. స్వాతంత్య్రం అనంతరం 2011లో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కులగణన కోసం సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టింది. కానీ, రాజకీయ ఎత్తుగడల మధ్య ఆ డేటాను విడుదల చేయలేదు. తర్వాత అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌... సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నా... బీజేపీ పట్టించుకోనట్టే వ్యవహరించింది. 

బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆర్‌ఎస్‌ఎస్, ముందు నుంచీ కులగణనను వ్యతిరేకిస్తోంది. కులాలకు అతీతంగా హిందువులను ఒకే గొడుగు కింద ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ఆర్జేడీ–జేడీ(యూ) కూటమి ప్రభుత్వం బిహార్‌లో కులగణనను చేసినప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన చేసినప్పుడు కూడా కుల ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను అవి వ్యతిరేకించాయి.  ప్రతిపక్ష పార్టీలు కుల విభజనలను రెచ్చగొట్టి ఎన్నికల లబ్ధి పొందుతున్నాయని విమర్శించాయి. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘బటెంగే తో కటెంగే’ (విడిపోతే చంపబడతాం) అనే నినాదంతో కులగణన డిమాండ్‌ను తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఈ ప్రచారంలోనే ‘ఏక్‌ హై తో సేఫ్‌ హై’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అనే నినాదం ఇచ్చారు. ఇప్పుడు తన యూ–టర్న్‌కు ఆయన ఏమని సంజాయిషీ చెప్పుకొంటారు?

వ్యూహాత్మక నిర్ణయమా?
తెలంగాణ, కర్ణాటకలలో చేపట్టిన కులగణనతో దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం డిమాండ్లు పెరిగాయి. దీనికి తోడు ఈ ఏడాది జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునేలా బీజేపీపై ఒత్తిడి పెరిగింది. బిహార్‌లో 2015లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో మొత్తం జనాభాలో 65 శాతం ఓబీసీలని తేలింది. ఈ నేపథ్యంలో ఓబీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ప్రతిపక్ష సామాజిక న్యాయ ఎజెండాను నియంత్రించడానికి బీజేపీ కులగణనకు ఒప్పుకుని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్న అనుమానం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ నిర్ణయంపై సంయమనంతో స్పందిస్తూ, కులగణన రాజకీయ సాధనంగా మారకూడదని, శాస్త్రీయంగా, సామాజిక అసమానతలను తొలగించేందుకు మాత్రమే జరగాలని చెప్పింది. ఈ స్పందన వారి అంతర్గత అసౌకర్యాన్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు రోజే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్, ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి తన యూ–టర్న్‌ గురించి ఆయనతో చర్చించే ఉంటారు. కాబట్టి, ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక మార్పు కాదనీ, ఎన్నికల ఒత్తిడి వల్ల తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రమేననీ స్పష్టమవుతోంది.

2014 నుండి దేశంలో బీజేపీ తన బలం పెంచుకుంటూవస్తోంది. కానీ, తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వెనుకబడిన వర్గాల మద్దతు చాలా కీలకం. బీజేపీలో అత్యధిక శాతం నాయకులు అగ్రవర్ణాలవారే ఉన్నారు. కాబట్టి, కులగణన వల్ల ఓబీసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికారంలో తమ వాటాను డిమాండ్‌ చేస్తే, పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఎక్కువ కులాలు, సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందనే అభిప్రాయం బీజేపీకి ప్రతికూలంగా మారింది. బీజేపీ రోహిణీ కమిషన్, రాఘవేంద్ర కుమార్‌ ప్యానెల్‌ వంటి ఓబీసీ ఉప–వర్గీకరణ ప్రయత్నాలు చేసినప్పటికీ, వాటి నివేదికలను విడుదల చేయలేదు. దీనికి విరుద్ధంగా, ప్రతిపక్షం కులగణనకు నిబద్ధత చూపిస్తూ... తాము అధికా రంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన జరిపించి, బీజేపీ శిబిరంలో రాజ కీయ ఒత్తిడిని పెంచింది. 

చదవండి: దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఈ నిర్ణయం బీజేపీకి స్వల్పకాలిక రాజకీయ లబ్ధిని ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కులగణన హిందూత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా, కుల ఆధారిత రాజకీయాలను మరింత బలపరుస్తుంది. ఇది మండల్‌ 3.0 ఆవిర్భావానికి దారి తీసే అవకాశం కూడా లేకపోలేదు. కులం మన దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా కొనసాగుతోంది. దానిని మతం పేరు చెప్పి తొలగించలేం. ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక పునాదులను కదిలించి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలకు నైతిక విజయాన్ని అందించింది. 2021లోనే నిర్వహించాల్సిన జనగణన ఇప్పటికీ జరగలేదు. ఈ నేపథ్యంలో కులగణన నిర్ణయం ఎప్పుడు అమలవు తుందో అనే సందేహాలను కొట్టిపారేయలేం!

-జి. శ్రీలక్ష్మి 
 రీసెర్చర్, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement