
అభిప్రాయం
ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం పొందడమనే ఓ సుదీర్ఘ ప్రక్రియ మీకు గుర్తుందా? పదేపదే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, కొండవీటి చాంతాడులా బారులు తీరిన జనాలు, అడపాదడపా రుసుముల చెల్లింపులు... ఇప్పుడివన్నీ మాయమై, మీ అరచేతిలోని ఫోన్లో సాక్షాత్తూ ప్రపంచమే ఇమిడిపోయింది. ఇది ఎంతమాత్రం ఆకస్మిక పరిణామం కాదు.
ప్రధానమంత్రి మోదీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశపు సమానత్వ ఆయుధంగా మలిచారు. కార్పొరేట్ ప్రపంచంలోని ఓ ఉన్నతాధికారి తరహాలో ముంబయిలోని ఒక వీధి వ్యాపారి కూడా నేడు అదే యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించగలడు. ఈ పరిణామం మోదీ అనుసరించే అంత్యోదయ సూత్రం కీలక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టే, వరుసలో చివరి వ్యక్తికీ సాంకేతికత చేరువైంది.
బీజం పడింది అక్కడే!
మోదీ ముఖ్యమంత్రి హోదాలో తొలుత సాంకేతికత, ఆవిష్క రణల వినియోగం ద్వారా గుజరాత్ రూపాంతరీకరణకు కృషి చేశారు. ‘జ్యోతిగ్రామ్’ పేరిట ఆయన 2003లో ప్రారంభించిన పథకం ‘ఫీడర్ సెపరేషన్ టెక్నాలజీ’ని విజయవంతంగా ఉపయో గించింది. తద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం వ్యవసాయ విద్యుత్ సరఫరాతో భూగర్భ జల క్షీణత అదుపులోకి వచ్చింది. మరోవైపు 24 గంటల విద్యుత్ సౌకర్యం గ్రామీణ పరిశ్రమలకు ఉత్తేజమిచ్చింది. చిన్న వ్యాపారాల విస్తృతితో వలసలు తగ్గాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకంపై పెట్టిన రూ.1,115 కోట్ల పెట్టుబడి కేవలం రెండున్నరేళ్లలో తిరిగి వచ్చింది.
నర్మదా నది కాలువపై 2012లో సౌర ఫలకాల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16,000 ఇళ్లకు ఏటా 1.6 కోట్ల యూనిట్ల విద్యుదుత్పాదన సాధ్యమైంది. మరోవైపు కాలువలో నీరు ఆవిరయ్యే ప్రక్రియ మందగించి, రైతులకు నీటి లభ్యత పెరిగింది. సాంకేతికతపై మోదీ దార్శనికతకు ఈ జోడు ప్రయోజ నాల విధానమే నిదర్శం. ఇక ‘ఇ–ధర’ వ్యవస్థ ద్వారా భూ రికార్డుల డిజిటలీకరణ చేపట్టారు. ‘స్వాగత్’ పేరిట పౌరులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రితో నేరుగా ముచ్చటించే వీలు కలిగింది. ఆన్‌లైన్ టెండర్లతో అవినీతి అంతమైంది.
జాతీయ యవనికపై...
గుజరాత్‌లో సముపార్జించిన అనుభవాన్ని, ఆచరణాత్మక విధా నాలను ఆయన 2014లో ఢిల్లీకి తెచ్చారు. అనతి కాలంలోనే డిజిటల్ సార్వజనీన మౌలిక సదుపాయాలతో ‘ఇండియా స్టాక్’ రూపు దిద్దుకుంది. జన్‌ధన్, ఆధార్, మొబైల్ త్రయమే వీటికి పునాది.
దేశవ్యాప్తంగా 53 కోట్ల మందికిపైగా ప్రజలను జన్‌ధన్ ఖాతాలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చాయి. వీధి వ్యాపారులు, రోజుకూలీలు సహా పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించే గ్రామీణులకూ ఇవాళ బ్యాంకు ఖాతాలున్నాయి.
ఆధార్ పౌరులకు డిజిటల్ గుర్తింపునిచ్చింది. ఇప్పటివరకు 142 కోట్ల ప్రజలు దానికింద నమోదు చేసుకున్నారు. ఆధార్ ద్వారా ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా మధ్యవర్తుల జోక్యం తొలగి, నిధులు పక్కదారి పట్టడం తగ్గింది. డీబీటీని అవలంబించడం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది.
యూపీఐ ద్వారా దేశంలో చెల్లింపుల తీరులో సమూల మార్పు లొచ్చాయి. ఇది ప్రారంభించినప్పటి నుంచి 55 కోట్లకు పైగా వినియోగదారులు లావాదేవీలు నిర్వహించారు. ఒక్క 2025 ఆగస్టులోనే 20 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 24.85 లక్షల కోట్లు.
నేడు ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌లోనే జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు నిర్వహించాల్సిందిగా కోవిడ్ సమయంలో ఆయన కోరిన వేళ, ఆర్థిక వ్యవ స్థలో ఆ దిశగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వీసా కన్నా యూపీఐ ఎక్కువ లావాదేవీ లను ప్రాసెస్ చేస్తోంది. ఇప్పుడొక చిన్న మొబైల్ ఫోనే ఓ బ్యాంకు.
సాంకేతికత అందరిదీ!
సాంకేతికత వల్ల వ్యవసాయం, ఆరోగ్య రక్షణ రంగాల్లో సమూ లమైన మార్పులు వచ్చాయి. హరియాణాలో ఉండే ఓ రైతు జగదేవ్ సింగ్ విషయమే తీసుకోండి! ఆయనిప్పుడు ఏఐ యాప్‌లను ఉపయోగించి పంట సంబంధిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని, భూసారా నికి సంబంధించిన డేటాను తన ఫోన్ లోనే తెలుసుకుంటున్నారు.
పీఎం–కిసాన్ పథకం 11 కోట్ల రైతులకు డిజిటల్ పద్ధతిలో నేరుగా ఆర్థిక చేయూతను అందిస్తోంది. డిజి లాకర్‌కు ఇప్పుడు 57 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. 967 కోట్ల పత్రాలు అందులో డిజిటల్‌గా నిల్వ అయి ఉన్నాయి. మీ డ్రైవింగ్ లైసెన్సు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, ఇతర అధికారిక పత్రాలు భద్రంగా మీ ఫోన్ లోనే ఉంటాయి. ఇకపై రోడ్డు మీద పోలీసు తనిఖీల్లో భౌతిక పత్రాల కోసం తడబడాల్సిన అవసరం లేదు. డిజి లాకర్ నుంచి మీ డిజిటల్ లైసెన్సును చూపించండి చాలు. తక్షణ ఆధార్ ధ్రువీకరణ ద్వారా... ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సులభతరమైంది.
అసాధ్యం అనిపించిన దానిని భారతదేశం సాధించింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని... అది కూడా హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తో చేరుకుంది. ప్రపంచ స్థాయి ఫలితాలను అందిస్తూ భారతీయ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని నిరూ పించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ పై చేసిన వ్యయం రూ. 450 కోట్లు మాత్రమే. చంద్రయాన్–3 భూ ఉపగ్రహంపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ను నిలబెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కించింది.
ఒకే మిషన్ లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. భారతదేశ రాకెట్లు ఇప్పుడు 34 దేశాల ఉపగ్ర హాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాయి. ‘గగన్ యాన్’ మిషన్‌తో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్షంలోకి మాన వులను పంపిన నాలుగో దేశంగా కూడా భారత్ నిలవనుంది.
పీఎం గతిశక్తి పోర్టల్ అపూర్వమైన స్థాయిలో జీఐఎస్ టెక్నా లజీని ఉపయోగిస్తోంది. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టునూ డిజిటల్‌గా మ్యాప్ చేస్తారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులన్నీ కలిసి సమన్వయ ప్రణాళికగా రూపొందిస్తారు. ఇకపై సమన్వయ లోపం వల్ల జరిగే ఆలస్యం ఉండదు.
ఇండియా ఏఐ మిషన్ ద్వారా, 38,000 జీపీయూలు మూడింట ఒక వంతు ప్రపంచ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇది స్టార్టప్ లకు, పరిశోధకులకు, విద్యార్థులకు సిలికాన్ వ్యాలీ స్థాయి కంప్యూ టింగ్‌ను గంటకు సగటున రూ. 67 రేటుతో అందించింది.
మానవ అనుసంధానం
ప్రధాని మోదీకి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసు. కానీ ఆయన ప్రజలను మరింత బాగా అర్థం చేసుకున్నారు. అంత్యో దయకు సంబంధించి ఆయన దార్శనికత ప్రతి ఒక్క డిజిటల్ కార్య క్రమాన్నీ ముందుకు నడిపిస్తోంది. యూపీఐ బహుళ భాషల్లో అందు బాటులో ఉంది. అత్యంత ధనిక పారిశ్రామికవేత్తతో సమానమైన డిజిటల్ గుర్తింపును నిరుపేద రైతు కూడా కలిగి ఉన్నాడు.
సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకు ఎన్నో దేశాలు యూపీఐతో అనుసంధానమైనాయి. సమ్మిళిత వృద్ధికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ అవసరమని జీ20 ఆమోదించింది. దీనికి జపాన్ పేటెంట్ మంజూరు చేసింది. భారత్ పరిష్కారంగా ప్రారంభమైన యూపీఐ డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రపంచ నమూనాగా మారింది.
గుజరాత్‌లో మోదీ చేసిన ప్రారంభ ప్రయోగాల నుంచి డిజిటల్ ఇండియా వరకు... ఈ ప్రయాణం జీవితాలను మార్చే సాంకేతిక పరిజ్ఞాన శక్తిని ప్రదర్శిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన తన పాలన సారాంశంగా మార్చారు. పాలకులు మానవీయ కోణంలో సాంకేతికతను స్వీకరించినప్పుడు, మొత్తం దేశాలు భవిష్యత్తులోకి దూసుకెళ్లగలవని ఆయన నిరూపించారు.
అశ్వినీ వైష్ణవ్
వ్యాసకర్త కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార – ప్రసార శాఖ మంత్రి