బ్రిటిష్ పార్లమెంటులో 1947 జూలై 5న ప్రవేశపెట్టిన ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ దరిమిలా భారత దేశంలో విభజన అల్లర్లు ఒక్కసారిగా ఊపందు కున్నాయి. మరోవైపు స్వతంత్రంగా ఉన్న 562 సంస్థానాలను సర్దార్ వల్ల భాయి పటేల్ ఆధ్వర్యంలో ‘స్టేట్స్ డిపార్ట్‌మెంట్’ ఒకటి ఏర్పాటుచేసి ‘ఇన్‌స్ట్రు మెంట్ ఆఫ్ యాక్సెషన్’ (విలీన ఒప్పందం) ద్వారా ఇండియాలో విలీనం చేయనారంభించారు.
ఆగస్టు 15 నాటికి హైదరాబాద్, కశ్మీర్, జూనాగఢ్ మినహా మిగతా రాజ్యాలు చాలావరకు భారత దేశంలో కలసిపోయాయి. హైదరాబాదుతో పాటు భోపాల్,రాంపూర్, మహమూదాబాద్ వంటి 11 సంస్థానాలు ముస్లిం నవాబుల అధీనంలో ఉండేవి. కశ్మీరు, హైదరా బాదు అలీనంగా ఉండదలచుకుని విలీన పత్రంపైసంతకం చేయలేదు. కానీ, గుజరాత్‌లోని జూనాగఢ్ నవాబు మహబత్ ఖాన్ మాత్రం తన సంస్థానాన్ని పాకిస్తాన్‌లో కలపనున్నట్లు ఆగస్ట్ 14న వెల్లడించారు. జూనాగఢ్ దీవాన్ (ప్రధాని) షానవాజ్ భుట్టో (పాకిస్తాన్ మాజీ అధ్య క్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో తండ్రి), ముస్లిం లీగ్ నేత జిన్నాను సంప్రదిస్తూనే ఉన్నారు. వేరావలి పోర్టు నుండి పాకిస్తాన్ యుద్ధ సామగ్రి జూనాగఢ్ చేరు తున్న వార్తలు రావటంతో, ఇండియన్ నేవీ నౌకలను పర్యవేక్షణ కోసం అటు పంపా లనే పటేల్ సలహాను భారత నౌకాదళానికి చెందిన బ్రిటిష్ అధికారి అడ్మిరల్ జాన్ టి. హాల్ తోసిపుచ్చారు. ఆ తిరస్కారాన్ని పటేల్ సహించలేక పోయారు. నెహ్రూ తటస్థ వైఖరి కూడా ఆయనకు నచ్చలేదు. ‘24 గంటల్లో జూనాగఢ్‌కు భారత్ మిలిటరీ వెళ్లకుంటే, నేను కేబినెట్ నుండి తప్పుకుంటా’ అని ప్రధాని నెహ్రూకు అల్టిమేటం ఇచ్చారు.
ఇంతలో హిందూ–ముస్లిం అల్లర్లు రాజుకున్నాయి. పటేల్ తీసుకున్న రాజ కీయ నిర్ణయంతో ఆ రోజు రాత్రి నెహ్రూ, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. మరుసటి రోజు జూనాగఢ్ సరిహద్దుప్రాంతాల్లోని భావనగర్, పోర్‌బందర్, నవానగర్‌లకు భారత సైన్యం, నౌకా బలగాలు చేరుకున్నాయి. ఇక ఏ క్షణంలోనైనా జూనాగఢ్ ప్యాలెస్ ముట్టడి జర గొచ్చు. పరిస్థితిని అర్థం చేసుకున్న నవాబ్ మహబత్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి 1947 అక్టోబరు 24న ప్రత్యేక విమానంలో కరాచీ వెళ్ళి పోయారు. నవంబరు 1న ఇండియన్ ఆర్మీ జూనాగఢ్ చేరుకుంది. తర్వాత దివాన్ షానవాజ్ భుట్టో రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని భారత్‌కు అప్పగించి పాకిస్తాన్ చేరుకున్నాడు. పటేల్ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఏ రక్తపాతం లేకుండా జూనాగఢ్ భారత్‌లో కలిసిపోయింది. (జాన్ జూబ్రిజీకి రచన ‘డీత్రోన్’ ఆధారంగా)
– జిల్లా గోవర్ధన్ ‘ మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై
(రేపు (31 October) సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి )


