
1939లో జరిగిన ఆరెస్సెస్ మీటింగులో తొలినాళ్ల తన అనుచరులతో హెగ్డేవార్ (కూర్చున్నవారిలో ఎడమ నుంచి రెండో వ్యక్తి)
సందర్భం
ఆర్‌ఎస్‌ఎస్@ 100
ఓ శతాబ్దం కిందట విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆవిర్భవించింది. అయితే, ఇది కొత్తగా సృష్టించినదేమీ కాదు... ప్రాచీన సంప్రదాయానికి నవ్య వ్యక్తీకరణ మాత్రమే. భారత నిరంతర జాతీయ చైతన్యం కాలానుగుణంగా భిన్న రూపాల్లో, విభిన్న సవా ళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది. ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి మన కాలపు ప్రతిరూపమే ఈ సంఘ్. ఇటువంటి సంఘ్ శతాబ్ది వేడు కలలో భాగస్వాములం కావడం మన తరం స్వయంసేవకుల అదృష్టం.
దేశానికి, ప్రజలకు సేవ దిశగా ప్రతినబూని, అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్షలు. సంఘ్ స్థాపకుడు, మనందరి మార్గదర్శకుడు అయిన డాక్టర్ హెడ్గేవార్‌జీకి నా సగౌరవ ప్రణామాలు అర్పిస్తున్నాను. వందేళ్ల ఈ అద్భుత పురోగమనాన్ని స్మరించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లతో పాటు స్మారక నాణాన్ని కూడా ఆవిష్కరించింది.
వ్యక్తి వికాసం.. దేశ పురోగమనం
మానవ నాగరికతలన్నీ గొప్ప నదీ తీరాల్లోనే పరిఢవిల్లాయి. అదే తరహాలో సంఘ్ ప్రభావంతో లెక్కలేనన్ని జీవితాలు చరితార్థ మయ్యాయి. ఒక నది తాను తడిపిన ప్రతి అంగుళం నేలనూ సుసంపన్నం చేస్తుంది. అదే విధంగా సంఘ్ కూడా దేశంలోని ప్రతి మూలనూ, సమాజంలో ప్రతి రంగాన్నీ పెంచి పోషించింది. ఒక నదీ ప్రవాహం పలు విధాలుగా చీలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరింపజేస్తుంది.
సంఘ్ ప్రయాణం కూడా ఇలాంటిదే. వివిధ అనుబంధ సంస్థల ద్వారా విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత సహా జీవితంలోని అనేక రంగాల్లో సంఘ్ తన సేవానిరతిని రుజువు చేసుకుంది. ‘‘వ్యక్తి వికాసం నుంచి దేశ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణంతో దేశ పురోగమనం’’... ఇదీ సంఘ్ అనుసరించిన పంథా!
దేశభక్తికి మారుపేరు
ఆవిర్భవించిన మరుక్షణం నుంచే దేశ ప్రాధాన్యాన్నే తన ప్రాథమ్యంగా సంఘ్ పరిగణించింది. డాక్టర్ హెడ్గేవార్ సహా అనేకమంది స్వయంసేవకులు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా అనేకసార్లు జైలుకు వెళ్లారు. పలువురు స్వాతంత్య్ర సమరయోధులకు సంఘ్ మద్దతునిస్తూ రక్షణగానూ నిలిచింది. స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం కోసం తన వంతు కృషిని కొనసాగించింది. దేశభక్తికి, సేవకు మారుపేరుగా ‘సంఘ్’ నిలిచింది.
దేశ విభజన సమయంలో లక్షలాది కుటుంబాలు ఆశ్రయం కోల్పోయిన వేళ... స్వయంసేవ కులు ముందుకొచ్చి శరణార్థులకు సేవలందించారు. పరిమిత వనరులే ఉన్నప్పటికీ... ప్రతి విపత్తు సమయంలోనూ ఆపన్న హస్తం అందించే వారిలో స్వయంసేవకులు ముందుంటారు. వారి దృష్టిలో ఇవి ఉపశమన చర్యలు మాత్రమే కాదు... దేశ చేతనను బలోపేతం చేయడం కూడా!
వివక్షకు వ్యతిరేకంగా పోరాటం
శతాబ్ద కాలపు ప్రయాణంలో సమాజంలోని వివిధ వర్గాల్లో స్వచేతననూ, ఆత్మవిశ్వాసాన్నీ సంఘ్ జాగృతం చేసింది. దశాబ్దా లుగా గిరిజన వర్గాల సంప్రదాయాలు, ఆచారాలు, విలువలను పరిరక్షించి, పెంపొందించడానికి అంకితమైంది. నేడు సేవా భారతి, విద్యా భారతి, ఏకల్ విద్యాలయాలు, వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థలు గిరిజన వర్గాల సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు శతాబ్దాలుగా హిందూ సమాజానికి సవాళ్లుగా ఉన్నాయి.
డాక్టర్ హెడ్గేవార్‌జీ కాలం నుంచి నేటి వరకు.. ప్రతీ స్వయం సేవక్, ప్రతీ సర్ సంఘ్ చాలక్ ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘‘అంట రానితనం తప్పు కాకపోతే, ప్రపంచంలో మరేదీ తప్పు కాదు’’ అని పూజ్య బాలసాహెబ్ దేవరస్‌జీ ప్రకటించారు. అనంతరం పూజ్య రజ్జు భయ్యాజీ, పూజ్య సుదర్శన్‌జీ కూడా ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ‘అందరికీ ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానవాటిక’ ఉండాలంటూ ప్రస్తుత సర్ సంఘ్‌చాలక్ గౌరవ మోహన్ భాగవత్‌జీ ఐక్యత దిశగా స్పష్టంగా పిలుపునిచ్చారు.
శతాబ్దం కిందట సంఘ్ ఏర్పడిన వేళ నాటి అవసరాలు, సవాళ్లు నేటి కాలానికి భిన్నంగా ఉన్నాయి. నేడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మన ఐక్యతను భగ్నం చేసే కుట్రలు, చొరబాట్లు, ఇంకా ఎన్నింటినో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఆర్‌ఎస్‌ఎస్ కూడా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడం సంతోషదాయకం.
తదుపరి శతాబ్దికి సమాయత్తం
సంఘ్ ప్రవచిస్తున్న ‘పంచ పరివర్తన్’... నేటి సవాళ్లను అధిగమించే మార్గాన్ని ప్రతి స్వయం సేవకుడికీ నిర్దేశిస్తుంది.
అవి: 1. స్వబోధ: వలసవాద మనస్తత్వం నుంచి విముక్తుల మయ్యేలా, మన వారసత్వ ఘనతను గర్వంగా ప్రకటించు కునేలా, స్వదేశీ సూత్రాన్ని పురోగమింపజేసేలా ఈ ‘స్వీయ అవగాహన’ దోహదపడుతుంది. 2. సామాజిక సామరస్యం: అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయంపై భరోసా కల్పించడం ద్వారా సామాజిక సామరస్యం సాకార మవుతుంది. మన సామాజిక సామరస్యానికి పెనుసవాలుగా పరిణమించిన చొరబాట్ల సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నత స్థాయి జనాభా మిషన్ (హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్)ను ప్రభుత్వం ప్రకటించింది. 3. కుటుంబ ప్రబోధన్: మన సంస్కృతికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను కుటుంబ విలువలు బలోపేతం చేస్తాయి.
4. నాగరిక్ శిష్టాచార్: సామా జిక స్పృహ, బాధ్యతా భావం ప్రతి పౌరుడి లోనూ జాగృతం కావాలి. 5. పర్యావరణ్: రాబోయే తరాల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణ సంరక్షణ అత్యంత ముఖ్యమైనది. ఈ ఐదు సంకల్పాల నిర్దేశంలో... తదుపరి శతాబ్ది లోకి ప్రయాణాన్ని ‘సంఘ్’ నేడు ప్రారంభించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో సంఘ్ కృషి కీలకం. మరోసారి ప్రతి స్వయంసేవకుడికీ నా శుభాకాంక్షలు.
నరేంద్ర మోదీ
భారత ప్రధాని