శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవకులు, సందర్శకులు. (ఇన్‌సెట్)లో ప్రార్ధన చేస్తున్న మోహన్ భాగవత్, కమలేశ్ పటేల్
భారత్ విశ్వగురువు కావాలనుకోవడంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
ప్రతి హిందువు సనాతన భారతీయ విలువలను అలవర్చుకోవాలి
విశ్వసంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘భారత్ విశ్వగురువు కావడం మా లక్ష్యం కాదు.. లోకానికే ఆ అవసరం ఉంది’అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రతి హిందువు సనాతన భారతీయ విలువలను అలవర్చుకోవాలని.. సమాజానికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ఈ నెల 25న ప్రారంభమైన విశ్వసంఘ్ శిబిరం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మోహన్ భాగవత్ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విశ్వనికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ తరగతులకు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, సేవా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, ఇంటర్నేషనల్ సంస్కృత భారతి సంస్థలకు చెందిన 1,610 మంది స్వయం సేవకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ ‘లోకంలో కరుణ, దయ నశించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటి పరిష్కారం కోసం ప్రపంచంలోని పలు సంస్థలు స్వయం సేవలను ఆశ్రయిస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా, కృత్రిమ మేధ సమాజానికి సవాల్ విసురుతున్నాయి.
అంది వచ్చిన సాంకేతికతను దైవబుద్ధితో కాకుండా రాక్షస బుద్ధితో వినియోగించి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మనుషులు తయారుచేసిన సాంకేతికతను మంచి కోసమే వినియోగించాలి. ఏఐకి మనం బానిసలు కావొద్దు. మనకే ఏఐ బానిస కావాలి. భారత్ తరతరాలుగా ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. ఆయుర్వేదం నుంచి ఫిలాసఫీ వరకు అన్నింట్లోనూ ప్రపంచానికి దిక్సూచిగా నిలిచింది. వ్యక్తి నిర్మాణంపైనే సంఘ నిర్మాణం, సంస్థ అభివృద్ధి ఆధారపడి ఉంది. సమాజానికి మనం ఏది ఇస్తే తిరిగి అదే మనకు ఇస్తుంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి’అని ఆయన సూచించారు.
టీబీ రహిత భారత్ కోసం కృషి: డాక్టర్ కృష్ణ ఎల్ల
‘సైన్స్ అంటేనే ప్రశ్నించడం. ఆలోచనలు విస్తృతంగా ఉంటేనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. మా పరిశోధన సంస్థకు భారత్ బయోటెక్ అనే పేరు పెట్టడం వల్ల రెండుసార్లు పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. అయినా ఆ పేరుతోనే ముందుకెళ్లా. ఆఫ్రికా కోసం వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చాం. కోవిడ్ నియంత్రణలో మోస్ట్ సేఫస్ట్ వ్యాక్సిన్ ఏదైనా ఉందంటే అది కోవ్యాక్సినే. ప్రస్తుతం టీబీ రహిత భారత్ కోసం పనిచేస్తునాం.
భారత్ అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర కీలకం’అని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. కార్యక్రమంలో కన్హా శాంతివనం స్పిరిట్యువల్ గైడ్ కమలేశ్ డి. పటేల్, శిబిరాధికారి బన్వర్‌లాల్ పురోహిత్, విశ్వనికేతన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ భాటియా తదితరులు పాల్గొన్నారు. ముగింపు సభ ప్రారంభానికి ముందు వందేమాతరం గీతాలాపన, నియుద్ధగణ శారీరక ప్రదర్శన, లోక కళ్యాణార్థం 9 భాషల్లో రూపొందించిన సర్వమంగళ మాంగళ్యే వీడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.


