న్యూఢిల్లీ: ‘దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలంటే సంస్కరణలు (రిఫార్మ్), పనితీరు (పర్ ఫార్మ్), రూపాంతరణ (ట్రాన్స్ ఫార్మ్) చాలా ముఖ్యం. అవే ప్రగతి మంత్రం‘ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) 50వ భేటీ బుధవారం ఢిల్లీలో మోదీ అధ్యక్షతన జరిగింది. గత పదేళ్లలో కనీసం రూ.85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని చెప్పారు.
ప్రతి ప్రాజెక్టులోనూ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. రూ.40 వేల కోట్లకు పైగా విలువైన ఐదు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సందర్భంగా సమీక్షించారు. వీటిలో భాగంగా ఐదు రాష్ట్రాల పరిధిలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్, జల వనరులు, బొగ్గు వంటి రంగాల్లో పనులు చేపడుతున్నారు. పీఎం శ్రీ పథకం పనితీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మోదీ సూచించారు.
రాష్ట్రాల్లోని ఇతర స్కూళ్లన్నింటికీ పీఎం శ్రీ స్కూళ్లు ఆదర్శ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ‘సకాలంలో నిర్ణయాలు,, మెరుగైన సమన్వయం, జవాబుదారీతనం, వేగవంతమైన ప్రభుత్వ పనితీరు ఎంతటి సత్ఫలితాలను సాధిస్తా యో మా పాలనే ప్రజలకు చెబుతోంది. గుజరాత్ సీఎంగా ఉండగా స్వాగత్ పేరిట నేను అమలు చేసిన ప్రాజెక్టు తాలూకు అనుభవమే ప్రగతి వేదికకు మూలం‘ అని మోదీ గుర్తు చేసుకున్నారు.


