
139 సంవత్సరాల క్రితం కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలు సాకారం అయ్యాయి. ఆ పని గంటలతో పాటు అనేక ఇతర కార్మిక ప్రయోజనాలూ నేటి పాలకుల నల్ల చట్టాల కారణంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లు కేంద్ర పాలకులు తీసుకువచ్చారు. ఈ నాలుగు లేబర్ కోడ్‌ల అమలు ఆ యా రాష్ట్రాల ఇష్టానికి వదిలి గెజిట్ విడుదల చేశారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాలు కొత్తగా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను అమలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా 10 నుంచి 12 గంటల పని దినాలు అమలు జరిపేందుకు ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. ఫలితంగా ఏపీలో పనిదినాన్ని 9–10 గంటలుగా నిర్ణయించారు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి కూడా ఈ సవ రణ అనుమతిస్తున్నది. చట్ట రూపంలో అమలు అయితే ఓవర్ టైమ్ కూడా 75 గంటల నుండి 144 గంటల వరకు ఇవ్వొచ్చు. ప్రభుత్వం మహిళలకు సమాన అవకాశాల పేరిట రాత్రిపూట పని చేయడా నికి చేసే సవరణ వల్ల, అందుకు అంగీకరించని మహిళల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అధిక పని గంటలు అమలు జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వాణిజ్య సంస్థల కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పనిచేయాలి. అయితే వారా నికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడానికి వీలు లేదనీ, అంతకుమించి పనిచేస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలనీ... కార్మిక శాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఓవర్ టైం పనిచేయడానికి పరిస్థితులు సహకరించని వాళ్ళను పని నుంచి తొలగించే అవకాశాలు ఏర్పడతాయి. యాజమాన్యాలు తమ అధిక లాభాల కోసం ఓవర్ టైం చేయాలని కార్మికులు, ఉద్యోగుల మీద ఒత్తిడి చేసే అధికారం నూతన లేబర్ కోడ్‌లు ఇస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2020 పారిశ్రామిక సంబంధ నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. 100 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నసంస్థల నుండి వారిని తొలగించడం యాజమాన్యాలకు సులభం అవుతుంది. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం క్లిష్టంగా తయారవుతుంది. 10 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య సంక్షేమం వంటి హక్కులు కోల్పోతారు. నాలుగో లేబర్ కోడ్ అమలు ద్వారా కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది.
ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం వంటి రకరకాల పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలు కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈ విధానం కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కాంట్రాక్ట్ ప్రాతి పదికన తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల జీవి తాలు దుర్భరంగా దిగజారిపోతాయి.
రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ తహతలాడుతున్నది. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలి గిస్తూ ఆ యా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రాలు స్వయం నిర్ణయాధికారం కలిగిన అంశాల్లో కూడా గవర్నర్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు సముచితంగా అందాల్సిన వాటాను ఇవ్వకుండా నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నారు. రాష్ట్రాల అధికారాల్లో వేలు పెడుతూ ఆ యా రాష్ట్రాలను స్థానిక సంస్థల స్థాయికి కుదించే విధంగా కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి. ఈ నేపథ్యంలో వామ పక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీలూ, ప్రజాసంఘాలూ, కార్మిక ఉద్యోగ సంఘాలూ జూలై 9న (నేడు) దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి!
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి.
-జూలకంటి రంగారెడ్డి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ