భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు.. తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు.
కొత్త చట్టాలు
వేతనాల కోడ్ (2019)
పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020)
సామాజిక భద్రత కోడ్ (2020)
వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)
కనీస వేతనానికి గ్యారెంటీ, గ్రాట్యూటీ, సామాజిక భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే ఈ కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఇప్పటికే ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో ఉంటాయి.
వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.
పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.
సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్‌ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది.
OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.
ప్రయోజనాలు
కొత్త కార్మిక కోడ్‌ల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు, కార్మికులందరికీ కనీస వేతనం గ్యారెంటీ, అపాయింట్మెంటు లెటర్ గ్యారెంటీ, సమాన పనికి సమాన వేతనం, మహిళల ఆమోదం, భద్రత చర్యలకు లోబడి రాత్రి వేళలో స్త్రీలు పని చేయడానికి అనుమతి, 40 కోట్ల మంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ, ఏడాది తర్వాత ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిస్‌కు గ్రాట్యూటీ, ఓవర్ టైంకు రెట్టింపు వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య రక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం వంటివి ఉన్నాయి.
నరేంద్ర మోదీ ట్వీట్
''శ్రమేవ్ జయతే! నేడు, మన ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్‌లను అమలులోకి తెచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలలో ఒకటి'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Shramev Jayate!
Today, our Government has given effect to the Four Labour Codes. It is one of the most comprehensive and progressive labour-oriented reforms since Independence. It greatly empowers our workers. It also significantly simplifies compliance and promotes ‘Ease of…— Narendra Modi (@narendramodi) November 21, 2025


