breaking news
private worker
-
నల్ల చట్టాలను విరమించుకోవాలి!
139 సంవత్సరాల క్రితం కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలు సాకారం అయ్యాయి. ఆ పని గంటలతో పాటు అనేక ఇతర కార్మిక ప్రయోజనాలూ నేటి పాలకుల నల్ల చట్టాల కారణంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర పాలకులు తీసుకువచ్చారు. ఈ నాలుగు లేబర్ కోడ్ల అమలు ఆ యా రాష్ట్రాల ఇష్టానికి వదిలి గెజిట్ విడుదల చేశారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాలు కొత్తగా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా 10 నుంచి 12 గంటల పని దినాలు అమలు జరిపేందుకు ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. ఫలితంగా ఏపీలో పనిదినాన్ని 9–10 గంటలుగా నిర్ణయించారు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి కూడా ఈ సవ రణ అనుమతిస్తున్నది. చట్ట రూపంలో అమలు అయితే ఓవర్ టైమ్ కూడా 75 గంటల నుండి 144 గంటల వరకు ఇవ్వొచ్చు. ప్రభుత్వం మహిళలకు సమాన అవకాశాల పేరిట రాత్రిపూట పని చేయడా నికి చేసే సవరణ వల్ల, అందుకు అంగీకరించని మహిళల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అధిక పని గంటలు అమలు జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వాణిజ్య సంస్థల కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పనిచేయాలి. అయితే వారా నికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడానికి వీలు లేదనీ, అంతకుమించి పనిచేస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలనీ... కార్మిక శాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఓవర్ టైం పనిచేయడానికి పరిస్థితులు సహకరించని వాళ్ళను పని నుంచి తొలగించే అవకాశాలు ఏర్పడతాయి. యాజమాన్యాలు తమ అధిక లాభాల కోసం ఓవర్ టైం చేయాలని కార్మికులు, ఉద్యోగుల మీద ఒత్తిడి చేసే అధికారం నూతన లేబర్ కోడ్లు ఇస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2020 పారిశ్రామిక సంబంధ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. 100 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నసంస్థల నుండి వారిని తొలగించడం యాజమాన్యాలకు సులభం అవుతుంది. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం క్లిష్టంగా తయారవుతుంది. 10 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య సంక్షేమం వంటి హక్కులు కోల్పోతారు. నాలుగో లేబర్ కోడ్ అమలు ద్వారా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం వంటి రకరకాల పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలు కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈ విధానం కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కాంట్రాక్ట్ ప్రాతి పదికన తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల జీవి తాలు దుర్భరంగా దిగజారిపోతాయి. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ తహతలాడుతున్నది. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలి గిస్తూ ఆ యా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రాలు స్వయం నిర్ణయాధికారం కలిగిన అంశాల్లో కూడా గవర్నర్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు సముచితంగా అందాల్సిన వాటాను ఇవ్వకుండా నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నారు. రాష్ట్రాల అధికారాల్లో వేలు పెడుతూ ఆ యా రాష్ట్రాలను స్థానిక సంస్థల స్థాయికి కుదించే విధంగా కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి. ఈ నేపథ్యంలో వామ పక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీలూ, ప్రజాసంఘాలూ, కార్మిక ఉద్యోగ సంఘాలూ జూలై 9న (నేడు) దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి!కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి.-జూలకంటి రంగారెడ్డిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ -
ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవే టురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులు రోజుకు గరిష్ఠంగా 8 గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో దాన్ని 9 గంటలకు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కార్మిక శక్తి చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటల్ని కూడా పెంచితే పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరు తున్నారు. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.ఇక్కడో విచిత్రం ఉంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే! ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగు తాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మధ్య వివక్ష చూపడానికి సిద్ధపడింది. ఈ వివక్ష పని గంటలతో మాత్రమే ఆగడం లేదు. జీత భత్యాల్లోనూ అసాధారణ వ్యత్యాసం రూపంలో ఉంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన చేయలేదు.వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరక ధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైథునాల వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి ఉంటుంది. ఆ పిదప కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ ఆసక్తుల వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి ఉంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి ఉంటుంది. వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే కనుక ఒక రోజులో ఉండే 24 గంటల్లో ఈ మూడు ధర్మాలకు సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశాపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిద్ధపడు తున్నాయి. ఇదొక అమాన వీయ పరిణామం.ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పా దాయ వర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగైరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృద్ధి చేస్తుండాలి. వీటికయ్యే ఖర్చును కూడా ప్రభు త్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్య నిర్వాహక వర్గం కూడా కావాలి. దానినే మనం సామాన్య భాషలో ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్థిక మంత్రి యన మల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ ఉద్యోగ జీత భత్యాలు, పెన్షన్లకు సరి పోతున్నదన్నారు.ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటా యించినా 75 శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడం లేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి వస్తున్నది.ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమ రావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలి రావ డానికి సిద్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారా నికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. 12796 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్లో బయలు దేరు తుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో 5.30 నిమిషాలకు బయలుదేరి మంగళ గిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం ఉదయం, సాయంత్రాల్లో అర గంట పని సమయాన్ని తగ్గించా ల్సిందే!సచివాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగ జేసి పదేళ్ళు దాటుతోంది. ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం? ఎవరికయినా రావలసిన సందేహమే!డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులుమొబైల్: 90107 57776 -
నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?
♦ పంచనామా నివేదిక సిద్ధమైతే బాధ్యులపై వేటు ♦ ఏఈని కేసు నుంచి తప్పించేందుకు యత్నాలు ♦ విద్యుత్ శాఖను కుదిపేస్తున్న ప్రైవేటు కార్మికుడి మృతి ఘటన అరసవల్లి: ‘రెగ్యులర్ ఉద్యోగం ఇప్పించేస్తాం. కొద్ది రోజులు ఆగండి. అంతవరకు మాతో పనిచేస్తాడు అంటూ ఏళ్ల తరబడి తిప్పుకుని ఇప్పుడు నా కుమారుడి మృతికి కారణమయ్యారు’ అంటూ ప్రైవేటు కార్మికుడు ఎం.లక్ష్మీ సాయి ప్రసాద్ తల్లిదండ్రులు వీరాస్వామి, శారద గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. దీనంతటికీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గొల్లుమంటున్నారు. ఆదివారం ఫాజుల్‌బాగ్ పేటలో ప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగానే! శనివారం సాయంత్రం స్థానిక గుజరాతిపేట సమీపంలో రెల్లివీధి వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కిందకు పడిపోయి లక్ష్మీప్రసాద్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటన ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. నిబం«ధనల ప్రకారం ప్రైవేటు కార్మికులను విద్యుత్ స్తంభాలు ఎక్కించకూడదు. సంబంధిత ప్రాంత అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) శ్రీనివాస్, లైన్‌మేన్ ధనుంజయ్ తదితరులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రసాద్‌ను విద్యుత్ స్తంభాలు ఎక్కించి పనులు చేయించుకున్నారని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కీలకంగా పోస్టుమార్టం నివేదిక ఈ కేసు రాజీ చేసేలా కొందరు విద్యుత్ ఉద్యోగులు రంగంలోకి దిగి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై మృతుని కుటుంబసభ్యులు, సన్నిహితుల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోస్టు మార్టమ్ రిపోర్టు కీలకంగా మారింది. ఆదివారం పోస్టుమార్టమ్ పూర్తయి.. అంత్యక్రియలు జరిగిపోయాయి. మరో రెండు రోజుల్లో రిపోర్టు రానుండడంతో ఇటు విద్యుత్ అధికారుల్లోనూ టెన్షన్ మొదలైంది. రిపోర్టులో విద్యుత్ షాక్‌తోనే మృతుడు మరణించినట్లు స్పష్టమైతే సంబంధిత బాధ్యులైన అధికార సిబ్బందిపై చర్యలు తప్పవని కొందరు అధికారులే చెబుతున్నారు. ఏఈ శ్రీనివాస్‌ను తప్పించేందుకు యత్నాలు! ఈ ఘటనలో విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు జోక్యం చేసుకోవడం చర్చనీ యాంశమైంది. ఇందులో ముఖ్యంగా శనివారం వన్‌టౌన్‌లో నమోదైన కేసులో ఏఈ శ్రీనివాస్ పేరును ప్రస్తావించడంతో.. కొందరు ఉద్యోగ సంఘ నేతలు ఎలాగైనా ఆ పేరును తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికితోడు కొందరు ఉద్యోగులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. మృతుని తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించేందుకు ఓ వామపక్ష నేతను కూడా బరిలోకి దింపి ఆదివారం పంచాయితీ జరిపించారు. అయినప్పటికీ మృతుని సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం ఎటువంటి అంగీకారాన్ని వ్యక్తం చేయలేదని సమాచారం. ఒకవేళ ఏఈ శ్రీనివాస్‌ను దూరం చేస్తే పరిహార చెల్లింపులో బాధిత కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుందని మృతుని సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.