ప్రతిష్టాత్మకంగా జరిగిన దుబాయ్ ఎయిర్‌షోలో భారత వాయుసేన తేజస్ యుద్ధవిమానం కుప్పకూలిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్(37) అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో మరోపక్క Pilot Blaming Theory తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం మధ్యాహ్నం దుబాయ్ వరల్డ్ సెంట్రల్‌లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఘనంగా ఎయిర్ షో జరిగింది. ఈ క్రమంలో తేజస్ విమానం ప్రదర్శన చేస్తూ నేల కూలింది. విమానం నేలపై పడిన వెంటనే అగ్నిగోళంలా మండుతూ పేలిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశారు. పొగలు ఎగసిపడగా అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్క్వాడ్రన్ లీడర్ నమన్ స్యాల్ దుర్మరణం పాలయ్యారు.
అయితే.. తేజస్ ప్రమాదం నేపథ్యంలో పైలట్ బ్లేమింగ్ థియరీ తెర మీదకు వచ్చింది. ప్రమాద దృశ్యాలను వీక్షించిన విమానయానరంగ నిపుణులు.. పైలట్ తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. తేజస్ విమానం నేలను ఢీకొట్టడానికి ముందు '‘నెగెటివ్ G టర్న్' (Negative G turn) విన్యాసం చేస్తున్నట్లు నొక్కి చెబుతున్నారు. నెగెటివ్ G ప్రకారం.. లూప్ విన్యాసం పూర్తి చేసి విమానాన్ని తిరిగి సమతల స్థితికి తీసుకురావడానికి పైలట్ ప్రయత్నించి ఉంటాడని, ఈ క్రమంలోనే నియంత్రించుకోలేని స్థితిలో అకస్మాత్తుగా విమానం దూసుకొచ్చి నేలను ఢీ కొట్టి ఉంటుందని అంటున్నారు. అయితే..
ఈ ఏడాది జూన్‌లోనూ.. అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటన సమయంలోనూ పైలట్ల తీరు వల్లే ప్రమాదం జరిగిందంటూ విస్తృత ప్రచారం జరిగింది. ప్రాథమిక దర్యాప్తు నివేదికలోనూ పైలట్, కో పైటల్ కాక్‌పిట్ సంభాషణ బయటకు రావడంతో.. దాన్నే చాలామంది ధృవీకరించుకున్నారు. ఈ నేపథ్యంలో పైలట్ల అసోషియేషన్‌తో పాటు మరణించిన పైలట్ల కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని.. తుది నివేదిక తర్వాతే ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొంది.
సాధారణంగా.. పైలట్ బ్లేమింగ్ థియరీ(Pilot Blaming Theory) అనేది విమాన ప్రమాదాలు జరిగిన మరుక్షణం వినిపించే అభిప్రాయం. అందుకు కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే విమాన ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన.. ప్రమాదానికి కారణం పైలట్ తప్పిదమే అని తక్షణంగా నిర్ధారించడం సహజంగా మారింది. కానీ..
ఈ థియరీ అన్ని సందర్భాల్లోనూ సరైంది కాదనే అభిప్రాయమూ ఒకటి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత సాంకేతిక లోపాలు నిరూపించడానికి సమయం పడుతుంది. ఈలోగా పైలట్ తప్పిదం అనుకోవడం పరిపాటిగా మారిపోయింది. అదే సమయంలో.. తయారీ సంస్థలు, సాంకేతిక వ్యవస్థలు తమపై నింద పడకుండా పైలట్‌ను బాధ్యుడిని చేస్తున్న సందర్భాలూ అనేకం ఉన్నాయి.
తేజస్ జెట్ దుర్ఘటనపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత వాయుసేన అధికారికంగా ఇప్పటివరకు పైలట్‌ను నేరుగా తప్పుపట్టలేదు. కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ వేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను పూర్తి స్థాయి విచారణ తర్వాతే తెలుస్తాయని తెలిపింది. ఈలోపు పైలట్‌ను నేరుగా బాధ్యుడిగా చూపడం సరైనది కాదంటూ ప్రచారాలను తోసిపుచ్చింది.
గత ప్రమాదంలో..
నెగెటివ్ Gని నియంత్రించడానికి, తట్టుకోవడానికి పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అయితే.. తేజస్ విమానాన్ని వేగంగా దిశను మార్చుకునేలా రూపొందించారు. అందువల్ల దాని రూపకల్పన స్వతహాగా అస్థిరంగా ఉంటుంది. కాబట్టి నెగెటివ్ జీ లాంటి విన్యాసాల సమయంలో కంట్రోల్ తప్పే అవకాశమూ లేకపోలేదు. దాన్ని కంట్రోల్ చేయడానికి అత్యాధునిక ఫ్లై-బై-వైర్ వ్యవస్థను అమర్చినా దాని పని తీరుపై స్పష్టత రావాల్సి ఉంది.
కూలిపోయిన LCA తేజస్ యుద్ధ విమానం తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్‌కు చెందినది. ఇది 2016 నుంచి సర్వీసులో ఉంది. తేజస్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అత్యుత్తమ భద్రతా రికార్డు ఉన్నప్పటికీ.. ప్రమాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది జైసల్మేర్ వద్ద ప్రమాదం జరిగింది. ఇంజిన్ ఆగిపోవంతో విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఘటనలో ఇంజిన్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేలింది.
నమన్ష్ ఎవరంటే..
37 ఏళ్ల వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా ఆయన స్వస్థలం. తండ్రి జగన్నాథ్ స్యాల్ భారత సైన్యంలో మెడికల్ కార్ప్స్‌లో పని చేసి.. ఆ తర్వాత విద్యాశాఖలో ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. 2009లో నమన్ష్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. నమన్ష్ భార్య అఫ్‌సాన్ కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారే. ఈ జంటకు ఆరేళ్ల కూతురు ఉంది. నమన్ష్ తన తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నారు. ఈ దుర్ఘటనపై హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ధైర్యవంతుడైన, కర్తవ్యనిష్ఠుడైన పైలట్‌ను కోల్పోయిందన్నారు. మాజీ సీఎం జైరాం ఠాకూర్ స్పందిస్తూ.. అత్యంత హృదయవిదారకమైన ఘటనగా పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ప్రదర్శనల్లో ఒకటి. 150 దేశాలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తేజస్ ప్రదర్శన సమయంలోనే ప్రమాదం జరిగింది. దీంతో సాధారణంగానే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.


