iBomma ఘటనతో మళ్లీ వెలుగులోకి వచ్చిన సినిమా ఇండస్ట్రీ నిలువు దోపిడీ.
“సినిమాటిక్ లిబర్టీ” అనే సాకుతో దోపిడీ, చట్టవ్యతిరేక చర్యలను ‘న్యాయం’ పేరిట చూపిస్తూ, నేరస్తులకే కిరీటాలు పెట్టే సంస్కృతిని మీరు ఎన్నేళ్లుగా పెంచారు. అందుకే సామాన్యులను నిలువునా దోచే సినిమా ఇండస్ట్రీకి ప్రతిస్పందనగా చట్టవ్యతిరేకంగా సినిమాలను పైరసీ చేసిన iBOMMA రవిని ప్రజలు ‘దేవుడు’గా చూసినా, ‘రాబిన్ హుడ్’గా కీర్తించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రజలకు ఇదే ధర్మం ఇది మీరు నేర్పినది.
ప్రజలు iBOMMA వంటి పైరసీ సైట్లను ఆశ్రయించడానికి అస్సలు కారణాన్ని పరిశీలించకుండా లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తూ మూలసమస్యలను పట్టించుకోకుండా,సినిమా ఇండస్ట్రీ సామాన్యులను చేస్తున్న నిలువు దోపిడీ గురించి మాట్లాడకుండా,సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన టికెట్ రేట్లను నియంత్రించకుండా,ఒక్క iBOMMA ban చేశారంటే సమస్యను పరిష్కరించినట్టు కాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. అటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు సామాన్య ప్రజలకు నష్టం కలగకుండా సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, మీరు ఆ సమయంలో ప్రతిపక్ష మీడియా సహకారంతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ప్రజలు అర్థం చేసుకోకుండా, ఆ నిర్ణయాన్నే వ్యతిరేకించేలా మోసపర్చారు.
కానీ ‘నిజం అనేది నిప్పు’, దానిని దాచలేరు, ఆపలేరు. ఆ రోజున అర్థం కాలేకపోయిన విషయాలు iBOMMA ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత ఈ రోజు ప్రజలు స్పష్టంగా గ్రహిస్తున్నారు.
ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్న వాస్తవం ఏమిటంటే:
- వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీ దోపిడిని తొలిసారి ప్రశ్నించిన నాయకులు
- సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో సినిమా అందాలని ఉద్దేశంతో టికెట్ రేట్లపై సంస్కరణలు తీసుకువచ్చారు
- ఆ రోజు ప్రతిపక్ష మీడియా అడ్డు అదుపు లేకుండా చేసిన మాయాప్రచారం వల్ల మోసపోయాము
- ఇప్పుడు iBomma వర్సెస్ సినిమా ఇండస్ట్రీ ఘర్షణ బయటపడడంతో ప్రజలు దీని అసలు రూపాన్ని “సామాన్యుడు వర్సెస్ ఇండస్ట్రీ దోపిడి”గా చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో iBomma వ్యవస్థాపకుడిపై ఇటీవల జరిగిన చర్యలు కొత్త ప్రశ్నల శ్రేణిని లేవనెత్తాయి. పైరసీ నేరం అయినప్పటికీ, ఈ చర్య అసలు సమస్యను పరిష్కరిస్తుందా అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న టికెట్ రేట్ల పెరుగుదల, సామాన్య ప్రజలను తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.
తెలుగు సినిమా రంగంలో టికెట్ ధరల పెరుగుదల, ప్రభుత్వ నియంత్రణల్లో అసంగత,ప్రజల్లో పైరసీ సైట్ల వైపు ఆధారణ పెరుగుతున్న దృశ్యం… ఇవన్నీ ఒకే కథ చెబుతున్నాయి: సమస్య వ్యక్తుల్లో కాదు, వ్యవస్థల్లో ఉంది. అయినా ఎలా జరుగుతోంది? వ్యక్తులను పట్టుకుని శిక్షించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపుతున్నట్టు చూపడం.
ఇటీవల iBomma వ్యవస్థాపకుడిపై జరిగిన చర్యలు చట్టపరంగా సరైనవే. పైరసీ అనేది నేరమే. కానీ ఈ చర్య ఒక పెద్ద ప్రశ్నను మాత్రం తప్పించలేదు: ఇది నిజంగా సమస్యకు శాశ్వత పరిష్కారమా?
“తెలుగు సినిమాల టికెట్ రేట్లు అసహజంగా పెరగడం కొత్త విషయం కాదు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ధరలు ఆకాశాన్నంటుతాయి. కుటుంబంతో కలిసి సినిమా చూడడం సాధారణ ప్రేక్షకుడికి ఈ రోజుల్లో ఒక చిన్న ‘ఈవెంట్’లా మారిపోయింది; ఖర్చు 1,000 నుంచి 2,000 రూపాయల వరకు వెళ్తోంది.
‘సరే, OTTలో చూద్దాం’ అనుకుంటే, వాటి ధరలు కూడా సామాన్యుడికి అందే స్థాయిలో లేవు. సినిమాలు మన జీవన విధానంలో భాగమైనప్పటికీ, ఈ పరిస్థితుల్లో పైరసీ వేదికలు ఎదగడం ఆశ్చర్యకరం కాదు సహజమే.”
అంటే iBomma కారణంగా టికెట్ ధరలు తగ్గలేదు; టికెట్ ధరలు అధికంగా ఉండటమే iBomma వంటి వేదికలకు ప్రాణవాయువు.
అయితే ప్రభుత్వ వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది. చట్టవిరుద్ధ ప్రవర్తనను చూపించే సినిమాలు సులభంగా సెన్సార్ అవుతాయి. అదే సినిమాలను ప్రైడ్, కల్చర్, ఇండస్ట్రీ గ్రోత్ పేరుతో ప్రోత్సహించడంలో వెనుకాడదు.కానీ పైరసీ విషయానికి వస్తే మాత్రం "కఠిన చర్యలు" అనే నినాదం.
ఇది ద్వంద్వ వైఖరి కాదు అంటే ఇంకేమిటి?ఇది సనస్యకు శాశ్వత పరిష్కారం కాదు కేవలం తాత్కాలిక విరామం మాత్రమే.
ఎందుకంటే..
iBOMMA పుట్టింది అంటె అది ప్రజల తప్పు కాదు.. మీరు సంవత్సరాలుగా పట్టించుకోని దోపిడీ, అధికారదుర్వినియోగం,అదుపుతప్పినవ్యవస్థలవల్లే.,
ఈ రోజు iBOMMA ban చేస్తే,రేపు అదే కారణాలతో ఇంకో వెబ్‌సైట్ పుడుతుంది.మరో రోజు ఇంకోటి.
సైట్‌లను మూసేయడం కాదు.. సమస్యను మూసేయడం అవసరం.
ఒక బొమ్మను మూసేస్తే మరొక బొమ్మ వస్తుంది—ఇది ఇంటర్నెట్ యుగం యొక్క వాస్తవం.
వ్యక్తులు మారవచ్చు, వెబ్‌సైట్లు మూసుకోవచ్చు, కానీ వ్యవస్థలు మారకపోతే సమస్య మారదు.
పైరసీ ఒక సాంకేతిక నేరం కాదు, ఒక ఆర్థిక–సామాజిక ప్రతిస్పందన.
సమస్యను చూడాల్సిన నిజమైన కోణం
• సినిమా టికెట్ ధరలు సాధారణీకరణ
• ప్రభుత్వ పాలసీల్లో స్పష్టత
• OTTలను అందుబాటులో ఉంచడం
• మార్కెటింగ్ వ్యయం, సినీ నటుల పారితోషక నియంత్రణ
• ప్రజలను శత్రువులుగా చూసే వ్యవహారం ఆపడం
ఇవి జరిగితేనే పైరసీకి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితేనే iBomma తరహా వేదికలు నిలిచిపోతాయి.
ఇది ప్రపంచం నిరూపించిన మోడల్ —Netflix, Aahaa,Amazon prime,Hot Star and YouTube Premium… అన్నీ చవకగా చేస్తే ప్రజలు పైరసీ వైపు వెళ్ళడం తగ్గిపోతుంది.
అందువల్ల ప్రశ్న ఒక్కటే: ప్రభుత్వం, సినీ పరిశ్రమ,మూల సమస్యను ఎందుకు పరిష్కరించడంలేదు?ఎందుకు వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా తీసుకుని పబ్లిసిటీ యుద్ధం చేస్తోంది?
“ఒక వ్యక్తిని జైలుకు పంపితే వ్యవస్థలోని లోపాలు తొలగిపోవు. ఒక వెబ్‌సైట్‌ను మూసేసినా, ఆ సమస్యను పుట్టించే కారణాలు మాత్రం అలాగే బతికే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు అయినా ప్రభుత్వం మరియు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మేల్కొని, అసలు సమస్యకు కారణమేమిటో నిజాయితీగా పరిశీలించి, ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలి.”
-పి. నేతాజి పవన్ కుమార్


