- మాధవ్ శింగరాజు
నీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారన్నది నీ బలాన్ని తెలుపుతుంది. నువ్వు ఎవరి పక్కన నిలబడి ఉంటున్నావన్నది వారి పట్ల నీలోని బలమైన ఆపేక్షను చూపుతుంది.
నేను, న్యూయార్క్ సిటీ... నా బాల్య మిత్రులం. ఎప్పటికీ ఒకరి పక్కన ఒకరం నిలబడి ఉండేవాళ్లం.
హడ్సన్ నది ఒడ్డున , న్యూయార్క్ సిటీ నా భుజం పైన చెయ్యేసి నడుస్తుంది. నాకెంతో ఇష్టమైన గోధుమ పిండి ‘బురిటో’ను క్వీన్స్ – బ్రూక్లిన్ స్టేషన్‌ల మధ్య తిరుగుతుండే ‘క్యూ’ ట్రైన్‌లో తనతో ఇష్టంగా పంచుకోనిస్తుంది.
వలస వచ్చిన వారిని కలవనివ్వటం అంటే, రమ్మని పిలిచి కలవటం కాదు. రావచ్చా అని అడిగి వెళ్లి కలవటం. న్యూయార్క్ మర్యాదగల మనిషి. మానవ మర్యాదల కోసం చూడని నగరం. ఇలాగే కదా నాగరికత ఉండాల్సింది!
జనవరి 1 అర్ధరాత్రి... కొత్త ప్రయాణికుడిలా ఓల్డ్ సిటీ హాల్ సబ్‌వే స్టేషన్‌లో దిగాన్నేను. లగేజ్ లేదు. లగేజ్‌లు మోయటానికి వచ్చినవాడి దగ్గర లగేజ్ ఎందుకు ఉంటుంది?
‘‘ఎవరతను, ఈ టైమ్‌లో దిగాడు?’’
‘‘న్యూయార్క్ సిటీ కొత్త మేయర్!’’
‘‘అది తెలుసు. ఎవరతను?’’
‘‘డెమోక్రాటిక్ సోషలిస్ట్!’’
‘‘అదీ తెలుసు. ఎవరతను?’’
‘‘ఒక యువకుడు!’’
‘అది తెలుస్తూనే ఉంది. ఎవరతను?’’
‘‘వలస వచ్చినవాడు’’
‘‘అది కూడా తెలుసు. ఎవరతను?’’
‘‘ఒక ముస్లిం’’
‘‘ఓరి దేవుడా! న్యూయార్క్ సిటీ ఒక ముస్లింని, ఒక వలస మనిషిని, ఒక డెమోక్రాటిక్ సోషలిస్ట్‌ని, ఒక అనుభవం లేని వాడిని తన మేయర్‌గా ఎన్నుకుందా? ఏం కర్మ ఈ 400 ఏళ్ల మహా నగరానికి?!’’
నాతో తలపడి నన్ను గెలిపించిన ఆండ్రూ క్యూమో, కర్టిస్ స్లివా, ఎరిక్ ఆడమ్స్ ఆత్మలు సబ్‌వేలో బాధతో మూలుగుతున్నట్లుగా అనిపించింది!
ఇందులో దేనికి నేను క్షమాపణలు చెప్పి ఈ ఆత్మల ఘోషను చల్లార్చాలి?
వలస వచ్చినందుకా? ముస్లింని అయినందుకా? యువకుడిని అయినందుకా? డెమోక్రాటిక్ సోషలిస్టును అయినందుకా?... లేక, ఇవన్నీ అయి కూడా, న్యూయార్క్ సిటీ మేయర్‌గా ఓడిపోనే పోనందుకా?!
న్యూయార్క్ వలసల నగరం. వలసలు నిర్మించిన నగరం. వలసల శ్రమతో నడిచే నగరం. ఇక నుంచి ఒక వలసదారుడు నడిపే నగరం కూడా.
ఈ మూడు పరాజిత ఆత్మలు నాతో పాటుగా రోజూ సిటీ హాల్‌లోని మేయర్ ఆఫీస్‌కి వచ్చి, డ్యూటీ చేసి వెళుతుంటాయా? వెంటాడే వాళ్లు, వేటాడేవాళ్లు ఎక్కడికైనా వస్తారు!
ఇకపై వాషింగ్టన్ నుంచి వచ్చిన వారెవరైనా న్యూయార్క్ సిటీలోని ఒక వలసదారుడిని తాకాలంటే, ముందుగా జోహ్రాన్ మమ్దానీ అనే ఈ కొత్త న్యూయార్క్ మేయర్‌ను దాటే వెళ్లాలి.
కర్టిస్ స్లివా వ్యథాత్మ అసహనంగా అంటోంది: ‘‘జోహ్రాన్, నువ్వు ఎవరివైనా, ఎక్కడి నుంచి వచ్చినా... ప్రమాదకారివి అవటం మాత్రం మొదట నువ్వు డెమోక్రాటిక్ సోషలిస్ట్‌వి అయినందువల్లనే...’’నవ్వొస్తోంది నాకు.
మనిషన్న వారెవరైనా డెమోక్రాటిక్ సోషలిస్ట్ అవకుండా ఉండగలరా?
కర్టిస్ రిపబ్లికన్. మేయర్ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు గెలుచుకున్న కర్టిస్ కానీ; 41 శాతం ఓట్లు సాధించిన ఆండ్రూ క్యూమో కానీ; పాయింట్ 3 శాతం ఓట్లు పొందిన ఎరిక్ ఆడమ్స్ కానీ, వ్యక్తులుగా డెమోక్రాటిక్ సోషలిస్ట్‌లు కాకుండా పోతారా?!
డెమోక్రాటిక్ సోషలిస్ట్‌గానే నేను ఎన్నికయ్యాను. డెమోక్రాటిక్ సోషలిస్టుగానే న్యూయార్క్ సిటీని నడిపిస్తాను.
ఆ నడక నాకు న్యూయార్క్ సిటీ నేర్పిందే!


