
అభిప్రాయం
గణనీయంగా బలహీనపడటంతో పాటు దారీతెన్నూ లేకుండా సాగుతున్న నక్సలైట్ ఉద్యమం గురించిన చర్చలు ‘ఆపరేషన్ కగార్’ కన్నా కొన్నేళ్ల ముందు నుంచే జరుగుతున్నాయి. అందుకు కారణాలు రెండు. ఒకటి – నక్సలిజం పట్ల గత కాంగ్రెస్ ప్రభుత్వాల కన్నా మౌలికంగానే భిన్నమైన విధానం గల బీజేపీ అధికారానికి వచ్చింది. రెండు – యథాతథంగా ఆ ఉద్యమం బలహీనపడటం 1990ల నాటికి మొదలై, 2010లు వచ్చేసరికి బాగా పెరిగింది.
ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. నక్సలైట్ ఉద్యమకారుల త్యాగాలు వృథా ప్రయాసగా మారుతున్నాయన్న భావనలు సాధారణ సమాజంతోపాటు, వారిపట్ల ఏదో ఒక మేర సానుభూతిగల వర్గాలలోనూ కొంతకాలం నుంచి ఉండగా, ఇటీవల పెరిగాయి. ఈ అభిప్రాయాలన్నింటి సారాంశం, ఉద్యమం ఇక ముందుకు సాగే అవకాశం లేదు గనుక విరమించుకోవటం మంచిదని!
తగ్గిన జనాదరణ
దేశం దశాబ్దాల తరబడి ఉద్యమించి 1947లో స్వాతంత్య్రాన్ని సాధించుకోగా, 20 ఏళ్లు గడిచేసరికి దేశంలో వేర్వేరు వర్గాల అసంతృప్తి, అశాంతి, అందులో భాగంగా నక్సలైట్ ఉద్యమం ఎందుకు మొదలైనట్లు? అది బలహీనపడినప్పటికీ 55 ఏళ్లు గడిచినా ఎందుకు కొనసాగుతున్నట్లు? అనే చర్చ ఎట్లున్నా, అది మరెంతో కాలం సాగే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందుకు కారణాలు అనేకం. స్వీయ లోపాల వల్ల, ప్రభుత్వ అణచివేతల కారణంగా ఉద్యమం బలహీనపడింది.
స్వీయ లోపాలు అనేవి సైద్ధాంతికమైనవి, నాయకత్వపరమైనవి, వ్యూహాలూ, ఎత్తుగడలకు సంబంధించినవి, ప్రజాదరణతో నిమిత్తం గలవి. ఈ నాలుగింటిని నక్సలైట్లు సరిదిద్దుకొని తేరుకోగల సూచనలు ఎంతమాత్రం కనిపించటం లేదు. వీటిలో ప్రజాదరణ అన్నింటి కన్న కీలకమైనది. అది ఉన్నట్లయితే తక్కిన మూడింటిలో కొన్ని లోటుపాట్లు ఉన్నా ముందుకు పోగలరు. ఈ సూత్రం ఏ ఉద్యమానికైనా, ఏ సాధారణ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుంది.
నక్సలైట్లు తొలి దశాబ్దాలలో ఉండిన ప్రజాదర ణను మలి దశాబ్దాలు వస్తుండగా కోల్పోవటం మొద లైంది. అందుకు కారణాలు అనేకం. కొన్ని ప్రభుత్వ అణచివేతలు, దానితోపాటు అభివృద్ధి–సంక్షేమ కార్య క్రమాలలో ఉన్నాయి. మరికొన్ని సమాజం వైపునుంచి.
అవి – కొత్త తరాలు ఉనికిలోకి రావటం, వారి ఆలోచనలూ, కోరికలూ, వ్యవహరణా శైలి కొత్తది కావటం, తమ తల్లిదండ్రులు అనుభవించిన స్థాయి పేదరికానికి గురికాక పోవటం, వ్యవసాయ సంక్షోభా లతో నిమిత్తం లేకపోవటం, గ్రామాలతో సంబంధాలు తగ్గి పట్టణీకరణలూ ఆధునికీకరణలలోకి ప్రవేశిస్తుండటం వంటివి కొత్త సామాజిక మార్పులయ్యాయి. పాత తరాలకు కూడా నక్సలిజం పట్ల ఉండిన గురి వివిధ కారణాల వల్ల తగ్గటం మొదలైంది.
పోతే, అణచివేతలు, వాటిని తట్టుకోలేక పోవ టాలు, కలిగే నష్టాలను ఒకప్పటి వలె పూడ్చుకోలేక పోవటాలు సరేసరి కాగా, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ చర్యల ప్రభావాలు కూడా ఉన్నమాట నిజం.
విరమిస్తే ఏం చేయొచ్చు?
నక్సలైట్ ఉద్యమం మొదలైన తర్వాత ఆ తొలి దశాబ్దాల ఉధృతి, మలి దశాబ్దాల బలహీనతల దశకు చివరన చెప్పుకోవలసింది ఏమంటే, ఒకవైపు ఉద్య మానికి ఆ పరిస్థితులలో ముందుకు పోవటం ఎట్లా గన్న సైద్ధాంతిక స్పష్టత లేకపోయింది. ప్రజలను, వారి భాగస్వామ్యం కేంద్రంగా చేసుకుని ఉద్యమ నిర్మాణానికి బదులు మిలిటరిజానికి పెద్దపీట అయింది. దాని నష్టాలు, సమస్యలు దానివయ్యాయి.
ఆ దశకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలు ద్వంద్వ వ్యూహం అనుసరించి విజయవంతమయ్యాయి. నక్సలిజాన్ని తీవ్రంగా అణచివేస్తూనే, అది కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, అభివృద్ధి సమస్య కూడానని చెప్పటం విధానం అయింది. ఆ రెండు విధాల చర్యలు వ్యూహంగా మారాయి. వాటి ఫలితంగా ఉద్యమం దెబ్బతింటుండగా, ఉద్యమా నికి మైదాన ప్రాంతాల ప్రజలు, బీసీ, ఎస్సీలు దూరం కాసాగారు.
ఆర్థిక మార్పులతో కొత్త తరాల దృక్పథం మారి వారు దూరమయ్యారు. పలు ప్రాంతాలలో గిరిజన శ్రేణులు కూడా! బీజేపీ అధికారానికి వచ్చే సరికే సమాజ వర్గాలకు, ఉద్యమానికి సంబంధించి ఈ మార్పులు స్థిరపడుతుండగా, కొత్త అధికార పార్టీ కొత్త విధానాన్ని ముందుకు తేవటం మొదలు పెట్టింది. సామాజిక దృష్టికి కాంగ్రెస్ తరహాలో నటనా పరంగానైనా చోటు లేకపోయింది.
ఉద్యమం విషయానికి వస్తే, వర్తమాన స్థితిని, భవిష్యత్ అవకాశాలను లేదా అవకాశ రాహిత్యాన్ని, వీటన్నింటితోపాటు మొదట చెప్పుకున్న విధంగా వ్యక్తమవుతున్న విస్తృతాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు నక్సలైట్ నాయకత్వం ఉద్యమ విరమణను ప్రకటించటమే సరైనదిగా తోస్తుంది. నిర్ణయం తేలిక కాదు. ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడైనా కష్టమైనవే. కానీ పరిస్థితులనుబట్టి తప్పనివి.
సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవటం వల్ల ఎదురయ్యే నష్టాలు మరింతగా ఉంటాయి. తమతోపాటు ప్రజలకు కూడా! శాంతి చర్చలని ప్రాథేయపడిన స్థాయిలో ఇంతగా విజ్ఞప్తులు చేయటమే ఉద్యమం ఎన్నడూ లేనంత బలహీనపడినట్లు చెప్తున్నది. చర్చలని పౌరసమాజం నుంచి మాట్లాడు తున్నవారు ఎంత సహేతుక కారణాలు, తర్కాలు చెబుతున్నా ప్రభుత్వం అణుమాత్రం సడలింపు చూపకపోవటం కనిపిస్తున్నదే!
ఒకవేళ ఉద్యమ విరమణ జరిగినట్లయితే అనంతరం ఏమి చేయాలన్నది వేరే విషయం. ప్రధాన స్రవంతిలో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి సాధారణ ప్రజా ఉద్యమాలు జరపాలనీ, ఇప్పటికే గల వామపక్షాలతో కలిసి పని చేయాలనీ, ఎన్నికలలో పోటీ చేయాలనీ, ఇవేవీ కావనుకుంటే తమకు తోచిన ప్రజాస్వామిక మార్గాలను అనుసరించవచ్చుననే సూచనలు వస్తున్నాయి. సమాజంలో సమస్యలు కొల్లలుగా ఉన్నాయనీ, ప్రజలలో అసంతృప్తి తక్కువ కాదనీ, వివిధ పార్టీ ప్రభుత్వాలే గాక ప్రతిపక్షాల వైఫల్యాలు అనేకం కనిపిస్తున్నాయనీ, కనుక వాటి ఆధారంగా, ప్రజాస్వామిక వ్యవస్థ కల్పించే అవకాశాలను వినియోగించుకుని కృషి చేయవచ్చుననీ పలువురి నుంచి వినవస్తున్న సలహా. నక్సలైట్ నాయకత్వం తన విజ్ఞతతో ఏ నిర్ణయం తీసుకోగలదో చూడాలి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు