'మనసు మాటే' బతుకు బాట | Sakshi Guest Column On Whole Foods Market John Mackey | Sakshi
Sakshi News home page

'మనసు మాటే' బతుకు బాట

Oct 14 2025 12:27 AM | Updated on Oct 14 2025 12:27 AM

Sakshi Guest Column On Whole Foods Market John Mackey

విశ్వగురు

గొలుసుకట్టు సరుకుల దుకాణాల సంస్థ ‘హోల్‌ ఫుడ్స్‌ మార్కెట్‌’ సహ వ్యవస్థాపకునిగా, దాని మాజీ సీఈఓగా జాన్‌ మెకే ప్రఖ్యాతి వహించారు. ఈ అమెరికన్‌ 44 ఏళ్ళ పాటు శ్రమించి దాన్నొక బహుళ జాతి సంస్థగా వృద్ధిలోకి తెచ్చారు. 2022లో అందులోంచి రిటైరయ్యాక ‘లవ్‌ లైఫ్‌’ పేరుతో ఆరోగ్య, స్వస్థతా వ్యాపారాన్ని ప్రారంభించారు. బెంట్లే కాలేజ్‌ పట్టభద్రులను ఉద్దేశించి మెకే చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: 

తల్లితండ్రులను మనసారా గౌరవించి, ప్రశంసించాలని బెంట్లే విద్యార్థులకు నేనిచ్చే మొదటి సలహా. కన్నవారు ప్రేమించినంతగా మనల్ని మరెవరూ ప్రేమించరు. మనల్ని పెంచి పెద్దచేసే క్రమంలో వారు కూడా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వారికి తెలిసినంతలో, ఉన్నంతలో మనల్ని తీర్చిదిద్దే కృషి చేశారని గుర్తించాలి. వారు మన కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసి ఉంటారు. వాటిలో కొన్ని మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. 

అంతరాత్మకు వ్యతిరేకంగా పోతే...
జీవిత కాలం నిజంగానే చాలా చిన్నది. ఈ ప్రాథమిక సత్యాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. మృత్యువు అనివార్యం కనుక మన జీవి తాలను ఎలా గడపాలి? ఈ ప్రశ్నకు జవాబు విషయంలో యువ కుడిగా ఉన్నప్పటి నుంచి నాకొక స్పష్టత ఉంది. అంతరాత్మ ప్రబోధం మేరకు నడచుకోవాలి. ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టాలి. జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నామో, దేన్ని ఎక్కువ అభిమానిస్తామో ఆ రంగంలోకే దిగాలి. 

నేను 19 ఏళ్ళ వయసు నుంచి నా జీవితంలో అలాగే నడచుకునేందుకు ప్రయత్నించాను. కాలేజీ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి, హోల్‌ ఫుడ్స్‌ మార్కెట్‌ ప్రారంభించాలనే నిర్ణయం నా హృదయం నుంచే వచ్చింది. ఈ నిర్ణయం నా తల్లితండ్రులనూ, స్నేహితుల్లో చాలా మందినీ ఆశాభంగానికి గురిచేసింది. కానీ, నిస్సందేహంగా అది సరైన నిర్ణయమనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగాను. 

హృదయం చెప్పినట్లు నడుచుకోవడంలో రెండు ముఖ్యమైన కోణాలున్నాయి. మొదట– మనల్ని మనం తెలుసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనం నిజంగా అంతరాత్మ చెప్పినట్లు నడచుకుంటు న్నామా లేక ఎక్కడన్నా దారి తప్పామా అన్నది తెలుస్తుంది. మనం గాఢంగా ఇష్టపడే వ్యాపకాలను చేపడితే మనం రెట్టింపు శక్తితో పని చేస్తాం. సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, చేసే పనికి ఒక ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. 

అంతరాత్మ చెప్పినట్లు నడచుకోవడం మానేస్తే దానికి వ్యతిరేక ఫలితాలు సంభవిస్తాయి. శక్తి సన్నగిల్లుతుంది. సృజన కొరవడుతుంది. చేసే పనికి ఒక పరమార్థం అంటూ ఉండదు. ముఖ్యంగా సంతోషం కూడా లోపిస్తుంది. ఒక దిశ, దశ లోపించాయని అనిపించినపుడు మరో దాన్ని ఎంచుకోండి. కొన ఊపిరి ఉన్నంత వరకు ఏదీ చేజారిపోయినట్లు కాదు. దేనికీ కాలం మించిపోయినట్లు కాదు. 

హృదయం చెప్పిన మార్గంలో నడిచేందుకు మరొకటి అవసరం పడుతుంది. అది భయాన్ని జయించడం! జీవితానికి ఒక పూర్తి సార్థకత చేకూర్చుకోకుండా చాలా మందికి అడ్డుపడేది భయమే! చేపట్టే పనిలో విఫలమవుతామేమోననే భయం. ఆత్మీయులు మనం ఇష్టపడుతున్న రంగాన్ని తిరస్కరిస్తారేమోనని భయం. సక్రమంగా నిర్వహించగలమో, లేదోనని మనకే ఒక సందేహం. మనలో రేకెత్తే భయాన్ని బయటివారు ఎవరూ పోగొట్టలేరు. దాన్ని మనకు మనమే తొలగించుకోవాలి. భయం మన మనసు సృష్టించే ఒక బూచి. అది బయటిది కాదు. లోపలి నుంచి పుట్టుకొచ్చేది. పుడుతున్న చోటనే దాన్ని అంతం చేయాలి. 

ప్రేమే జీవిత మూలసూత్రం
మన జీవితాల్లో ప్రేమను పెంచి పోషించుకోవడాన్ని ఒక మూలసూత్రంగా అనుసరించాలి. ఇక్కడ ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య లైంగికతకు సంబంధించినది కాదు. నేను చెప్పే ప్రేమ ఎదుటి వారి పట్ల దయతో వ్యవహరించడానికి చెందినది. ఎదుటివారు మంచిపని చేస్తే నిండు మనసుతో అభినందించగలగాలి. తోటి వారిని ప్రేమించడం వల్ల మన జీవితాలు సుసంపన్నమవుతాయి. ప్రేమతో మెలిగేందుకు మరో మూడు సుగుణాలు అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. 

మొదటిది – కృతజ్ఞత చూపడం! బతికున్నంత కాలం మనం ధన్యవాదాలు తెలుపవలసిన సందర్భాలు అనేకం ఎదురవుతూంటాయి. ప్రతి రోజూ ఉదయం పూట కొద్ది నిమిషాలు మనకు మేలు చేసినవారిని, మనల్ని సంతోషపరచినవారిని గుర్తు చేసుకోవాలి. అవకాశం రాగానే వారికి కృతజ్ఞత తెలియచేయాలి. వృత్తి ఉద్యో గాలలోనూ సంతోషపెట్టే పనులు చేసిన తోటి సిబ్బందిని అభినందించాలి. అది సంస్థ పనితీరు మెరుగుపడేందుకూ, మరిన్ని సత్ఫలి తాలు సాధించేందుకూ నిస్సందేహంగా తోడ్పడుతుంది. 

రెండవది – క్షమాగుణం! అరకొర అవగాహనతో, అపోహలతో ఎదుటివారి పట్ల ఒక నిర్ణయానికి వచ్చేస్తూంటాం. వారిపట్ల మనసులో అక్కసు పెంచుకుంటాం. మన బాధలకు వారే కారణం అనుకుంటాం. మన జీవితాల్లో ప్రేమ పొంగి పొరలకుండా అడ్డుకునేది అలా పొరపాటు అభిప్రాయాలను ఏర్పరచుకోవడమే! దానివల్ల మనకు మనమే ఎంత హాని చేసుకుంటున్నామో పూర్తిగా గుర్తెరగం. అది తెలిస్తే అటువంటి అలవాటు మానుకుంటాం. 

మనం చేసిందే ఒప్పు అని, ఎదుటివారిది తప్పు అని మనసులో బలంగా ఉండటం వల్ల క్షమించలేం. ఎదుటివారు తప్పు చేయడం వల్లనే మనం క్షమించవలసి వచ్చిందనే అభిప్రాయం కూడా మనకు తరచు కలుగుతూ ఉంటుంది. కానీ, క్షమించడమంటే అసంతృప్తినీ, కోపాన్నీ మన మనసు నుంచి పారదోలడమే! అంతేకానీ, మన విలువలను, నైతిక సూత్రాలను వదులుకుంటు న్నట్లు కాదు. క్షమించడం వల్ల మనం గతం నుంచి విముక్తుల మవుతాం. వర్తమానంలో ప్రేమను ఆస్వాదించగలుగుతాం. 

మూడవది – ఉదారత! దీన్ని చాలా మంది డబ్బు ఇవ్వడమే అనుకుంటారు. ఎదుటివారికి మన సమయాన్ని వెచ్చించి, సేవలందించడం కూడా ఉదారత చూపడమే. అవి మనం వారికిచ్చే కానుకలు. మనం దేన్నో త్యాగం చేస్తున్నామనుకోవడం, మన ప్రయోజనాలను పక్కనపెట్టి వారికి సేవ చేస్తున్నామనుకోవడం నిజమైన ఉదారత అనిపించుకోదు. వారి లాభం మనకు నష్టం అనే భావన రాకూడదు. ఉదారత అంటే మన హృదయం నుంచి ప్రవహించే ప్రేమకు పొడిగింపు మాత్రమే! 

ఆశాభంగపు పాఠాలు
జీవితంలో ఆశాభంగాలు, అన్యాయాలు చాలా ఎదురవు తాయి. మనకు ఎదురయ్యే కష్టాలు, సవాళ్ళలో చాలా వాటిని మనం వృద్ధి చెందడానికి తోడ్పడే అవకాశాలుగా చూడటం నేర్చుకోవాలి. గతంలో చూడని నెలవులను మించి కొత్తవాటిలోకి ప్రవేశించేందుకు సహాయపడగల పాఠాలనుకోవాలి. పరిస్థితుల ప్రాబల్యం లేదా ఇతరుల వల్ల నష్టపోయిన వ్యక్తిగా మనల్ని మనం చూసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించాలి. 

మనల్ని చూసి ఎదుటివారు జాలి పడాలనుకోవడం కన్నా, మన మీద మనం జాలిపడటం కన్నా పెను విధ్వంసక భావావేశం మరొకటి లేదు. దాన్ని కనుక నిర్మూలించకపోతే – నిస్సహాయులం, నిర్వీర్యులం అయిపోతాం. హృదయం చెప్పినట్లు నడుచుకోలేం. జీవితం నేర్పాలనుకుంటున్న పాఠాలను అర్థం చేసుకునేందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం, ధ్యానం వంటివాటిని ఆశ్రయించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement