బంగ్లాదేశ్‌ ఇప్పుడొక టైమ్‌ బాంబ్‌! | Sakshi Guest Column On Bangladesh Issue | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ ఇప్పుడొక టైమ్‌ బాంబ్‌!

Aug 22 2025 12:41 AM | Updated on Aug 22 2025 12:41 AM

Sakshi Guest Column On Bangladesh Issue

విశ్లేషణ

‘ఉక్కు మహిళ’ షేక్‌ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్‌లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్‌ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్‌ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.

యూనస్‌ దేనికి వారధి?
తను స్థాపించిన గ్రామీణ్‌ బ్యాంక్‌ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్‌ శాంతి బహుమతి పొందిన మహమ్మద్‌ యూనస్‌ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.

నోబెల్‌ కమిటీ యూనస్‌ను ఎంపిక చేయడానికి గ్రామీణ్‌ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్‌ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్‌ 11న యూఎస్‌ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్‌ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్‌ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ లాబీయింగ్‌ చేయడం వెనుక అసలు కారణం ఇదే!

దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్‌ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించింది.  దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

వీధుల్లో బీభత్స కాండ
మానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.

ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్‌ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 

బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్‌ శైలిలో ‘మోరల్‌ పోలీసింగ్‌’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్‌ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.

పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్‌ మార్కెట్‌ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.

ఇండియాకూ గట్టి దెబ్బ
ముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్‌ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్‌–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్‌కు పట్టింది.    

బంగ్లాదేశ్‌ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్‌కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్‌ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు  ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్‌ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.

హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్‌ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్‌ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు.   

ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా తీసుకోవాలి, బంగ్లాదేశ్‌ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.

బ్రహ్మ చేలానీ 
వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌’ ఎమిరెటస్‌ ప్రొఫెసర్‌ (‘ప్రాజెక్ట్‌ సిండికేట్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement