
సందర్భం
అత్యంత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ వృత్తినిపుణులు ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలని కలలుగనడం సహజం. భారీ టెక్ లేదా భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థల ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానికి, ఆరేళ్ళ పాటు చెల్లుబాటయ్యే హెచ్–1బి వీసా చేజిక్కించుకోవాలని అర్రులు చాస్తారు. కానీ, ఆ రకం వీసాల సంఖ్యపై పరిమితి ఉంది. గ్రహీతలను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి ఆ వీసాకున్న ప్రతికూలాంశాలు.
హెచ్–1బి వీసా దారులు అమెరికాలో గ్రీన్ కార్డును చేజిక్కించుకోగలగడం, దీర్ఘకాలంలో పౌరసత్వాన్ని కూడా సంపాదించుకోవడం దానికున్న అనుకూలాంశాలు. హెచ్–1బి వీసాతో వృత్తి జీవితం మొదలుపెట్టి, తదనంతర కాలంలో ఉన్నత స్థాయికి చేరిన వారి జాబితా పెద్దదే. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ,గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా స్థాపకుడు జెన్‌సెన్ హుయాంగ్, జూమ్ స్థాపకుడు ఎరిక్ యువాన్ వంటి వారిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మారిన పరిస్థితులు
ఈ వీసాలపై 1,00,000 డాలర్ల చొప్పున ఒక విడత లెవీని ట్రంప్ ప్రభుత్వం విధించింది. అంత భారం మోయడం కష్టమని పెద్ద టెక్ కంపెనీలు శ్వేత సౌధానికి నచ్చజెబితే ఈ అంశానికి సంబంధించి, ఇతర కోణాలలో కూడా వీలైనంత త్వరగా మార్పు రావచ్చు. కానీ దీనివల్ల అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపైనే పెను ప్రభావం పడబోతోందనడంలో సందేహం లేదు. హెచ్–1బి వీసాలకు సౌజన్యం వహిస్తున్న పది టాప్ కంపెనీలలో భారతీయ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక్కటే ఉంది.
అమెజాన్ 10,000 వీసాలకు పైగా సంఖ్యతో 2025లో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. దానితో పోలిస్తే 5,500 వీసాలతో టి.సి.ఎస్. చాలా వెనుక నున్నట్లు లెక్క. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఆపిల్ వంటి ఇతర దిగ్గజాలు జాబితాలో చాలా దిగువన ఉన్నాయి. అంతమాత్రాన ఈ పరిణామం వల్ల భారతీయ సాఫ్ట్‌వేర్ రంగా నికి వాటిల్లే నష్టం లేదనుకోవడం పొరపాటు. ఎందుకంటే, హెచ్– 1బి వీసాదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే.
దెబ్బ మీద దెబ్బ
అమెరికన్ కంపెనీలు ఇకమీదట కూడా, బయట దేశాల నుంచి ఎక్కువ పనులు చేయించుకోవాలని కోరుకుంటాయా, ఫలితంగా, భారత్‌లో మరిన్ని గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) నెలకొంటాయా అనేది ప్రశ్న. దేశంలో వాటిని నెలకొల్పడంలో అగ్ర టెక్ సంస్థలు పట్టుదలతో ఉన్నాయి. అమెరికా వంటి అధునాతన ఆర్థిక వ్యవస్థలోకన్నా తక్కువ జీతభత్యాలతో భారతదేశంలో నిపుణులైన వారిని నియమించుకోవడం తేలిక.
ఐటీ సేవలకు భారతీయ కంపెనీలపై ఆధారపడటం ఇక ముందు కూడా కొనసాగవచ్చు. కానీ అధిక ఫీజు వల్ల అటువంటి సేవలు మరింత ఖరీదైనవిగా మారతాయి లేదా లాభదాయకతను తగ్గిస్తాయి. ఒక విడత ఫీజు చెల్లించడం వల్ల అయ్యే ఖర్చు, తత్ఫ లితంగా ఒనగూడగల ప్రయోజనాన్ని విశ్లేషించుకుని కంపెనీలు కొత్తవారిని తీసుకునే వ్యూహాలను రూపొందించుకుంటాయి. ఈ ఫీజు వసూలు చాలా కాలం కొనసాగితే, ఈ వీసాకు సౌజన్యం వహించడాన్ని అవి తగ్గించుకోవచ్చు. ఎల్1, ఓ1 వంటి ఇతర వీసా మార్గాలున్నాయి. కానీ, వీటికి షరతులుంటాయి. అందరు దర ఖాస్తుదారులు వాటిని ఉపయోగించుకోలేరు.
ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చే కంపెనీలపై పన్ను విధించాలని అమె రికాలో ఇప్పటికే ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ బిల్లు భారతీయ ఐటీ పరిశ్రమ పాలిట పెను తుపాను అవుతుంది. సాఫ్ట్‌వేర్ సర్వీసులను ఎగుమతి చేయడం ద్వారానే భారతీయ ఐటీ పరిశ్రమ బ్రహ్మాండ మైన వృద్ధిని సాధించగలిగింది. వాటి వ్యూహంలో హెచ్–1బి వీసాలు కూడా అంతర్భాగం.
అవకాశాల తలుపులు
సంక్షోభాలు అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తాయని అంటారు. హైటెక్ నవీకరణ, పరిశోధనకు దేశంలో తగిన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం–పరిశ్రమలు ఇప్పటికైనా చేతులు కలపాలి. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు భారతీయ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి వహించాయి గానీ, అత్యధునాతన టెక్నాలజీని తీర్చిదిద్దే వాగ్దానాన్ని అంతగా నిలబెట్టుకోలేకపోయాయి. అట్టడుగు స్థాయి నుంచి సమూల మార్పులు తీసుకురాగలిగినదిగా భారతీయ ఐటీ రంగం ప్రతిష్ఠను సంతరించుకోలేకపోయింది. ఇతర దేశాలలో వచ్చిన నవీకరణలను అనుసరించేదిగానే అది పేరుపడింది.
అమెరికా చేరిన భారతీయ ప్రజ్ఞావంతులు అక్కడి సంస్థలను డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో అగ్ర స్థానాన నిలపడంలో కృతకృత్యులవుతున్నారు. పరిశోధన, అభివృద్ధి, కొత్త వెంచర్ల ప్రారంభానికి అమెరికాలో వాతావరణం అనుకూలంగా ఉండే మాట నిజమే. భారత్‌లో అందుబాటులో ఉన్న మానవ ప్రతిభా వ్యుత్పత్తుల సంపదను వినియోగించుకునేందుకు ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులను కల్పించాలి.
ఇందుకు ప్రభుత్వాన్ని ఒక్కదాన్నీ నిందించి ప్రయోజనం లేదు. భారతీయ కంపెనీలు పరిశోధన–అభివృద్ధి విభాగంపై నిధులు వెచ్చించేందుకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దేశంలో ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్లు అపారంగా ఉన్నారు. వారిని ప్రోత్సహించే వాతావరణాన్ని దేశంలోనే సృష్టించు కోవలసిన అవసరం మున్నెన్నటికన్నా ఇపుడే ఎక్కువగా ఉంది.
సుష్మా రామచంద్రన్
వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)