
అరుంధతీ రాయ్
కామెంట్
అరుంధతీ రాయ్ తన పేరులోని ‘ఫస్ట్ నేమ్’ వదులుకున్నారని మీకు తెలుసా? 18 ఏళ్లప్పుడు ‘‘నా మొదటి పేరు సుజానాను వదిలేసుకున్నాను. అప్పట్నుంచీ క్రమంగా, ఉద్దేశపూర్వకంగా, వేరెవరి మాదిరిగానో రూపాంతరం చెందుతూ వచ్చాను’’ అని తన తాజా పుస్తకంలో వెల్లడించారు. ‘మదర్ మేరీ కమ్స్ టు మి’లో ఆమె ఇలాంటి ఇంకా అనేక చిరు జ్ఞాపకాలను పంచుకున్నారు.
మత్తుమందు లేకుండా గర్భస్రావం చేయించుకున్న సంగతి మన దృష్టిని ఆకర్షించే మరో దృష్టాంతం. అప్పటికి ఆమెకు ఇరవై రెండేళ్ళు. ‘‘అది భయంకరం. కానీ, అలా జరిగిపోయిందంతే’’ అని రాశారు. అదే రోజు రాత్రి ఆమె మరుసటి రోజు షూటింగ్‌లో పాల్గొనేందుకు హోశంగాబాద్ నుంచి పంచ్‌మఢీ వెళ్ళే రైలు ఎక్కేశారు.
తల్లి మేరీ రాయ్‌తో ఆమెకు పడేది కాదు. ఈ పుస్తకం పాక్షికంగా ఆ సంగతులనూ, అరుంధతి జీవితంలోని వివిధ దశల్లోని ఆత్మా నుగత వివరాలనూ వెల్లడిస్తుంది. అవి తరచూ కలతకు గురి చేస్తాయి. అరుంధతి తన తల్లిని ‘శ్రీమతి రాయ్’ అనే సంబోధిస్తూ వచ్చారు. పుస్తకం వెనుక వైపు అట్టలో ఆమెను ‘బందిపోటు’ అని పేర్కొన్నారు. కానీ, ఈ పుస్తకం చదువుతూంటే ఆమె నాకు రాక్షసిగానే తోచారు.
అరుంధతికి ఆరేళ్లున్నప్పుడు మొదటిసారి విమాన ప్రయాణంలో ‘‘అమ్మా! పిన్ని నీలాగా కాకుండా అంత సన్నగా ఉంటుంది ఎందుకని?’’ అని ప్రశ్నించడం ద్వారా తల్లికి చిర్రెత్తుకొచ్చేటట్లు చేసింది. ఆ ప్రశ్నకు ఆవిడ ఎంతగా కోప్పడిందంటే, అరుంధతి దానికి భయపడి విమానం కూలిపోవాలని కోరుకున్నారట. ‘‘విమానం కూలి మేమంతా చస్తే సరిపోతుంది అనిపించింది.’’
అరుంధతిని మేరీ తరచు ‘బిచ్’ అనే తిట్టేవారు. సోదరుడు క్రిస్టొఫర్‌ను ఇంకా దారుణమైన మాటలన్నారు. ‘‘తను కౌమారంలో ఉన్నప్పుడు, అమ్మ ఒకసారి అందికదా: ‘నువ్వు అసహ్యంగా ఉన్నావు, తెలివితక్కువ సన్నాసి, నేను నీ స్థానంలో ఉంటే ఈపాటికి ఆత్మహత్య చేసుకునేదాన్ని.’’
మేరీ రాయ్‌లో మెచ్చుకోదగిన పార్శ్వం కూడా ఉంది. ఆమెది దృఢ సంకల్పం. ఆమె నెలకొల్పిన పల్లికూడంను చక్కని పాఠశాలగా పరిగణించేవారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను చెప్పడంతోబాటు మంచి నడవడికను అలవరచేవారు. వారి స్నానపానాలను, మరుగు దొడ్లను శుభ్రం చేయడాన్ని మేరీ స్వయంగా పర్యవేక్షించేవారు.
ఓసారి బాలురు ఆడపిల్లల వక్షోజాలు, వేసుకునే బ్రాల గురించి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించినపుడు, మేరీ తన కప్ బోర్డు నుంచి ఒక బ్రాను బయటకు తెచ్చి ‘‘ఇదే బ్రా. దీన్ని ఆడవాళ్లందరూ వేసుకుంటారు. మీ అమ్మలు వేసుకుంటారు. తొందరలోనే మీ అక్కచెల్లెళ్ళు వేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అంతగా ఉత్తేజపరుస్తోందనుకుంటే, దీన్ని ఉంచుకోండి’’ అన్నారట.
అరుంధతి నటించిన లేదా స్క్రిప్టు సమకూర్చిన ‘మాసీ సాహెబ్’, ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’, ‘ఎలక్ట్రిక్ మూన్’ లాంటి చిత్రాలతో ఈ పుస్తకం అరుంధతి జీవితపు తొలినాళ్ళలోకి తీసుకెళుతుంది. అయితే ‘గార్డియన్’ పత్రిక చిత్ర సమీక్షకుడు డెరెక్ మాల్కమ్ ‘‘పేరు మార్చి ఉండాల్సింది. ‘గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే దానికి ఇంగ్లీషులో అర్థమే లేదు’’ అని పెదవి విరిచారు. అరుంధతి, ఆమె బృందం ఆ వ్యాఖ్యను బాగా వాడుకున్నారు. ‘‘మిష్టర్ మాల్కమ్, ఇంగ్లండ్‌లో మీరు ఇక ఎంతమాత్రం ఇంగ్లిష్ మాట్లా డటం లేదు’’ అని పబ్లిసిటీ చేశారు.
ఆమె జైలులో గడిపిన ఒక రోజు గురించి కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది. ‘‘జైలు గది తలుపు వెనుక వైపు మూసుకున్న శబ్దం, నాలోని ధైర్యాన్ని, విశ్వాసాన్ని నీరుగార్చేసింది. నేను మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానన్నది స్పష్టం. అక్కడున్నన్నాళ్ళూ ఏమి చోటుచేసుకోవడానికైనా అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. నిజానికి, ఆమె అంత దుర్బలంగా ఏమీ అయి పోలేదు. అక్కడ ఆమె కొందరిని స్నేహితులుగా చేసుకున్నారు. జైలు పక్షులను తనవైపు తిప్పుకొని ఉంటారని నా అనుమానం.
పుస్తకం చివరి పేజీల కొచ్చేసరికి, తల్లితో ఆమెకున్న సంక్లిష్ట సంబంధాన్ని అర్థం చేసుకుంటాం. ఒక్కోసారి ఆమె తల్లిని ద్వేషించారు. మరికొన్ని సందర్భాల్లో ప్రేమించారు. శ్రీమతి రాయ్ చని పోవడానికి కొద్ది నెలల ముందు కుమార్తెకు ఒక మెసేజ్ చేశారు. ‘‘ఈ ప్రపంచంలో నిన్ను మించి నేను ఎవరినీ ఎక్కువగా ప్రేమించింది లేదు.’’ అది అరుంధతిని ఆశ్చర్యపరచింది.
కానీ, జవాబు మాత్రం అంతే ప్రేమాస్పదమైన రీతిలో ఇచ్చారు. ‘‘నాకింత వరకు తెలిసినవారిలో నువ్వు చాలా అసాధారణమైన, అద్భుతమైన మహిళవి. నేను నిన్ను ఆరాధించే వ్యక్తిని.’’తల్లితో పడకపోయినా, ఆమె లేని లోటును అరుంధతి అను భవిస్తోందనే నా సందేహం. ‘‘నేను నిన్ను కలుస్తాను’’ అంటూ పుస్తకాన్ని ముగించారు.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్