
నూతనంగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ‘గూగుల్’, ‘ఆల్ఫాబెట్’ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వర్చ్యువల్ ప్రసంగపు సంక్షిప్త పాఠం:
విశ్వగురు
కొత్తగా పట్టభద్రులైన వారికి అభినందనలు. ప్రత్యక్షంగా మీ ముందు లేకుండా, ఇలా ఇంటి నుంచి వర్చ్యువల్ ప్రసంగం చేస్తా నని నేను ఊహించలేదు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆశావహ దృక్ప థంతో మెలగడం కష్టమే! కానీ, మీరు మరింత శక్తిమంతులుగా, ఉన్నతు లుగా నిరూపించుకోగలరనడంలో సందేహం లేదు. ఎందు కంటే, మీకంటే ముందు చాలా మంది దాన్ని రుజువు చేశారు.
వందేళ్ళ క్రితం, 1920లో స్పానిష్ ఫ్లూ సమయంలోనూ కొందరు పట్టభద్రులుగా బయటకు వచ్చారు. అప్పటికి యాభై ఏళ్ళ తర్వాత, 1970లో వియత్నాం యుద్ధ కాలంలోనూ గ్రాడ్యుయేట్లు అయినవారున్నారు. అంతెందుకు, సెప్టెంబర్ 11 ఘటనకు కొద్ది నెలల ముందు 2001లో చదువు పూర్తి చేసుకుని యూనివర్సిటీల నుంచి బయటకొచ్చినవారు లేరా? మహమ్మారులను, యుద్ధాలను, ఇతర సంక్షోభాలను దాటుకుని వచ్చినవారు ఎందరో ఉన్నారు. వారు కొత్త సవాళ్ళను అనేకం ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని సంద ర్భాలలోనూ వారు విజయులుగా నిలిచారు.
ఆశావాదంతో బతకమని మన సుదీర్ఘ చరిత్ర చాటుతోంది. ఆశావహులై ఉండండి. వర్తమానంలోని ప్రతి తరం, తమ తర్వాత రాబోయే తరం గురించి తక్కువ అంచనా వేసే విచిత్ర ధోరణిని నేను గమనించాను. ఒక తరం సాధించిన ప్రగతి తదుపరి తరానికి పునాది అవుతుందని గ్రహించ లేకపోవడమే దానికి కారణం. కొత్త వ్యక్తుల సమూహం అన్నింటినీ సాధ్యం చేసి చూపిస్తుంది. మీ అనన్యమైన దృక్పథం ఇంతవరకు ఊహించని వాటిని కూడా మన ముందుకు తేవచ్చు.
టెక్నాలజీలో పుట్టిన తరం
టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని కాలంలో పెరిగి పెద్దవాడినయ్యాను. నాకు పదేళ్ళు వచ్చేదాకా నేను టెలిఫోన్ ముఖమే చూడలేదు. చదువుకునేందుకు అమెరికా వచ్చిన తర్వాతనే కంప్యూటర్‌ను రోజూ వాడుకోవడం కుదిరింది. పాత రోజుల్లోకి వెళితే, ఎంతో కాలానికి ఇంటికొచ్చిన టెలివిజన్‌లో ఒకే ఛానల్ ఉండేది. మీకిపుడు రకరకాల ఆకృతుల్లో, పరిమాణాల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.
ఎక్కడైనా, దేని గురించైనా కంప్యూటర్‌ను అడగగలిగే సామర్థ్యం మీకిపుడు ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ, అటువంటి సామర్థ్యాన్ని నిర్మించడంపైనే నేను ఓ దశాబ్ద కాలం పనిచేశాను. మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోను. ఈ రకమైన ప్రగతి నన్ను మరింత ఆశావహుడిని చేస్తుంది.
టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాలు మిమ్మల్ని బహుశా నిస్పృహకూ, అసహనానికీ లోనుచేస్తూ ఉండవచ్చు. ఆ అసహనాన్ని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే, అదే కొత్త టెక్నాలజీ విప్లవాన్ని సృష్టిస్తుంది. నా తరం కలలుకనే సాహసం చేయలేనివాటిని మీరు తయారు చేసి చూపించగలరు. వాతావరణ మార్పు లేదా విద్యా రంగ సమస్యల పట్ల మా వైఖరి కూడా మిమ్మల్ని నిస్పృహకు గురిచేసి ఉండవచ్చు.
అసహనంతోనే మెలగండి. అది ప్రపంచానికి అవసర మైన ప్రగతిని సృష్టిస్తుంది. పరిస్థితులను మార్చాలి, ఏదో చేయాలి అనే తపన నవీకరణలకు దారితీసి, ప్రపంచానికి కొత్త రూపురేఖలను సంతరిస్తుంది. టెక్నాలజీ మన కుటుంబాలకు ఎంతగా అందుబాటు లోకి వస్తే, మన జీవితాలు అంతగా మెరుగవుతాయి.
మెరుగైన సెమీకండక్టర్లను తయారు చేయడం ద్వారా ఆ పని చేయగలనని నేను గ్రాడ్యుయేట్‌ని అయినపుడు భావించాను.అప్పటికి అంతకన్నా ఉత్తేజకరమైన అంశం ఏముంది? నేను అమెరికా రావడం కోసం విమాన టికెట్‌కు మా నాన్న ఒక ఏడాది జీతాన్ని వెచ్చించవలసి వచ్చింది. ఇంటికి ఫోన్ చేసేందుకు నిమి షానికి 2 డాలర్లకు పైగా ఖర్చయ్యేవి. బ్యాక్ ప్యాక్ కొనేందుకు కూడా ఇండియాలో మా నాన్నకు వచ్చే ఒక నెల జీతం అంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది.
అందరి కోసం టెక్నాలజీ
నేను స్టాన్‌ఫోర్డ్‌లో చేరిన ఏడాదే ఇంటర్‌నెట్ రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది. అదే ఏడాది మొజాయిక్ బ్రౌజర్ విడుదలైంది. అది వరల్డ్ వైడ్ వెబ్, ఇంటర్‌నెట్‌లను ప్రాచుర్యంలోకి తెచ్చింది. టెక్నాలజీని మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ నెట్ ఏకైక ఉత్తమ మార్గం అవుతుందని నాకు అప్పటికింకా తెలియలేదు. ఆ సంగతి గ్రహించాక, గూగుల్‌లో నేను నా కలలను సాకారం చేసుకునే పనికి ఉద్యమించాను.
నా నేతృత్వంలో సాగిన కృషితో 2009లో క్రోమ్ మొదలైంది. సరసమైన ధరలకు ల్యాప్ టాప్‌లను, ఫోన్లను అందించడంలో గూగుల్ చేసిన కృషికి సహాయపడ్డాను. గ్రాడ్యుయేషన్ తర్వాత పీహెచ్డీ చేసివుంటే అమ్మ, నాన్న గర్వపడేవారే. కానీ, టెక్నాలజీ ప్రయోజనాలను అనేకమందికి అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడిని. గూగుల్ సీఈఓగా ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడగలిగి ఉండేవాడిని కాదు.
మీదైన రీతిలో ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చండి. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని, మీదైన విశిష్టమైన మార్గంలో సాను కూల ప్రభావాన్ని చూపేందుకు, దాన్ని వినియోగించుకోండి. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో 27 ఏళ్ళ క్రితం మొదటిసారి అడుగిడి నపుడు ఇవేవీ నా ఊహల్లో లేవు. అదృష్టంతోపాటు టెక్నాలజీ పట్ల గాఢమైన వ్యామోహం, విశాల దృష్టితో వ్యవహరించడం నన్నిక్క డకు తీసుకొచ్చాయి.
అసహనమూ మంచిదే!
ప్రపంచంలో మిగిలిన వాటన్నింటి కన్నా మిమ్మల్ని ఏది ఎక్కువ ఉత్తేజపరుస్తోందో దాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మీ తల్లితండ్రులు చెప్పారని లేదా మీ స్నేహితులు చేస్తున్నారని లేదా సమాజం మీ నుంచి ఆశిస్తోందనే కారణంతో మీకిష్టం లేని పనుల్లోకి దిగకండి. ఊహించని దారులు గణనీయమైన ప్రభావానికి దారితీస్తాయి. ఎంచుకున్న రంగం ఇష్టమైనదైతే మనసు పెట్టి పనిచేయగలుగుతారు. అదృష్టం, పరిస్థితుల కన్నా, మీ వ్యామోహమే మిమ్మల్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా పనిచేస్తుంది. అది మీ గమనాన్ని తీర్చిదిద్ది, కలకాలం నిలవగల వారసత్వాన్ని మిగల్చగలుగుతుంది.
దేనినైనా అక్కున చేర్చుకునేందుకు సిద్ధ్దంగా ఉండండి. ఉన్న వాటిని ఇంకా మెరుగుపరచాలనే అసహనంతోనే వ్యవహరించండి. ఆశావహ దృక్పథాన్ని వీడవద్దు. ఇదే నేనిచ్చే సలహా. మీరు ఆ పని చేయగలిగితే చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అన్నింటినీ మార్చగలిగిన అవకాశం మీకుంది. మీరు మారుస్తారనే నమ్మకం కూడా నాకుంది!