
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు.
ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు.
జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.