
మాధవ్ శింగరాజు
ఇండియా, పాకిస్తాన్ రెండూ కూడా ఫైనల్స్‌కు చేరుకుంటే, రెండు జట్ల మధ్య – ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్నట్లే – ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇదే ప్రేమదాస స్టేడియంలో పోరు మొదలౌతుంది. ‘ప్రేమ’దాస స్టేడియంలో ‘పోరు’!! భలే ఉంటాయి ఈ అనుబంధాలు... కొట్లాడుకునే అక్కచెల్లెళ్ల మధ్య, ఘర్షణలు పడే అన్నదమ్ముల మధ్య! ఒకరి ఇంట్లోకి ఒకరు అడుగు పెట్టరు. పొరుగింట్లోనో, ఆ పై ఇంట్లోనో పంచాయితీ! ‘‘అలాగైతేనే వస్తాం’’ అని మొదటే అగ్రిమెంట్! నవ్వొస్తోంది నాకు!
షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనీ, సెల్ఫీలు తీసుకోవాలనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనకూడదనీ రూల్ బుక్‌లో ఏమైనా ఉందా అని ‘బోర్డు’లో పెద్దవాళ్లు అంటున్నారు! అది నిజమే కానీ... షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదనీ, సెల్ఫీలు తీసుకోకూడదనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనాలనీ కూడా రూల్ బుక్‌లో ఉండదేమో కదా! ఇలాంటప్పుడే, అమాయకమైన చిరునవ్వుతో – పైవారి ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన నాకు వస్తుంటుంది.
‘‘అలా చెయ్యకు హ్యారీ’’ అనేవారు చిన్నప్పుడు నాన్న. చిరునవ్వుతో సరిగ్గా అలానే చెయ్యబుద్ది అయ్యేది నాకు!
‘‘అలా చెయ్యటం కరెక్ట్ కాదు హర్మన్ ’’ అనేవారు కాలేజ్‌లో ప్రిన్సిపాల్. చిరునవ్వుతో సరిగ్గా అదే కరెక్ట్ అనాలనిపించేది నాకు!
ఇప్పుడిక బీసీసీఐ సెక్రెటరీ! ‘మహిళల ప్రపంచ కప్‌లో భారత్–పాక్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు! చిరునవ్వుతో సరిగ్గా నాకేం అనిపిస్తోందంటే, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోబోమనే గ్యారంటీ కూడా ఏమీ లేదని!
మనసులో దగ్గరితనాన్ని ఉంచుకుని దూరాన్ని ఎంతకాలం నటించగలం? మాట్లాడాలని లోలోపల పీకుతూ ఉంటే మౌనాన్ని ఎలా పాటించగలం?
కొద్దిసేపట్లో భారత్–పాక్‌ల మధ్య లీగ్ మ్యాచ్. అది వదిలేసి, ఎప్పుడో నెల తర్వాత నవంబర్ 2న ఎవరి మధ్య జరుగుతుందో కూడా తెలియని ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాన్నేను!
నిజంగానే భారత్–పాక్ ఫైనల్‌కి చేరుకుంటే, ఫైనల్‌లో గెలుపెవరిది అనే మాట అటుంచి... ఫైనల్‌లోనైనా టాస్ వేశాక షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా, ఆట ముగిశాకైనా చేతులు కలుపుకుంటామా అన్నదే ఆలోచిస్తూ యావద్దేశంతో పాటుగా నేను కూడా ఆ రోజు తెల్లవారుజాము నుంచే టెన్షన్ టెన్షన్‌గా ఉంటాననుకుంటా!
ఫాతిమా సనా పాక్ కెప్టెన్ . చిన్న పిల్ల. నాకంటే 13 ఏళ్లు చిన్న. ఎం.ఎస్.ధోనీ తన ఇన్ స్పిరేషన్ అట. ధోనీలా కూల్‌గా ఉండి ఈ వరల్డ్ కప్‌లో తన జట్టును గెలిపిస్తుందట! బహిరంగంగానే చెప్పేసింది. అది కదా ‘హై–స్పిరిటెడ్’ అంటే. కానీ బీసీసీఐ వేరే ‘హై’లో ఉంది. మొన్నటి మెన్ ్స క్రికెట్ ‘సంప్రదాయాన్నే’ ఉమెన్ ్స క్రికెట్ కూడా ఫాలో అవాలట! అంటే, నో షేక్ హ్యాండ్స్ అని.
2022 వరల్డ్ కప్‌లో – న్యూజిలాండ్‌లో భారత్–పాక్ ఆటకు పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన ఆర్నెల్ల వయసున్న కూతుర్ని వెంటపెట్టుకుని వచ్చింది. తల్లీకూతుళ్లతో కలిసి టీమ్ ఇండియాలోని అందరం సెల్ఫీ తీసుకున్నాం. ఆ గేమ్‌లో ఇండియా గెలిచింది కానీ, ఇండియాను బిస్మా మరూఫ్ కూతురు తన బోసి నవ్వుల్తో ‘క్లీన్ బౌల్డ్’ చేసేసింది. ఆ పాప పేరు కూడా ఫాతిమానే!
లీగ్ మ్యాచ్ టైమ్ అయింది. టాస్ కోసం లోపలికి వెళుతున్నాం. గెలుపు, ఓటమి... తర్వాతి సంగతి. ఫీల్డ్‌లో ఫాతిమా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను చెయ్యి చాస్తానా? లేక, ఫాతిమా షేక్ హ్యాండ్ కోసం నేనే ముందుగా చెయ్యి చాస్తానా? అంతా ఫాతిమా చేతుల్లో ఉంది.ఊహు... చేతుల్లో కాదు, ఫాతిమా చిరునవ్వులో ఉంటుంది.