
ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు తిరిగి రావడంపై ఉత్కంఠ
బోర్డులపై ఒత్తిడి పెంచుతున్న బీసీసీఐ
ఎక్కువ మంది జట్లతో చేరే అవకాశం
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఇప్పుడు లీగ్‌లో జరగాల్సిన తర్వాతి మ్యాచ్‌లపై అందరి దృష్టీ నిలిచింది. ఆరు నగరాలు బెంగళూరు, ముంబై, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్‌లలో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన గవర్నింగ్ కౌన్సిల్... ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌ల వేదికలకంటే ఆయా జట్లకు ఎవరెవరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది.
ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మే 9న ప్రకటించడంతోనే దాదాపు అందరు విదేశీ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నవారు కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవుతున్నట్లుగా బీసీసీఐ సోమవారమే ప్రకటించింది. దాంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని కీలక ఆటగాళ్లను రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
ఆటగాళ్ల ఇష్టానికి...
యుద్ధం కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. అయితే విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం లేదు.
ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్‌ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది.
ప్రధానంగా రెండు సిరీస్‌ల కారణంగా ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడే విషయంలో ఇబ్బంది ఎదురు కావచ్చు. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్‌లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్ కొత్త తేదీల్లోనే ఈ సిరీస్ ఉంది. మరో వైపు జూన్ 11 నుంచి ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది.
ఇందులో ఆడే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో చాలా మంది కోసం ఐపీఎల్ టీమ్‌లు ఎదురు చూస్తున్నాయి. మే 31న ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టు టీమ్ ఒక చోటకు చేరాలని దక్షిణాఫ్రికా బోర్డు స్పష్టంగా ఆదేశించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులోంచి రబడ, ఎన్‌గిడి, స్టబ్స్, మార్క్‌రమ్, రికెల్టన్, బాష్, యాన్సెన్, ముల్డర్ ప్రస్తుతం ఐపీఎల్ జట్లలో ఉన్నారు.
అహ్మదాబాద్‌లోనే ఫైనల్!
‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికల విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పాత షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్‌లు హైదరాబాద్, మరో రెండు కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు నగరాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక ఏర్పాట్ల సమస్యను దృష్టిలో ఉంచుకొని ‘ప్లే ఆఫ్స్’ను ఇక్కడి నుంచి తరలించాలని బోర్డు యోచిస్తోంది. మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ను సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా కొత్త వేదికలో కష్టమని భావిస్తోంది.
పైగా ‘ప్లే ఆఫ్స్’ తేదీల్లో హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో వర్ష సూచన ఉంది. అందుకే మిగిలిన లీగ్ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఆరు వేదికల నుంచి ఏవైనా రెండింటిలో ‘ప్లే ఆఫ్స్’ జరపాలనేది ఆలోచన. ఇదే కారణంగా చెన్నై, హైదరాబాద్ తమ హోం గ్రౌండ్‌లో ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లను కూడా ఫ్రాంచైజీలకు చెప్పి అక్కడి నుంచి తరలించారు.
టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఈ రెండు జట్ల చివరి మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికవుతోంది. బీసీసీఐ యోచన ప్రకారం క్వాలిఫయర్–1, ఎలిమినేటర్‌లను ముంబైలో నిర్వహించి... క్వాలిఫయర్–2, ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహించవచ్చు.