ప్రపంచం మన మాట వినట్లేదేం? | Sakshi Guest Column On India, Pakistan economy | Sakshi
Sakshi News home page

ప్రపంచం మన మాట వినట్లేదేం?

Jun 11 2025 12:51 AM | Updated on Jun 11 2025 12:51 AM

Sakshi Guest Column On India, Pakistan economy

భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

విశ్లేషణ

పాకిస్తాన్‌ ఒక విఫల రాజ్యం. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ప్రపంచంలో ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశ మైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబుతొ సుబియాంతో పాక్‌తో ముడిపెట్టకుండా, భారత్‌ను విడిగా సందర్శించారు. ఒక దశాబ్దం నుంచి భారత ప్రజానీకానికి ఈ రకమైన చిత్రాన్ని రూపుకట్టిస్తూ వస్తున్నారు. 

మరి మనం ‘అంతర్జాతీయ సమాజం’గా చెప్పుకొంటున్నది పాక్‌ను నిలదీయకుండా సంశయ స్థితిలో ఉండిపోవడానికి కారణ మేమిటి? పాక్‌ను గూడుగా చేసుకుని పనిచేస్తున్న ఉగ్ర మూకల వల్ల రెండు దేశాలూ ఘర్షణ పడి ఇంకా నెల కూడా కాకుండానే, కౌంటర్‌ – టెర్రరిజం కమిటీ ఉపాధ్యక్ష పదవిని ఐరాస భద్రతామండలి జూన్‌ 4న పాక్‌కు కట్టబెట్టింది. గత నెల రోజులుగా పాక్‌ సాధించిన దౌత్య విజయాలకు ఇది శిఖరాగ్రం. పాక్‌ను ప్రపంచం ఎలా వీక్షిస్తోంది అనే అంశంపైన దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైంది. 

మద్దతుగా వచ్చిన దేశాలెన్ని?
రెండు దేశాల మధ్య ఘర్షణలు మొదలై రెండు రోజులయ్యాయో లేదో మే 9న మనం దౌత్యపరమైన మొదటి దిగ్భ్రాంతిని చవిచూడ వలసి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 200 కోట్ల డాలర్ల రుణాన్ని పాక్‌కు అందించడానికి అనుకూలంగా ఓటు వేసింది. ఒక్క భారత్‌ మినహా, జీ–7 దేశాలతో సహా బోర్డులోని మిగిలిన సభ్య దేశాలన్నీ పాక్‌ ఊపిరిపీల్చుకునేందుకు ఊతమి చ్చాయి. ఐఎంఎఫ్‌ బాటలో, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా పాక్‌కు అప్పులిచ్చేందుకు ముందుకొచ్చాయి. 

ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దీనికి సంబంధించి ఓ డజను ప్రకటనలు చేశారు. దాడి, ప్రతిదాడులు చేసుకుంటున్న పొరుగు దేశాలతో కాల్పుల విరమణ ప్రకటింపజేసిన ఘనత తనదే నని ఆయన మొదట చాటుకున్నారు. కాల్పుల విరమణకు, అమె రికాకు ఎలాంటి సంబంధమూ లేదని భారత్‌ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఆ రకమైన మాటలు ఆపలేదు. 

భారత్‌ –పాక్‌లను ఒకే గాటన కడుతూ, రెండూ అమెరికాకి మిత్ర దేశాలనీ, ఎందుకంటే, అవి అణ్వాయుధ దేశాలనీ ఆయన అన్నారు. భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తకుండా నివారించేందుకు అవి పరస్పరం వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, అమెరికాతో కూడా వ్యాపారం చేయాలని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.
 
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించిన దేశాలు చాలా ఉన్నప్పటికీ, కేవలం రెండు –ఇజ్రాయెల్, అఫ్గానిస్తాన్‌ మాత్రమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదిగా పాక్‌ను పేరెత్తి ప్రకటించాయి. చైనా కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో ఒక త్రైపాక్షిక సమావేశం నిర్వహించి ఆ రెండింటి మధ్య రాజీ కుదిర్ఛింది. దాంతో, ప్రస్తుతం నిస్సహాయులపై జాతిసంహారం సాగిస్తున్నట్లు నిందపడుతున్న ఇజ్రాయెల్‌ ఒక్కటే, భారత్‌కు అండగా నిలిచి నట్లవుతోంది. 

రష్యా కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడింది. పహల్‌గామ్‌ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, భారత్‌  ‘భాగ స్వాములను కోరుకుంటోంది కానీ, బోధకులను కాదు’ అని యూరో పియన్‌ యూనియన్‌ను విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత ఎవరూ నీతులు పలికే యత్నం చేయని మాట నిజమేకానీ, భాగస్వాములవుతామన్న దేశాలు కొద్దిగానే ఉన్నాయి.

మనకెందుకు మద్దతు రాలేదు?
పాకిస్తాన్‌ అసలు రూపాన్ని అంగీకరించడంలో, దాన్ని నిల దీయడంలో, ‘అంతర్జాతీయ సమాజం’గా మనం భావిస్తున్నది
ఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు? పాకిస్తాన్‌ దుశ్చర్యలను చిత్తశుద్ధితో ఎందుకు ఖండించడం లేదు? కనీసం, భారతదేశానికి మరింత హృదయపూర్వకంగానైనా సంఘీభావం వ్యక్తపరచడం లేదు ఎందుకని? భారత రాయబారులు చేయవలసిన పనిని నిర్వర్తించేందుకు వివిధ పార్టీల పార్లమెంట్‌ సభ్యులతో ప్రతినిధి బృందాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపవలసిన అవసరం ఎందుకొచ్చింది?

గతంలో ఇలాంటి స్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. మఫ్టీ దుస్తు లలో వచ్చిన పాక్‌ సైనికులను కార్గిల్‌ నుంచి 1999లో తరిమి కొట్టినప్పుడు... అంతర్జాతీయ సమాజం భారత్‌ సరసన నిలిచింది. నియంత్రణ రేఖనే సరిహద్దుగా అంగీకరిస్తున్న సిమ్లా ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తలూపిన తర్వాత, కశ్మీర్‌ హోదాపై ప్రపంచ అభిప్రాయంలోనూ మార్పు వచ్చింది. క్లింటన్‌ అప్పట్లో భారత్‌లో ఐదు రోజులు పర్యటించి పాకిస్తాన్‌లో ఐదు గంటలు మాత్రమే గడిపారు. భారత్‌ను ప్రశంసించి, పాక్‌ను మందలించారు. 

ముంబయిపై ఉగ్రదాడి సందర్భంలో, 2008 నవంబర్‌లో కూడా మొత్తం ప్రపంచం భారత్‌కు బాసటగా నిలిచింది. ఆ రెండు ఉదంతాలలోనూ పాక్‌ పాత్ర తేటతెల్లం కావడంతో అది తలదించు కోవలసి వచ్చింది. భారత్‌ ప్రకటనలకు ప్రపంచం సముచిత గౌరవం ఇవ్వడం కూడా దానిలో అంతే సమానమైన పాత్ర వహించింది. 

అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల ప్రకట నలను అన్ని ప్రధాన దేశాలూ గౌరవ ప్రపత్తులతో చూశాయి. మన వైఖరి గురించి వివరణ ఇచ్చుకుంటూ, 50 మంది పార్లమెంటేరి యన్లను ప్రపంచం నలుమూలలకు పంపడం ద్వారా ప్రజాధనాన్ని ఇప్పటిలా వృథా చేయవలసిన అవసరం కూడా లేకపోయింది.

వృత్తిపరమైన దౌత్యవేత్తలే ఆ బాధ్యతను నిర్వహించారు. పహల్‌గామ్‌ దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదుల జాతీయ తను గుర్తించడంలో, పాక్‌ అపరాధాన్ని స్పష్టంగా నిరూపించడంలో కేంద్రం విఫలమైంది. అది ఈసారి భారత్‌ దౌత్య సామర్థ్యాన్ని వికలం చేసింది. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ వాదనను బలహీన పరచడంలో భారత అంతర్గత రాజకీయాలు పాత్ర పోషించలేదు కదా అని ప్రపంచంలోని అనేక దేశాలు విస్తుపోతున్నాయి. 

భారత్‌ లౌకిక, ప్రజాస్వామిక దేశంగానూ, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలుగానూ పరిగణన పొందాయి. వర్తమానానికొస్తే, భారత్‌ కేసు బలహీన పడింది. అంత ర్జాతీయ అభిప్రాయంలోనూ సానుభూతి సన్న గిల్లింది. 

మున్ముందు జరగవలసింది!
శత్రుదేశాన్ని ఆచితూచి అంచనా వేయడం జాతీయ భద్రత, విదేశీ విధాన నిర్వహణ కర్తల మొదటి లక్ష్యం కావాలి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీలయ్యే విధంగా వివిధ స్థాయులలో సంబంధాలు కొనసాగేటట్లు చూసుకోవాలి. 

పాకిస్తాన్‌తో అన్ని దౌత్య పరమైన, వ్యాపార, పౌర సమాజ మార్గాలను మూసివేయడ ద్వారా... పొరుగు దేశం గురించి సమ తూకంతో కూడిన మదింపు చేయడానికున్న మార్గాలను, సరిహద్దుకు ఆవల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికున్న అవకాశాన్ని చేజార్చుకున్నట్లయింది. 

రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగిందనడంలో సందేహం లేదుగానీ, పాకిస్తాన్‌ను మరీ పనికిరానిదిగా చూడటం కూడా సరికాదు. దానికి చెప్పుకోతగినంత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక, వ్యావసాయిక పునాదులున్నాయి. దానికి ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలున్నాయి. సమర్థత కలిగిన సైన్యం ఉంది. పాక్‌ తన భౌతిక శక్తితోపాటు, ఉన్నత వర్గీయుల ‘సాఫ్ట్‌ పవర్‌’ను కూడా వినియోగించుకుంటోంది. 

భూస్వామ్య పెత్తందారీ విధానం, అసమానతలు అధికంగా ఉన్న సమాజంలో, పాశ్చాత్య మధ్యవర్తులతో సమానమైన వర్గంగా, ఆత్మవిశ్వాసంతో మెలిగేలా పాక్‌ తన ఉన్నత వర్గాన్ని తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. భారతదేశపు రాజకీయాలను, దౌత్యాన్ని ప్రభావితం చేస్తున్న మధ్య తరగతి దానికి దీటు కాదు.

సంజయ బారు 
వ్యాసకర్త సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌ ఫౌండర్‌–ట్రస్టీ,మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement