
యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా స్నాతకోత్స వంలో నటుడు, క్యాలిఫోర్నియా (మాజీ) గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ గతంలో చేసిన ప్రసంగానికి సంక్షిప్త పాఠం:
విశ్వగురు
యూనివర్సిటీ నుంచి మీరు బయటకు అడుగుపెట్టబోతు న్నారు. జీవితంలో కొన్ని అవరోధాలు, వైఫల్యాలు, అసంతృప్తులు ఎదురవడం సహజం. వాటిని తట్టుకుంటూ ముందుకు సాగడంలో, విజయాన్ని అందుకోవడంలో మీకు సహాయపడగలిగినవి, నాకు తోచిన జీవిత పాఠాలు కొన్ని చెబుతాను.
మీపై మీరు నమ్మకం ఉంచండి
టెలివిజన్, టెలిఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్లు లేని రోజుల్లో పెరిగి పెద్దవాడినవటం వల్ల నేనొక రకంగా అదృష్టవంతుడినే. నాతో నేను ఎక్కువ సమయం గడపగలిగే వాడిని. దేన్ని నేను నిజంగా ఇష్టపడుతున్నానో నిర్ణయించుకోగలిగే వాడిని. అలా ఆస్ట్రియాలోని మా కుగ్రామం నుంచి – బాడీబిల్డింగ్ ఛాంపియన్ అవడం ద్వారా అమెరికాలో కాలుమోపాలని అనుకున్నా. నేను ఆరాధించే ‘మిస్టర్ యూనివర్స్’... రెగ్ పార్క్’. ఆయనలా బాడీబిల్డింగ్ చాంపియన్ అనిపించుకోవడం, సినిమాల్లో ప్రవేశించడం, కోట్లాది డాలర్లు సంపాదించడం నా లక్ష్యం. మిగిలినవారు ఏమనుకుంటున్నా పట్టించుకోకుండా, నా మీద నమ్మకంతో నేను ఏర్పరచుకున్న లక్ష్యం అది.
సూత్రాలను పక్కన పెట్టండి!
మా ఆవిడ వేసుకొనే ఒక టీషర్ట్‌పై ‘నియమానుసారంగా నడ చుకొనే మహిళలు చరిత్రను సృష్టించటం అరుదు’ అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ అది వర్తిస్తుంది. మరీ సూత్రానుసారంగా ఉంటే, మీ లక్ష్య సాధనకు ‘పిచ్చి పట్టినట్లుగా’ ప్రయత్నించలేరు. నాకు ఎక్కడైనా ఏదైనా లభించిందీ అంటే, అది ఈ సూత్రాలలో కొన్నింటిని పక్కన పెట్టినందువల్లనే సాధ్యమైంది. బాడీబిల్డింగ్‌కు శ్రమించినట్లుగానే, సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డాను.అందుకోసం ఇంగ్లీషు క్లాసులకు వెళ్లాను. ఫలితం దక్కింది. మొదట టెలివిజన్‌లో, తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. విజయవంతమైన నటుడిని అయ్యాను. తర్వాత గవర్నర్‌ని కూడా అయ్యాను.
వైఫల్యానికి భయపడకండి!
నేను ఏది ప్రయత్నించినపుడైనా, విఫలమవడానికి కూడా సుముఖంగా ఉండేవాడిని. ‘రెడ్ సోంజా’, ‘హెర్క్యులిస్ ఇన్ న్యూయార్క్’, ‘లాస్ట్ యాక్షన్ హీరో’ వంటి నా సినిమాలు కొన్ని బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ‘టెర్మినేటర్’, ‘క్యానన్’, ట్రూ లైస్’, ‘ప్రిడేటర్’, ‘ట్విన్స్’ వంటి చిత్రాలు ఊహించనంత విజయం సాధించాయి. కనుక, మనం అన్నిసార్లూ సఫలం కాలేకపోవచ్చు. కానీ, నిర్ణయాలు తీసుకునేందుకు భయపడకూడదు. విఫలమవు తామనే భయంతో నిర్వీర్యం కాకూడదు. మీపై మీకు నమ్మకం ఉంది కనుక, ఏది చేస్తున్నారో అదే సరైన పని అనిపించుకుంటుందని భావిస్తున్నారు కనుక ధైర్యంగా ముందుకు సాగండి.
మాటలకు ప్రభావితం కాకండి!
మా అత్తగారు యూనస్ కెనడీ ష్రైవర్ 1968లో స్పెషల్ ఒలింపిక్స్‌కు శ్రీకారం చుట్టినపుడు చాలామంది ఆమెను నివారించే ప్రయత్నం చేశారు. అదెలా సాధ్యపడుతుంది అన్నారు. ‘‘కుదరని పని. సంస్థల నుంచి పోటీదారులను బయటకు తీసుకురావడం కష్టం. వారు జంపింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడల్లో పాల్గొనేటట్లు మీరు చేయలేరు. ఒకవేళ పాల్గొన్నా, వారు గాయపడవచ్చు. ఒకరి నొకరు గాయపరచుకోవచ్చు. ఈతకొలనులో మునిగిపోతారు’’ అని నిరుత్సాహపరచారు. 40 ఏళ్ల తర్వాత, గొప్ప సంస్థలలో స్పెషల్ ఒలింపిక్స్ ఒకటిగా ఉంది. ఈరోజు మానసిక వైకల్యంతో బాధపడు తున్నవారికి 164 దేశాలలో అంకిత భావంతో పని చేస్తోంది. జనం మాటలకు ఆమె నీరుగారిపోయి తన ప్రయత్నం ఆపేసి ఉంటే, ఇది సాధ్యమయ్యేదా? అంతరాత్మ ‘‘నీకు సాధ్యమే’’ అని చెబుతుంటే ఇక ఎవరి మాటా వినకండి!
శ్రమిస్తేనే విజేతలు కాగలరు!
తగినంత కృషి చేయకుండానే విఫలం అవకూడదు. అంటే, ప్రయత్న లోపం ఉండకూడదన్నది నా ఉద్దేశం. గట్టిగా ప్రయత్నించిన తర్వాత విఫలమైనా ఫరవాలేదు. అంతేకానీ, కష్టపడి సాధన చేయకుండా, పోటీలో లేదా ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని నేను ఇష్ట పడను. లక్ష్య సాధనకు సర్వశక్తులూ ఒడ్డాలన్నదే నా అభిమతం. మధ్య మధ్యలో విరామం తీసుకోవడం కూడా ముఖ్యమే. కాదనను. కానీ, మనం సేదదీరుతున్న సమయంలో మరెవరో శ్రమించి పని చేస్తూ ఉంటారని గుర్తుంచుకోవాలి. వారూ విజేతలుగా నిలవొచ్చు. అంతమాత్రాన, ఏదో చేజారిపోయింది అని మనం అనుకోకూడదు. రోజుకు 6 గంటలు నిద్రిస్తే చాలు. మిగిలిన 18 గంటలూ పనిచేస్తూ ఉండాలి. సమయాన్ని సమర్థంగా నిర్వహించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలి. ఆకాంక్షలను నెరవేర్చుకు నేందుకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి.
చురుగ్గా చేజిక్కించుకోవాలి
రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని నిచ్చెన ఎక్కగలం అని మాత్రం అనుకోకండి. కార్యాచరణకు దిగకుండా ‘విజయానికి సూత్రాల’ను నెమరువేయడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ, అవకాశాలను చేజిక్కించు కోవాలి. కలలను సాకారం చేసుకునేందుకు సోమరితనం వదిలించుకుని, చురుకుగా పనిచేయాలి. ఇవన్నీ మీకు తెలియనివి ఏమీ కావు. శ్రద్ధాసక్తులతో చదువుకోకపోతే మీరీ రోజు ఇక్కడ కూర్చో గలిగేవారే కాదు. ఇక మీరు ఏ రంగంలో ఉన్నా సరే, సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధపడాలి.
అందుకు తగిన వ్యవధిని చిక్కించుకోవాలి. సమాజానికి, మీ రాష్ట్రానికి, లేదా మీ దేశానికి తిరిగి ఇవ్వడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. మా మామగారు సార్జంట్ ష్రైవర్ గొప్ప అమెరికన్. ఆయన పేదలకు న్యాయ సహాయం లాంటి పనులు నిర్వహించారు. ‘‘అదే పనిగా అద్దంలో మీ ముఖం మీరే చూసుకోకండి. కాసేపు అద్దాన్ని పక్కన పెట్టండి. అప్పుడే చేయూత అవసరమైన లక్షలాది మందిని మీరు మీ చుట్టుపక్కల చూడ గలుగు తారు’’ అని ఆయన ఒకసారి యేల్ పట్టభద్రుల స్నాతకోత్సవంలో చెప్పారు. ఇతరులకు సహాయపడడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదని మాత్రం నేను మీకు చెప్పగలను.
ఎన్నింటిని దాటుకుని వచ్చాం!
చివరగా ఇంకొక్క సంగతి చెబుతా! ఈ విశ్వవిద్యాలయాన్ని 1880లో నెలకొల్పారు. అప్పట్లో లాస్ ఏంజలెస్ చిన్న పొలిమేర పట్టణం. మీకన్నా ముందు 125 పట్టభద్రుల బృందాలు తయారై ఉంటాయి. వారు మంచి రోజులను, గడ్డు రోజులను, యుద్ధాలను, శాంతియుత పరిస్థితులను, ఆశలు రేకెత్తించిన కాలాన్ని, మహా అస్థి రమైన కాలాన్ని కూడా చూసి ఉంటారు. వాటన్నింటినీ దాటుకుని ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ యూనివర్సిటీ దృఢంగా నిలిచాయి.
ఇపుడు మనం తిరిగి గడ్డు రోజులను, ప్రపంచంలో చాలా అస్థిరతను చూస్తున్నాం. ఒకటి మాత్రం ఖాయం. మనం వాటిని తట్టుకుని నిలబడగలం. మునుపటికన్నా పటిష్ఠంగా, సంపన్నమైనదిగా దేశం పునరుత్తేజం పొందుతుంది. ఆశావాదాన్నీ, పోరాట స్ఫూర్తినీ కోల్పో వద్దు. మీ అందరికీ అభినందనలు. ఆ కరుణామయుడి చల్లని చూపులు మీపై ప్రసరించాలి.