
ఎల్.కె. అద్వానీ పాక్ పర్యటన (2005)
కామెంట్
నిజాయతీపరుడైన, ఉన్నతమైన భారతీయుడు ఎవరూ పాకిస్తాన్‌ను సొంత ఇంటిగా భావించడం ఇక ఎంత మాత్రం అంగీకార యోగ్యమైన విషయం కాదా? మనలో కోట్లాది మంది నేడు పాకిస్తాన్‌గా భావిస్తున్న రాష్ట్రాలలో పుట్టినవాళ్లమే. ఆ రోజుల్లో, మాకు తెలిసిన సొంత ప్రాంతం అదే. నా తల్లితండ్రులు, సోదరీమణులు, నా దగ్గరి బంధువులలో చాలా మంది అక్కడే జన్మించారు. మా అమ్మ తొంభై ఏళ్ల వయసులో సొంతూరు వెళ్లాలని కోరుకున్నప్పుడు లాహోర్ పేరు చెప్పింది కానీ, జీవించిన ఛతర్‌పుర్ కాదు. ఛతర్‌పుర్‌లో పొలాలు గట్రా ఉన్నా ఆమెకు ఠక్కున లాహోర్ గుర్తుకొచ్చింది.
పిట్రోడా మాటలపై వివాదం
పాకిస్తాన్‌లో ఉండగా తనకు సొంత ఇంటిలోనే ఉన్నట్లు అని పించిందని శామ్ పిట్రోడా ఇటీవల మనసులో మాట చెప్పేసి నప్పుడు, పిట్రోడాకు దేశభక్తి లేదంటూ ఎన్డీటీవీ ఆయనపై విమర్శ లతో ఊదరగొట్టేసింది. ‘‘నేను ఈమధ్య పాకిస్తాన్ వెళ్లొచ్చాను. నాకు అక్కడ నా సొంత ప్రాంతంలో ఉన్నట్లు అనిపించిందని నేను మీకు చెప్పి తీరాలి’’ అని ఆయన అన్నారు. ‘‘నేను బంగ్లాదేశ్ వెళ్లాను. నేపాల్ కూడా వెళ్లొచ్చాను. రెండు చోట్లా సొంత ప్రదేశంలో ఉన్నట్లే అనిపించింది’’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఆ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఇరవై ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్‌లో పదిహేను నిమిషాలకు పైగా సమయాన్ని హానికరం కాని, భంగ కరంకాని ఆ వ్యాఖ్యను తూర్పారబట్టడానికే కేటాయించారు. బి.జె.పి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆయనను పరుషమైన పదజాలంతో నిందించారు. నేపాల్, బంగ్లాదేశ్‌లలో కూడా సొంతూ రులో ఉన్నట్లుగానే ఉందన్న శామ్ పిట్రోడా మాటలను పూనావాలా సమయానుకూలంగా విస్మరించారు.
మనసులను తాకిన అద్వానీ
వాస్తవం ఏమిటంటే, ఎల్.కె. అద్వానీ సొంత ప్రాంతం కూడా పాకిస్తానే! ఆయన పుట్టింది, చదువుకుంది కరాచీలోనే! పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా 2005లో ఖుర్షీద్ కసూరీ ఉన్నపుడు పాకిస్తాన్ సందర్శనకు రావాల్సిందిగా అద్వానీని ఆహ్వానించారు. అద్వానీకి
ఆ ఆహ్వానం సంగతి చెప్పి, ఆయన స్పందన ఏమిటో తెలుసుకుని చెప్పవలసిందిగా నన్ను కోరారు. ‘‘దానిదేముంది? సంతోషంగా వెళ్లి రావచ్చు. నాకు నా కుటుంబ సభ్యులను కూడా వెంట బెట్టుకుని వెళ్లాలని ఉంది’’ అని అద్వానీ అన్నారు.
అలాగే, అద్వానీ వెంట ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. పాకిస్తాన్‌కు బయలు దేరేటపుడు అద్వానీ చేసిన ప్రకటన, తాను జరపబోయే ఆ పర్యటన తనకు ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా వెల్లడించింది. ‘‘వ్యక్తిగత స్థాయిలో ఈ పర్యటన నాకు ప్రగాఢమైన ప్రాధాన్యం కలిగినది. కరాచీలో పుట్టి పెరిగినవాడిని కనుక, ఈ సందర్శన, నాకు మూలా లకు తిరిగి వెళ్లటం లాంటిది. ఈ రెండు దేశాలు సుస్థిరమైన శాంతితో సాగే మార్గాన్ని ఆ పరమాత్మ చూపాలని నేను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
అయితే, లాహోర్‌లో అద్వానీ అన్న మాటలను నేను ఎన్నటికీ మరచిపోను. ‘‘ప్రతి భారతీ యుడి మనసులో కొద్దిపాటి పాకిస్తాన్, ప్రతి పాకిస్తానీ హృదయంలో కొద్దిపాటి ఇండియా ఉంటాయని నేను ఎప్పుడూ విశ్వసి స్తాను’’ అని ఆయన అన్నారు. అది మనసును తాకే వాస్తవం. ముఖ్యంగా పంజాబీలు, బెంగాలీలకు సంబంధించినంత వరకు కాదనలేనిది. ఈరోజుల్లో అయితే, ఎన్డీటీవీ, అద్వానీని కూడా ఏకి పారేసి ఉండేది. దాని జాతీయతావాద చెవులకు ఆ మాటలు దేశ ద్రోహంతో సమానంలా అనిపించేవి. అదృష్టవశాత్తూ, ప్రణయ్ రాయ్ ఆధ్వర్యంలో 2006లో అది చాలా భిన్నమైన ఛానల్‌లా ఉండేది.
ఒకేలా అనిపించటం సహజమే!
నా సంగతి కూడా చెప్పనివ్వండి. నేను 1980లో మొదటిసారి పాకిస్తాన్ సందర్శించాను. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లివచ్చాను. వెళ్లిన ప్రతిసారీ నాకు పూర్తిగా సొంత ఇంటిలోనే ఉన్నట్లే అని పించింది. వారి పంజాబ్‌లో భాష, ఆహారం, సంప్రదాయాలు, ఆచారాలు, ఇళ్లు, ప్రజా జీవనవిధానానికి మనకు తేడా ఏమీ లేదు. రెండింటినీ వేరు చేసి చూడలేం. అవే రకమైన మాటలతో శపిస్తాం లేదా అక్కున చేర్చుకుంటాం. అదే వైచిత్రి.
తమిళులు, మలయాళీలు లేదా కన్నడిగులు సగటు పాకిస్తానీయులకు అపరిచితులుగా కని
పించవచ్చు. ఢిల్లీ, శ్రీనగర్‌లలో ఉన్నవారు కూడా అలానే అనిపించ వచ్చు. కానీ, అమృత్‌సర్, లూధియానాలలో ఉన్నవారు మాత్రం కాదు. పాకిస్తాన్ గురించి భారతీయుల తలపులు కూడా కొంత వరకు అదే రకంగా ఉంటాయని చెప్పవచ్చు. వారు మన దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. ఇటానగర్‌లో ఉండేవారికి కనిపించే సారూప్యం చాలా తక్కువ. అలీగఢ్‌లో ఉండేవారికి పెద్దగా తేడా ఏమీ ఉండదు.
అర్థం చేసుకోవచ్చు... కానీ!
ఇటీవల దుబాయ్‌లో భారతీయ క్రికెట్ జట్టు ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా, క్రీడా స్ఫూర్తి కొరవడినదిగా కనిపించింది. ముఖ్యంగా నన్ను వేదనకు గురి చేసింది. పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేసేందుకు వారు తిరస్కరించడం క్రికెట్ అనిపించుకోదు. కరచాలనం అనే బ్రిటిష్ పదబంధానికి అర్థం ఏమైనా ఉందీ అంటే, తప్పకుండా దానిలోకి, రీతి రివాజులకు సంబంధించిన తేలికపాటి మర్యాదలు, సత్ప్రవర్తన కూడా రాకుండా ఉంటాయా? తప్పక పాటించవలసిన చక్కని నడవడికను పక్కన పెట్టాలని భారత జట్టు తీసుకున్న నిర్ణయంతో మన విజేతలు చిన్నవాళ్లుగా కనిపించారు.
పహల్గావ్‌ు ఉగ్రదాడి అనంతరం పాకి స్తాన్‌తో ఆడకూడదని కోరుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. మైదానంలో అవతలి జట్టు ఎదురుగా నిలవడం ఇష్టం లేక ఒక ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి భారత్ తిరస్కరించడం ఇది మొదటిసారేమీ కాదు. దక్షిణాఫ్రికాతో ఆడడం ఇష్టం లేక 1974లో డేవిస్ కప్‌లో ఏకంగా ఫైనల్స్‌నే త్యజించడం ఇందుకు కలకాలం గుర్తుండే ఉదాహరణ. కానీ, ఒకసారి ఆడడానికి అంగీకరించిన తర్వాత, ప్రత్యర్థులతో కరచాలనం చేయడం ఆచారమే కాదు, నాగరికత అని కూడా అనిపించుకుంటుంది.
మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెబుతున్నా, ఆ అంశంపై ఎవరూ దృష్టి సారించకపోవడం నన్ను ఆశ్చర్యపరచింది. అలాగే, పాక్‌లో ఉన్నపుడు సొంత ఇంటిలోనే ఉన్నట్లుగా అనిపించిందని శామ్ పిట్రోడా అన్నందుకు, ఆయనని ఏకిపారేయడం కూడా నన్ను అంతే ఆశ్చర్యపరచింది. నిజం చెప్పాలంటే, నా దేశస్థుల గురించి నేను తెలుసుకుంటున్న కొద్దీ నాలో ఆశ్చర్యం పాలు ఎక్కువ అవుతోంది!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్