
నాగపూర్ పోలీసులు ఒక ఆశ్చర్యకరమైన పని చేశారు. ఒక సభలో పాడిన పాట ఆధారంగా సభా నిర్వాహకుల మీద ‘రాజద్రోహ నేరం’ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు మూడు సంవ త్సరాల కింద 2022 మే 11న అప్పటికి ఉండిన భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్)లో సెక్షన్ 124-ఎ ‘రాజద్రోహ నేరం’ ఔచిత్యాన్ని విచారిస్తూ, దాన్ని పునస్సమీక్షించే వరకూ, ఆ ఆరోపణ మీద విచారణలు ఆపేయాలని, కొత్త కేసులు నమోదు చేయగూడదని మధ్యంతర ఆదేశం ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం ఐపీసీని రద్దు చేస్తూ తీసుకు వచ్చిన భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లో ‘రాజద్రోహం’ అనే మాట వాడలేదు గాని, మిగిలి నదంతా సెక్షన్ 152లో యథాతథంగా ఉంచారు. ఇప్పుడు నాగపూర్ పోలీసులు ఆ బీఎన్‌ఎస్ సెక్షన్ 152తో పాటు, సెక్షన్ 196 (సమూహాల మధ్య శత్రుత్వం పెంచడం), సెక్షన్ 353 (ప్రజల మనో భావాలను గాయపరిచే ప్రకటనలు చేయడం) అనే నేరారోపణలతో కేసు పెట్టారు.
ఇంతకీ ఆ సభ ‘వీరా సాథీదార్ (vira sathidar) స్మృతి సమ న్వయ్ సమితి’ అనే బృందం మే 13న నాగపూర్ లోని ‘విదర్భ సాహిత్య సంఘ్’ హాలులో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ. వీరా సాథీదార్ (1958– 2021) సుప్రసిద్ధ మరాఠీ కవి, నటుడు, రచయిత, పత్రికా సంపాదకుడు, దళిత హక్కుల కార్యకర్త. అంబేడ్కర్, మార్క్స్‌ల భావాలతో ప్రభావితుడైన వీరా కులవివక్షకూ, సామాజిక అన్యాయాలకూ వ్యతిరేకంగా అపారమైన కృషి చేశారు. ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్’ అసోసియేషన్ కన్వీనర్‌గా ఉన్నారు. మరాఠీ మాసపత్రిక ‘విద్రోహి’ సంపాదకు లుగా ఉన్నారు. ‘కోర్ట్’ అనే 2014 నాటి మరాఠీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. అది ఉత్తమ సిని మాగా జాతీయ అవార్డు అందుకుంది. కోవిడ్ రెండో దశలో 2021 ఏప్రిల్ 13న మరణించారు. నాలుగేళ్లుగా ఆయన సహచరి పుష్పా సాథీదార్, ఇతర మిత్రులు సంస్మరణ సభలు నిర్వ హిస్తున్నారు. ఈ సంవత్సరం సంస్మరణ సభలో సామాజిక కార్యకర్త ఉత్తమ్ జాగీర్దార్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘ప్రజా భద్రతా బిల్లు’ గురించి ప్రధాన ఉపన్యాసం చేశారు. ముంబయికి చెందిన సమతా కళా మంచ్ గాయ కులు పాటలు పాడారు. ఆ పాటల్లో ఒకటి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దేఖేంగే’ అనే సుప్రసిద్ధ గీతం.
‘మన సైనికులు పాక్‌తో వీరోచితంగా పోరాడి ఓడిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఒక వామపక్ష కళాబృందం పాక్ కవి పాటలు పాడుతున్నది. ఆ పాటలో సింహాసనాలను వణికించాలి అని ఉంది. వాళ్లు ఇది ఫాసిస్టు ప్రభుత్వం అంటున్నారు. ఈ సభ, ఉపన్యాసం, పాట దేశ సమగ్రతకు, భద్రతకు, సార్వభౌమత్వానికి వ్యతిరేకం. కనుక నిర్వాహకు రాలు పుష్పా సాథీదార్ మీద కేసు పెట్టి విచారించండి’ అని నాగపూర్ ‘జనసంఘర్ష సమితి’ అధ్యక్షుడు దత్తాత్రేయ షిర్కే చేసిన ఫిర్యాదు మీద పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇందులో రెండు విచిత్రమైన విషయాలున్నాయి. ఒకటి-ఫైజ్ అహ్మద్ ఫైజ్ (faiz ahmed faiz)ను, ఆ మాటకొస్తే ఏ కవినైనా ఒక దేశానికి పరిమితం చేయడానికి వీలు లేదు. ఫైజ్ 1911లో అవిభక్త భారత్‌లో పంజాబ్‌లో పుట్టిన కవి. 1947 దేశ విభ జన తర్వాత ఇంగ్లిష్ దినపత్రిక ‘పాకిస్తాన్ టైమ్స్’కూ, ఉర్దూ దినపత్రిక ‘ఇమ్రోజ్’కూ ప్రధాన సంపాదకుడిగా పాకిస్తాన్‌కు వెళ్లారు. పాకి స్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుల్లో ఒకరయ్యారు. లియాఖత్ అలీఖాన్ ప్రభుత్వం 1951లోనే ఆయ నను రావల్పిండి కుట్ర కేసు నిందితుడిగా అరెస్టు చేసి నాలుగేళ్లు జైల్లో పెట్టింది. తర్వాత ఆయన మధ్య పాకిస్తాన్ వస్తూపోతూ ఉన్నప్పటికీ జీవితంలో ఎక్కువ భాగం మాస్కోలో, లండన్‌లో, బీరుట్‌లో గడిచింది. 1984లో మరణించే లోపు, మొత్తం 73 ఏళ్ల జీవితంలో ఆయన పాకిస్తాన్‌లో గడిపినది పదిహేనేళ్ల లోపే. ఆయనను పాకిస్తాన్ కవి అనడం హాస్యా స్పదం.
రెండు-హమ్ దేఖేంగే కవితను ఫైజ్ పాకిస్తాన్‌లో సైనిక నియంత జియా ఉల్ హక్‌కు వ్యతిరేకంగా 1979లో రాశారు. ఫైజ్ చనిపోయాక కూడా పాకిస్తాన్‌లో ఆయన పేరు ఎత్తడానికి వీలు లేదని జియా ఉల్ హక్ ఆదేశించగా, 1986లో లాహోర్‌లో ఒక బహిరంగ వేదిక మీద ఈ పాట పాడి పాకిస్తానీ గాయని ఇక్బాల్ బానో సంచలనం సృష్టించారు. మరొక పాకిస్తాన్ సైనిక నియంత పర్వేజ్ ముషర్రఫ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో కూడా ఇది మార్మోగింది. అలా మౌలికంగా పాకిస్తాన్ నియంతలకు వ్యతిరేక ప్రతీక అయిన పాటను చూసి భారత పాల కులు ఉలిక్కిపడడం ఆశ్చర్యకరం.
అయితే ఈ ఉలికిపాటు, అసహనం, అభూత కల్పనల నేరారోపణలు, సుప్రీంకోర్టు కొట్టివేసిన నేరారోపణలు ఒకచోట ఆగిపోవడం లేదు, విస్తరి స్తున్నాయి. అశోకా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి, ప్రపంచ ప్రఖ్యాత కవి, చరిత్ర కారుడు అలీఖాన్ మహమూదాబాద్‌ను మే 18న రాజద్రోహ నేరారోపణలతో అరెస్టు చేశారు. ఆ అరె స్టుకు కారణం ఆయన ఫేస్‌బుక్ మీద రాసిన ఒక పోస్టు. అలాగే లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ యూనివ ర్సిటీ అధ్యాపకురాలు, సుప్రసిద్ధ సామాజిక శాస్త్ర వేత్త, స్వయంగా కశ్మీరీ పండిట్ నిటాషా కౌల్‌కు ‘భారత వ్యతిరేక రచనలు చేస్తున్నందుకు’ అనే ఆరో పణతో ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు రద్దుచేస్తూ నోటీసు పంపారు. భారత ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మక రచనలు చేసినందుకే ఈ చర్య. ప్రజాస్వామ్యానికి కన్నతల్లి అంటే అర్థం... భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డు కోవడమేనా?
- ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎడిటర్