జనాభా అవసరాలకు అనుగుణంగా సొంత వాహనాలు పెరిగే కొద్దీ.. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే.. ముంబై వీధుల్లో ఆ గందరగోళం ఇక పాతాళంలోకి కరిగిపోనుంది. భూమి క్రింద మరో కొత్త లోకం తెరుచుకోబోతోంది. అవును..
ముంబై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న ప్రణాళికను ప్రకటించారు. “పాతాళ్ లోక్”(Paatal Lok) పేరుతో భూగర్భ టన్నెల్ నెట్‌వర్క్‌ను నిర్మించి నగర రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఈ టన్నెల్‌లు పైభాగంలోని రహదారులకు సమాంతరంగా ఉంటూ.. మెట్రో మార్గాలతో కలుపుతూ.. ముంబైకి కొత్త రవాణా రూపకల్పనను అందించబోతునున్నట్లు తెలిపారాయన.
ఎలా సహాయపడుతుందంటే..
ముంబైలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం.. పాతాళ్ లోక్ ముఖ్య ఉద్దేశం. భూమి క్రింద రోడ్లకు సమాంతరంగా పెద్ద టన్నెల్ వ్యవస్థ నిర్మిస్తారు. ఇది భూమి క్రింద సమాంతర రహదారి వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే పైభాగంలోని ప్రధాన రహదారులకు “షాడో నెట్‌వర్క్”లా ఉంటుందన్నమాట.
డీకన్జెషన్‌తో పైభాగంలోని రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి.. ట్రాఫిక్ సాఫీగా కదులుతుంది. తద్వారా ప్రయాణికులకు ‘గంటల తరబడి’ అనే నరకయాతన తప్పనుంది. అలాగే.. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారాలు, లాజిస్టిక్స్ వేగవంతం కానుంది. అదే సమయంలో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.
ముంబై నగరం కోసం ఫడ్నవీస్ సర్కార్ అమలు చేయబోతున్న ప్రణాళికలో.. బోరివలి–గోరేగావ్ మధ్య సమాంతర రహదారి, వర్లీ–శివడి కనెక్టర్ (తదుపరి సంవత్సరం పూర్తి), బాంద్రా–BKC టన్నెల్ ( దీని ద్వారా ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ మెరుగుపరుస్తుంది). దక్షిణ ముంబై నుంచి భయందర్ వరకు విస్తరించే కోస్టల్ రోడ్ కూడా ఈ ప్రణాళికలో భాగం. అలాగే.. ఈ టన్నెల్ ప్రాజెక్ట్‌కి తోడ్పాటుగా మెట్రో విస్తరణ కూడా జరగనుంది.


