10 శాతం వరకు పెరిగే అవకాశం
జనవరి 1 నుంచి కొత్త స్టార్
రేటింగ్ నిబంధనలు
న్యూఢిల్లీ: కూలింగ్ ఉత్పత్తులైన ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10 శాతం మధ్య పెరగనున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) సవరించిన స్టార్ రేటింగ్ నిబంధనలు అమల్లోకి రానుండడంతో ఈ పరిణామం చోటుచేసుకోనుంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో సెప్టెంబర్ 22 నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 10 శాతం వరకు తగ్గగా.. ఇప్పుడు స్టార్ రేటింగ్ ప్రమాణాల కారణంగా ఆ ప్రయోజనం మొత్తం కనుమరుగు కానుంది.
మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, కాపర్ ధరలు పెరిగిన కారణంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీ సంస్థలు వ్యయ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నాయి. అయితే ఈ చర్య కర్బన ఉద్గారాల తగ్గింపునకు మేలు చేస్తుందని వోల్టాస్, డైకిన్, బ్లూస్టార్, గోద్రేజ్ అప్లయెన్సెస్ పేర్కొన్నాయి.
కరెంటు ఆదా..
సవరించిన బీఈఈ నిబంధనల కింద.. కొత్త 5 స్టార్ రేటింగ్ ఏసీలు 10 శాతం మరింద ఇంధనాన్ని ఆదా చేయనున్నాయని, అదే సమయంలో ఉత్పత్తుల ధరలు 10 శాతం పెరగనున్నాయని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. కొత్త 5 స్టార్ అన్నది ప్రస్తుత ఉత్పత్తుల కోణంలో నుంచి చూస్తే 6-7 స్టార్ ఇంధన సామర్థ్యానికి సమానంగా ఉంటుందన్నారు. ఇప్పుడున్న 5 స్టార్ ఏసీ, రిఫ్రిజిటేటర్ జనవరి 1 తర్వాత 4 స్టార్‌కు తగ్గిపోనున్నాయి. ఇలా ప్రస్తుత ప్రమాణాల ప్రకారం తయారైన ప్రతీ ఉత్పత్తికి సంబంధించి స్టార్ రేటింగ్ ఒక మెట్టు కిందకు వెళ్లిపోనుంది.
ఇంధన రేటింగ్ మార్పు కారణంగా ఏసీల ధరలు 5-7 శాతం మేర, రిఫ్రిజిరేటర్ల ధరలు 3-5 శాతం మేర పెరుగుతాయని గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. కరెన్సీ విలువ క్షీణత, కమోడిటీ ధరల పెరుగుదలతో వ్యయాల భారాన్ని కంపెనీలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. కొత్త ఇంధన ప్రమాణాలు అమల్లోకి రానుండడంతో డిమాండ్ ఊపందుకుంటుందని వోల్టాస్ సీనియర్ బిజినెస్ లీడర్ జయంత్ బలాన్ అంచనా వేశారు. ధరల పెరుగుదలకు ముందుగానే డీలర్లు, వినియోగదారులు ఆర్డర్లు పెట్టేందుకు ఆసక్తి చూపించొచ్చన్నారు.
ఇతర ఉత్పత్తులకూ కొత్త ప్రమాణాలు
ఏసీలు, రిఫ్రిజిరేట్లతోపాటు.. టెలివిజన్లు, ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లు, కూలింగ్ టవర్లు, చిల్లర్లకు సైతం కొత్త బీఈఈ స్టార్ రేటింగ్ ప్రమాణాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.


