దట్టంగా కురుస్తున్న మంచు వణికిస్తున్న చలిగాలులు
అరకు పరిసర ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
అవస్థలు పడుతున్న స్థానికులు
ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు
సందర్శకుల రాకతో భారీగా వ్యాపారం
వేల సంఖ్యలో కుటుంబాలకు ఉపాధి
మంచు.. ప్రకృతి అందాలకు వన్నెలద్దుతూ.. వేల కుటుంబాలకు జీవనోపాధి నిస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో వచ్చే ఆదాయం ఆయా కుటుంబాలకు ఏడాది పొడవునా భరోసా కల్పిస్తోంది. అల్లూరి జిల్లాలో అక్టోబర్ నుంచి జనవరి వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతుంటాయి. మంచు దట్టంగా కురుస్తూ ఉంటుంది. మంచు తెరల అందాలతో మన్యం రూపురేఖలు పూర్తిగా మారిపోతుంటాయి. ఒక్కసారైనా ఈ అందాలను తిలకించాలన్న ఆశతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఇలా వేల సంఖ్యలో రావడం వల్ల అదే స్థాయిలో వ్యాపారం జరుగుతుంది.
అరకులోయ టౌన్: అల్లూరి జిల్లా మన్యంలో ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పర్యాటకుల పెరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. మంచు ఉదయం 9 గంటల వరకు కురుస్తోంది. పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్ రిసార్టులు, అనుబంధ రంగాలు, పర్యాటక శాఖకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. కేవలం ఇదంతా మంచుపైనే ఆధార పడి ఉందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. పర్యాటకులు మాత్రం పక్రృతి ఒడిలో అద్భుత అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సందర్శకుల్లో ఎక్కువ శాతం లాడ్జీలు, రిసార్టుల్లో కాకుండా క్యాంపెయిన్ టెంట్లలో బస చేస్తుండటంతో ఎంతోమందికి ఉపాధి నిస్తోంది.
అదనపు అందాలు
ఈ ప్రాంతంలో గిరిరైతులు పండించే వలిసె, పొద్దు తిరుగుడు పూలు మంచు సొగసుకు అదనపు అందాలు అద్దుతున్నాయి. పొగమంచులో అబ్బురపరుస్తున్న సోయగాల మధ్య ఫొటోలు తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. క్యాంపెయిన్ టెంట్ల వద్ద ఫైర్ క్యాంప్‌లకు కట్టెలు కొనుగోలు చేయడం వల్ల రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. కబాబ్, చికెన్, బాంబు బిర్యానీ అమ్మకాలు భారీగా జరగడం వల్ల వందల కుటుంబాలు ఉపాధి పొందు
తున్నాయి.
కనిష్ట ఉష్ణోగ్రతలిలా..
పర్యాటక కేంద్రం అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 9గంటల వరకు మంచు దట్టంగా కురుస్తుండటంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ 14 నుంచి సింగిల్ డిజిట్ నమోదు అవుతున్నాయి. 14న 7.3, 15న 7.0, 16న 7.4, 17న 6.7, 18న 7.6, 19న 8.3, 26న 8.6, 27న 8.5, 28న 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఉన్నికి చాటుకుంటూ..
ముంచంగిపుట్టు: జిల్లాలో చలితీవ్రత పెరగడంతో మన్యంవాసులు రక్షణ పొందేందుకు రగ్గులు, స్వెట్టర్లు, శాలువాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మండలంలో ముంచంగిపుట్టు, జోలాపుట్టు, లక్ష్మీపురం, భూసిపుట్టు, బంగారుమెట్ట వారపు సంతల్లో వ్యాపారం భారీగా జరుగుతున్నాయి. వీటి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నందున కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల స్వెట్టర్లు రూ.250 నుంచి రూ.600, పెద్దలకు రూ. 400 నుంచి రూ.1500, శాలువాలు రూ.100 నుంచి 500, స్కార్ప్‌లు రూ.50 నుంచి రూ.150, మంకీ క్యాప్‌లు రూ.100 నుంచి 200, బ్లాంకెట్‌లు రూ.300 నుంచి రూ.500 ,గ్లౌజులు రూ.100 నుంచి రూ.150, రగ్గులు రూ.600 నుంచి రూ.3వేల ధరకు అమ్ముతున్నారు. వారపు సంతల్లో వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. చలినుంచి రక్షణ ఇచ్చే దుస్తులు ఆకర్షణీయమైన రంగులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
తక్కువ ధరలు
సంతల్లో అమ్ముతున్న స్వెట్టర్లు, జర్కెన్లు, మంకీ క్యాప్‌ల ధరలు అందరికీ అందుబాటులో ఉన్నా యి. మంచి రంగులు, డిజైన్లలో లభ్యమవుతున్నాయి. చలి నుంచి రక్షణకు మంచిగా ఉపయోగపడుతున్నాయి. – జి.జయరాం, కుమ్మరిపుట్టు, ముంచంగిపుట్టు మండలం
వ్యాపారం బాగుంది
చలి పెరగడం వల్ల వ్యాపారం జోరుగా సాగుతోంది.అన్ని రకాల డిజైన్లలో దుస్తులు ఉన్నాయి.వినియోగదారులను ఆకట్టుకునేందుకు కాస్తంత తక్కువ ధరలతో నాణ్యమైన వ్యాపారం చేస్తున్నాం.లాభసాటిగా ఉంది. – పి.రాజారావు, వ్యాపారి, జోలాపుట్టు, మంచంగిపుట్టు మండలం
ఆలస్యంగా పర్యాటకుల రాక
సన్‌రైజ్ వ్యూ పాయింట్ వద్ద ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 5 గంటలకే వచ్చే పర్యాటకులు ఈ ఏడాది 7 గంటల తరువాత వస్తున్నారు. – బారికి సుమన్, గిరిజనుడు, మాడగడ, అరకులోయ
ఈ ఏడాది చలి బాగా ఎక్కువ
గతంలో ఎప్పుడు ఇంత చలి లేదు. ఈ ఏడాది చలికి బయటకు వచ్చేందుకు సాహసించలేకపోతున్నాం. అత్యవస పరిస్థితి అయితే తప్పా ఉదయం 8 గంటలు దాటితేనే బయటకు వస్తున్నాం. – గెడ్డం నర్సింగరావు, మందులషాపు యజమాని, అరకులోయ


