సగటున 2 నుంచి 5 డిగ్రీల మేర పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 6.1 డిగ్రీల సెల్సియస్ నమోదు
రానున్న నాలుగు రోజులు మరింత చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే.. 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. చలికాలం మధ్యస్థానికి చేరుకోవడంతో ఉష్ణోగ్రతలు పతనమవుతాయని, ఈశాన్య దిశ నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని స్పష్టం చేసింది. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని సూచిస్తూ.. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో.. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 32.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి మండలం తిర్యాణిలో 6.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 6.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 6.9 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. హైదరాబాద్‌లో గరిష్టం 29.9, కనిష్టం 13.0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవటంతో పాటు మంచు కురుస్తుండటంతో.. రాత్రి వేళ ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే.. : రాష్ట్రంలో శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల రికార్డు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి మండలంలోనే ఉంది. 2021 డిసెంబర్ 21న అతి తక్కువగా 3.5 డిగ్రీలు నమోదైంది.


