సాక్షి, బళ్లారి: విమాన ప్రయాణంలో ఉండగా హఠాత్తుగా విదేశీ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో మాజీ మహిళా ఎమ్మెల్యే వైద్యసేవలతో ఆమెకు ప్రాణం పోశారు. ఈ సంఘటన గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. గోవా నుంచి టేకాఫ్ తీసుకున్న 10 నిమిషాల్లోనే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ (31) అస్వస్థతకు గురైంది.
గుండెపోటుతో సొమ్మసిల్లింది. అదే విమానంలో బెళగావి జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే జెన్నీ పరిస్థితిని గమనించి సీపీఆర్‌తో ఆమెకు కృత్రిమ శ్వాస కల్పించారు. దీంతో జెన్నీ కోలుకుంది. ఆమె అభ్యర్థన మేరకు అంజలి విమానం దిగే వరకు పక్కనే కూర్చున్నారు. విమానం ఢిల్లీలో ల్యాండయిన వెంటనే జెన్నీని ఆస్పత్రికి తరలించారు. అంజలిని సీఎం, నెటిజన్లు అభినందించారు.


