న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సిబ్బంది తక్కువగా ఉందనే విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అంగీకరించారు. త్వరలోనే వీటిని పూర్తి చేసి ‘సాయ్’ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.
గత ఆగస్టులో క్రీడలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ‘సాయ్’ (SAI)లో నిధుల కొరత ఉందని, తగినంత సిబ్బంది కూడా లేదని తమ నివేదికలో వెల్లడించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ లోక్‌సభలో ఎంపీ ఆడూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నపై మాండవీయ స్పందించారు.
‘ప్రభుత్వం ఈ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. స్పోర్ట్స్ అథారిటీలో మొత్తం 1191 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొన్నింటికి సంబంధించిన నియామక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బడ్జెట్‌లో ‘సాయ్’కు రూ.830 కోట్లు కేటాయించాం. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మా వద్దకు వచ్చిన ప్రతిపాదనలను బట్టి ఈ నిధులు ఇస్తాం.
అయితే ఏడాది మధ్యలో కూడా అవసరమైతే తగిన పరిశీలన అనంతరం అదనపు నిధులు కూడా ఇస్తాం’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి గణాంకాలు తాము నమోదు చేయడం లేదని... అయితే పోటీలు, శిక్షణ సమయంలో వారికి సరైన, సురక్షిత వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కూడా మాండవీయ పేర్కొన్నారు.


