మనం ఖర్చు పెట్టుకోవడానికి ఇంట్లో పెద్దవారు కానీ, యజమానులు కానీ నగదు కాకుండా బ్లాంక్ చెక్లు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు ‘ఇదిగో యాప్.. ఖర్చు పెట్టుకోండి’ అని ఇచ్చే పరిస్థితి వచ్చింది.
ఎన్పీసీఐ అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL).. తన భీమ్ పేమెంట్స్ యాప్ లో ‘యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్’ ఫీచర్ను ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా కావాల్సినవారిని సర్కిల్లోకి తీసుకుని మన అకౌంట్ నుంచి వాళ్లు డబ్బులు వాడుకునేలా చేయొచ్చు. నెలకు ఇంత అని రూ .15,000 వరకు ప్రీసెట్ చేస్తే ఇక వారు తమకు కావాల్సినప్పుడల్లా సలువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు వారికి సొంత యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతా కూడా అవసరం లేదు. ఇలా ఎన్నికాలం వాడుకోవచ్చు (1 నెల నుండి 5 సంవత్సరాల వరకు) అన్నది కూడా సెట్ చేయొచ్చు.
ఎన్బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలిత నటరాజ్ మాట్లాడుతూ, ఈ ఫీచర్ సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తమ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, డిజిటల్ చెల్లింపులను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు.
యూపీఐ సర్కిల్ను ఎలా ఉపయోగించాలంటే..
భీమ్ యాప్లోకి వెళ్లి యూపీఐ సర్కిల్ ఓపెన్ చేయండి.
'ఇన్వైట్ టు సర్కిల్'ను ఎంచుకుని కాంటాక్ట్ ని యాడ్ చేయండి.
వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి లేదా క్యూఆర్ స్కాన్ చేయండి.
'అప్రూవ్ ఎ మంత్లీ లిమిట్'ను ఎంచుకోండి
రిలేషన్ షిప్ సెట్ చేసి గుర్తింపును (ఆధార్/ఇతర డాక్యుమెంట్ లు) వెరిఫై చేయండి
ఖర్చు పరిమితి (రూ.15,000 వరకు), వ్యాలిడిటీ (1 నెల నుంచి 5 సంవత్సరాలు) సెట్ చేయండి.
ఖాతాను ఎంచుకుని యూపీఐ పిన్తో ప్రమాణీకరించండి.
ఇప్పుడు అవతలివారు అంగీకరించిన తర్వాత కొద్దిసేవటికి చెల్లింపులను ప్రారంభించవచ్చు.


