రెండు దశాబ్దాల క్రితం.. బ్యాంకుకి వెళితే పెద్ద క్యూ లైన్, చేతిలో చెక్కు పుస్తకం, సంతకం వెరిఫికేషన్ కోసం ఎదురుచూపులు. అప్పట్లో ఒకరికి డబ్బు పంపాలంటే చెక్కు రాసి ఇవ్వడమే అత్యంత సురక్షితమైన, ఏకైక మార్గం. ఇరవై ఏళ్ల క్రితం దేశంలోని మొత్తం ఆర్థిక లావాదేవీల విలువలో 98.8 శాతం వాటా చెక్కులదే. కానీ, కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అదే బ్యాంకు మన అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు సంతకం కోసం నిమిషాలు వేచి చూసిన మనం, ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో పని ముగిస్తున్నాం. ఈ మార్పు వెనుక చాలానే కారణాలున్నాయి.
ఆర్థిక లావాదేవీల పరిణామం
భారతీయ బ్యాంకింగ్ రంగంలో గత ఇరవై ఏళ్లుగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జరుగుతున్న మార్పులు విస్మయానికి గురిచేస్తాయి. ఒకప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలంటే కేవలం చెక్కులే దిక్కు. కానీ నేడు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఒక్క క్లిక్‌తో క్షణాల్లో పని పూర్తవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం మొత్తం వార్షిక లావాదేవీల విలువలో చెక్కుల వాటా ఎలా పడిపోయిందో చూద్దాం.
| సంవత్సరం | లావాదేవీల విలువలో చెక్కుల వాటా (%) |
|---|---|
| 2005 | 98.8% |
| 2010 | 92.5% |
| 2015 | 50.7% |
| 2020 | 15.4% |
| 2024 | 8.5% |
2005లో దాదాపు పూర్తి స్థాయిలో (98.8%) రాజ్యమేలిన చెక్కులు, 2024 నాటికి కేవలం 8.5 శాతానికి పడిపోయాయి. అంటే ప్రజలు, వ్యాపార సంస్థలు పేపర్ ఆధారిత లావాదేవీల కంటే ఎలక్ట్రానిక్ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.
మార్పునకు కారణాలు
పెద్ద నోట్ల రద్దు.. 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక టర్నింగ్ పాయింట్. నగదు కొరత ఏర్పడటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. ఇది డిజిటల్ వాలెట్లు, కార్డ్ పేమెంట్స్ వాడకాన్ని ఒక్కసారిగా పెంచింది.
యూపీఐ విప్లవం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) చెక్కుల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. చెక్కు రాసి బ్యాంకుకు వెళ్లి, అది క్లియర్ అవ్వడానికి రెండు రోజులు వేచి చూసే బదులు సెకన్లలో డబ్బు పంపే సౌలభ్యం యూపీఐ కల్పించింది.
డిజిటలైజేషన్, ఇంటర్నెట్ వ్యాప్తి.. చౌకైన డేటా ధరలు, స్మార్ట్‌ఫోన్ల లభ్యత పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సాధారణమయ్యాయి. నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి సేవలు చెక్కుల అవసరాన్ని భారీగా తగ్గించాయి.
భవిష్యత్తు అంచనాలు
భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు మరింత వినూత్నంగా మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ‘ఈ-రూపాయి’(e-Rupee) రాబోయే రోజుల్లో ఫిజికల్ క్యాష్, చెక్కుల అవసరాన్ని మరింత తగ్గిస్తుంది. భవిష్యత్తులో కేవలం ముఖ గుర్తింపు లేదా వేలిముద్రలతో మరింత సురక్షితమైన లావాదేవీలు జరగనున్నాయి. యూపీఐ సేవలు ఇప్పటికే ఇతర దేశాలకు (సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్ వంటివి) విస్తరిస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ లావాదేవీల్లో కూడా చెక్కులు లేదా డ్రాఫ్టుల వాడకం కనుమరుగవుతుంది. ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్‌లతో పనిలేకుండా ‘నియో బ్యాంక్స్(డిజిటల్ బ్యాంకులు)’ ప్రాధాన్యత పెరగనుంది.
ఇదీ చదవండి: పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది!


