బాధితుడి సిమ్ మరో ఫోన్‌లో వేసుకొని యూపీఐ ద్వారా డబ్బులు కొట్టేసిన నిందితుడు
మరో నేరంలో రోల్డ్ గోల్డ్‌ను ఒరిజినల్ బంగారంగా చూపించి రూ.1 లక్ష తీసుకొని పరార్
నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
చీమకుర్తి: సినీ ఫక్కీలో సిమ్‌కార్డులను మార్చేసి రూ.5.21 లక్షలు కొట్టేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలేనికి చెందిన ఆదిపూడి వెంకట శేషయ్య ఇటీవల బక్కిరెడ్డిపాలేనికి బంధువుల వద్దకు వచ్చాడు. అక్కడ 63 ఏళ్ల వయస్సున్న వీరపల్లి వెంకయ్యతో మాట కలిపి బంధువులకు ఫోన్ చేసుకొని ఇస్తాను ఫోన్ ఇవ్వమని తీసుకున్నాడు. వెంకయ్య ఫోన్ సాధారణ బేసిక్ ఫోన్. శేషయ్య ఆ ఫోన్‌లో ఉన్న సిమ్ తీసి తన వద్ద ఉన్న ఫోన్‌లో వేసుకుని, తన దగ్గర ఉన్న సిమ్‌కార్డును వెంకయ్య ఫోన్‌లో వేశాడు.
ఈ పనంతా ఫోన్ తీసుకున్న తర్వాత మాట్లాడుతున్నట్లు నటిస్తూ చేశాడు. ఈలోపు వెంకయ్యకు ఫోన్‌కాల్స్ రావడానికి ఇబ్బంది లేకుండా కాల్‌డైవర్షన్ పెట్టాడు. అనంతరం వెంకయ్య సిమ్ నంబర్ యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసి అతని అకౌంట్‌లో ఉన్న రూ.5.21 లక్షలను బెట్టింగ్ యాప్‌లలో పెట్టాడు. దాని ద్వారా వచ్చిన డబ్బును శేషయ్య తన బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేలా చూసుకున్నాడు.
ఇదంతా నవంబర్ నెల 4వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగింది. తీరా బాధితుడు బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్‌లో ఉన్న డబ్బులు గల్లంతయ్యాయని గమనించి గత నెల 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు పోలీసులు నిందితుడిని శనివారం గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.2.60 లక్షల నగదు, సెల్‌ఫోన్, రెండు సిమ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. ఒంగోలు కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ దాసరి ప్రసాదరావు తెలిపారు.
రోల్డ్‌గోల్డ్‌ను తాకట్టుపెట్టి రూ.1 లక్షతో పరార్
నెల్లూరు జిల్లా జలదంకి మండలం రామవరప్పాడుకి చెందిన కడియాల వెంకటేశ్వరరావు చీమకుర్తికే చెందిన గట్టుపల్లి వెంకటసాయి భరత్ వద్ద బ్రాస్‌లెట్ పెట్టి రూ.1 లక్ష అప్పుగా తీసుకున్నాడు. సెపె్టంబర్ నెల 19న ఈ సంఘటన జరిగింది. తర్వాత బ్రాస్‌లెట్‌ను పరీక్షించగా అది రోల్డ్‌గోల్డ్ అని తెలియటంతో సీసీ కెమెరాల ఆధారాలతో ఈనెల 3న పోలీసులకు బాధితుడు వెంకట సాయి ఫిర్యాదు చేశాడు. శనివారం నిందితుడు వెంకటేశ్వరరావును చీమకుర్తి తూర్పు బైపాస్‌లో అదుపులోకి తీసుకొని రూ.5.40 లక్షలు స్వా«దీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాదరావు మీడియాకు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పేర్కొన్నారు.


