
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐవోబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 1,226 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 777 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 5,856 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 5,055 కోట్ల వడ్డీ ఆదాయం సాధించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.72 శాతం నుంచి 1.83 శాతానికి తగ్గాయి.
ఇండియన్ బ్యాంక్ లాభం ప్లస్
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో స్టాండెలోన్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 3,018 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,706 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ. 11,964 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 11,125 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,099 కోట్ల నుంచి రూ. 739 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.48%ం నుంచి 2.6 శాతానికి తగ్గాయి.
సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం అప్
ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో స్టాండెలోన్ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 351 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం లాభించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 325 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం క్షీణతతో రూ. 808 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడ్డాయి. వడ్డీయేతర ఆదాయం 26 శాతం ఎగసి రూ. 516 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 43 శాతం క్షీణించి రూ. 63 కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.4 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గాయి. బ్రాంచీల సంఖ్య 948కు చేరింది.