డిసెంబర్ సమయం
డిసెంబర్ వచ్చింది. అందరి భావనా కన్ను మూసి తెరిచేంతలో కొత్త సంవత్సరం వచ్చేసిందే అని. కాని డిసెంబర్ మాసం ‘ఎగ్జామ్ ఇవాల్యుయేటర్’ వంటిది. ఈ సంవత్సరం మొత్తం మీరు కుటుంబ, ఆర్థిక, వ్యక్తిగత, స్నేహ, బౌద్ధిక, కళారంగాలలో మీ సమయాన్ని ఎలా వెచ్చించారో, ఏ మేరకు ఎదిగారో బేరీజు వేస్తుంది. అందుకే కాగితం తీసుకుని హైలైట్స్ రాసుకోండి. వచ్చిన మార్కులను బట్టి కొత్త ఏడాదికి మరింత జాగ్రత్తగా సిద్ధం కండి.
కాలం దగ్గర మేజిక్ ఉంటుంది. అది కొందరికి చిటికెలో అయిపోయిన భావన ఇస్తుంది. మరొకరికి ఎంతకూ గడవని మొండిఘటంలా తోస్తుంది. అంతా మానసికమే. మన చేతుల్లో ఉన్న సంగతే. ‘గర్వించ దగ్గ విషయం’ ఏమిటంటే గతంలో కొందరికి మెల్లగా, కొందరికి వేగంగా గడిచిన కాలం ఇప్పుడు అందరికీ ఒక్కలాగే పరుగు పరుగున సాగుతోంది. కారణం? అందరి చేతుల్లో ఫోన్లు ఉండటమే. అలా రీల్స్ చూస్తూ ఉంటే డిసెంబర్ రావడం ఏమిటి... దశాబ్దాలే గడిచిపోతాయి. నిజం. ఎన్ని డైవర్షన్స్ ఇవాళ మన జీవితంలో! ఎంత తీరుబడిలేనితనం – ‘పనికిమాలిన విషయాల ఆక్రమణ వల్ల!
సమయమంతా వాటికి వెచ్చించడం వల్ల. అలా వెనక్కు తిరిగి చూడండి. ఈ సంవత్సరం నిర్మాణాత్మకంగా ఏమైనా చేయగలిగారా? సాధించగలిగారా? 2024 డిసెంబర్ చివరన తీసుకున్న నిర్ణయాలు ఏవైనా కొన్ని అమలు చేయగలిగారా? అలా గాల్లో చూస్తూ మననం చేసుకుంటే లెక్క తేలదు. పేపర్ మీద పెట్టాలి. ఒక తెల్లకాగితం తీసుకుని మీ పేరు రాసి కింద ‘హైలైట్స్ 2025’ అని హెడ్డింగ్ పెట్టి ఒక్కో విభాగంలో ఏమైనా చేశారో చేయలేకపోయారో రాసుకోండి. అప్పుడు సంవత్సరం ఎలా గడిచిందో తెలుస్తుంది. తప్పులు ఒప్పులు తెలుస్తాయి. అప్రమత్తత కలుగుతుంది. కాలం విలువైనది. కాలానికి విలువనిచ్చినవారే విలువైన జీవితాలను నిర్మించుకుంటారు.
కుటుంబం: కుటుంబానికి ఎంత సమయం ఇవ్వగలిగారో రాసుకోండి. కుటుంబ సభ్యుల సబబైన ఆకాంక్షలకు ఏమేరకు సపోర్ట్ చేయగలిగారు? అసలు వారి ఆకాంక్షలేమిటో విన్నారా? ప్రతి సభ్యుడికి సమానమైన విలువ, గౌరవం ఇచ్చి తద్వారా మీరు గౌరవం పొందారా? థ్యాంక్యూలు ఎక్కువా... లేదా సారీలా? కుటుంబ ఆరోగ్యం గురించి, హెల్త్ పాలసీల గురించి, పెద్దలకు చేయించాల్సిన టెస్ట్‌ల గురించి ఎంత సమయం ఇచ్చారు? వారు మీ పట్ల సంతృప్తిగా ఉన్నారా? పేపర్ మీద రాసుకుంటూ ఉంటే మీరు మెరుగ్గానే వ్యవహరించినట్టుగా అనిపిస్తోందా?
ఆర్థికం: గత సంవత్సరం సంపాదన కన్నా ఈ సంవత్సరం సంపాదన విషయంలో కొత్త ఆలోచనలు చేశారా? ఒక ఆదాయ మార్గంపై ఆధారపడకుండా ఇతర ఆదాయ మార్గాలకు ప్రయత్నించారా లేదా? ఈ సంవత్సరం పొదుపు ఎంత? పెట్టుబడి ఎంత? కనీసం కాసింత బంగారం అయినా కొని దాచగలిగారా? దుబారా జరిగితే ఎందుకు జరిగినట్టు? డబ్బు విషయంలో మార్చుకోవలసిన పద్ధతులు, బలహీనతలు మార్చుకున్నారా? ఆర్థికంగా జరిగిన తప్పులు ఏమిటి? నెక్ట్స్ ఏం చేయాలి?
వ్యక్తిగతం: మిమ్మల్ని మీరు పట్టించుకున్నారా? వ్యాయామం, దృఢత్వం, చలాకీతనం వీటికై ఏం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య పరీక్షలు, ‘రిపేర్లు’ చేయించుకున్నారా? కంటి, పంటి వైద్యాలు... బరువు అదుపు... కేశ, చర్మ సంరక్షణ... సమతుల్య ఆహారం... తినకూడని ఆహారాన్ని మానేయడం... ఈ సంవత్సరం ఎన్ని లెక్కలేనితనాలు... ఇవన్నీ రాబోయే సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా ఉండాలంటే పేపర్ మీద మీరు వేసుకున్న మార్కులే హెచ్చరిక.
స్నేహం: స్నేహితులను నిలబెట్టుకోవడమే కాదు టాక్సిక్ స్నేహాలను, మొహమాట పెట్టి మనల్ని ఎక్స్ ప్లాయిట్ చేసుకునే స్నేహాలను వదులుకోవడం కూడా ముఖ్యమే. ఈ సంవత్సరం మీ స్నేహవాతారణం ఎలా ఉంది. మంచి స్నేహితుల కోసం మీరు ఏం చేశారు? వారికి మీ స్నేహాన్ని, ప్రేమనూ పంచారా? చెడ్డ స్నేహితులు మిగిలి మంచి స్నేహితులు మీ నుంచి దూరమై ఉంటే మీ దోషాలు ఏమిటో చూసుకున్నారా? స్నేహం వల్లే కాలం సులువుగా కదులుతుంది. స్నేహంలో మీకు వచ్చిన
మార్కులు ఎన్ని?
మెదడుకు ఆహారం: మనిషి మెదడు ఒక సూపర్ కంప్యూటర్. దానికి జ్ఞానం ఇచ్చే కొద్దీ అది జీవనాన్ని సులభతరం చేస్తుంది. నేర్చుకుంటూ ఉన్నప్పుడే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం మెదడుకు కొత్త విషయాలు ఏం చె΄్పారు? మంచి ఆలోచనాత్మక పుస్తకాలు, వ్యాసాలు, ప్రపంచ పరిణామాలు, ప్రకృతి విషయాలు ఏం తెలుసుకున్నారు? కొత్త ప్రాంతాలు ఏం చూశారు. పోనీ పిల్లల పుస్తకాల్లో ఉన్న కనీస విషయాలైనా మనం తెలుసుకున్నామా? సమాజం ఎటు పోతున్నదో తెలుసుకోకుండా మనం సరిగ్గా వెళ్లలేం. మేధో విషయాలను తెలుసుకోవడంలో మీకు వచ్చే మార్కులు ఎన్ని?
కళారంగం: ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏం ఉంటుంది’ సినిమాలో డైలాగ్. సంగీతం, నాటకం, మంచి సినిమా, సాహిత్యం... ఈ సంవత్సరం వీటికి మీరిచ్చిన సమయం ఎంత? మంచి అనుభూతులను పొందింది ఎంత? 2025లో ఎన్నో ఉత్తమ పుస్తకాలు, పాటలు, సినిమాలు వచ్చాయి. వాటికి ఏ మేరకు సమయం ఇచ్చారు? మీ ఊళ్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారా? మీ కంటూ ఒక అభిమాన రచయితో, నటుడో, గాయకుడో ఉన్నాడా? జీవితం వేరు, రసాత్మక జీవితం వేరు. కళలతో జీవితం, కాలం రసాత్మకం అవుతాయి. మరి మీకొచ్చిన మార్కులెన్ని?
బేరీజు వేసుకోండి. కొత్త సంవత్సరానికి సిద్ధం కండి.


