జడ్జిని హెచ్చరించిన జార్ఖండ్ లాయర్‌కు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: జార్ఖండ్ హైకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తితో పరుషంగా మాట్లాడిన లాయర్ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఆ లాయర్ క్షమాపణను సానుభూతితో స్వీకరించాలని హైకోర్టుకు కూడా సూచించింది. గతేడాది అక్టోబర్ 16వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణకు సంబంధించిన కేసును లాయర్ మహేశ్ తివారీ హైకోర్టులో వాదిస్తున్నారు.
కనెక్షన్ తిరిగి ఇచ్చేందుకు రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని క్లయింట్ తరఫున ఆయన ప్రతిపాదించగా, మొత్తం బకాయిలో 50 శాతం చెల్లించడం తప్పనిసరంటూ గత తీర్పులను న్యాయమూర్తి రాజేశ్ కుమార్ ఉదహరించారు. చివరకు రూ.50వేలు డిపాజిట్ చేయాలనే నిబంధనతో సమస్య పరిష్కారమైనప్పటికీ, వాదనల సమయంలో మాటామాటా పెరిగింది. లాయర్ తివారీ తీరు సరిగా లేదంటూ జస్టిస్ కుమార్ జార్ఖండ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు ఆగ్రహించిన మహేశ్ తివారీ.. ‘నేను ఇలాగే వాదిస్తా..హద్దు మీరకండి’అంటూ కోర్టు హాలులో న్యాయమూర్తితో వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ చౌహాన్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం లాయర్ తివారీకి ధిక్కారణ నోటీసు పంపింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. లాయర్ తివారీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదన వినిపించారు.
తన క్లయింట్ అప్పటి ఘటనపై పశ్చాత్తాపం చెందుతున్నారని, బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గౌరవ న్యాయమూర్తిని అగౌరవపర్చాలని గానీ, కోర్టు కార్యకలాపాలకు అవరోధం కలి్పంచాలని గానీ ఆయన ఉద్దేశం కాదన్నారు. స్పందించిన ధర్మాసనం ధిక్కారం నోటీసు ఇచి్చన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట తివారీ క్షమాపణ చెబితే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ వేయాలంది. దీనిని సానుభూతితో పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. అదేసమయంలో లాయర్ ప్రవర్తనను ధర్మాసనం ఆక్షేపించింది. ‘జడ్జిల ఎదుట ఆయనే స్వయంగా హాజరై వివరణ ఇవ్వొచ్చు కదా? మూర్ఖత్వానికి తగు ఫలితం స్వయంగా అనుభవించాల్సిందే. అతడినే వివరణ ఇచ్చుకోనివ్వండి. అక్కడా గుడ్లు ఉరమాలని అనుకుంటే... ఉరమనీయండి. అతడిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.


